| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 129. జీవనావ |
| 129. జీవనావ |
| ఎన్ని సంద్రముల నెన్ని నదంబుల నీ జీవనావ గడపితి నౌరా కన్నులకు నెత్తు రెగదట్టెదు నది జ్ఞాపకమ్మునకు వచ్చెడి నేనిన్! |
| ఘోరమౌ తుపాను మధ్యమున బడి కొట్టుకొనుచు జీవితాశ వీడుచు కారుణ్యరాశియౌ పరమేశ్వరు కరుణ నెట్లొ బ్రతికి బైటబడితిన్. |
| సుడిగుండంబుల జిక్కుక బిఱబిఱ సురసుర దిరుగుచు మునుగుచు దేలుచు నడియాసగ నెంచి బ్రతుకుటెల్లను గడచి యెట్టులో త్రప్పి బ్రతికితిన్. |
| నిర్జనంబులౌ ద్వీపాంతరముల నెట్లెట్లో చేరి యచ్చటను తి ర్యగ్జంతువులను బోలి జ్ఞాన మను నది యేమాత్రము లేక తిరిగితిన్. |
| మలమాంసమే మృష్టాన్నమ్మటు మెక్కుచు క్షారజలంబుల ద్రావుచు కాలవశుడనై క్రూరభోగినుల కౌగిళుల జొక్కి విషరుచి గంటిన్. |
| పడిపడి యిడుముల బడరానిపాట్లు బడి కలగి తలగి యలజడి బెగ్గిలి కడ కా పరమేశ్వరు నవ్యాజపు కరుణ చేతనే బ్రతికి వచ్చితిన్. |
| సాయంకాల మ్మరుణవదనుడై సముద్రగర్భము జొచ్చెడు సూర్యుని వేయాఱు విధముల దీనుడనై వేడికొంటిని నన్నిలు జేర్పుమంచు. |
| కడకు కంటి నా తపఃఫలమ్ముగ కరుణాహాసోదంచితమూర్తిని కడచి బడసి చింతనామృతమ్మును కన్నీళ్ళ తీపి నాత్మను దనిపితి |
| నెన్ని సంద్రముల నెన్ని నదంబుల నీ జీవనావ గడపితి నౌరా! కన్నులకు నెత్తు రెగదట్టెడు నది జ్ఞాపకమ్మునకు వచ్చెడి నేనిన్. |