| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 002. కోకిల |
| 02. కోకిల |
| ఈ మావిపై నుండి ఈవు కూ కూ యంచు నామావిపై నుండి ఆపె కూ కూ యంచు నేమి బాసల జేతురే! కోకిలా! యేమి బాసల జేతురే? |
| ప్రకృతి జన్యంబులై పరమ రమ్యంబులౌ భావముల నొండొరుల ప్రణయ మొల్కెడునట్లు పల్కరించుచు నుంటిరే, కోకిలా! పల్కరించుచు నుంటిరే? |
| మనుజుల కగమ్యమై మహితశక్తిం గల్గి పరమామృతము లొల్క ప్రణయ వాక్కుల మీరు బాస లాడుచు నుంటిరే, కోకిలా! బాస లాడుచు నుంటిరే? |
| పరులు విన్నను మీదు పరువు పోవు నటంచు పాడు లోకము జూచి భయమె లేకను వలపు పలుకు లాడగ జెల్లునే కీకిలా! పలుకు లాడగ జెల్లునే? |
| పరమ ప్రేమస్వరూ పంబులై లోకాల పావనంబుల జేయు ప్రణయకవులౌ మీకు పరు లనేవా రుందురే కోకిలా! పరు లనేవా రుందురే? |
| చెలియయును నీవలెనె చివురుటాకుల మెక్కి చెవులపండువు గాగ చిలుకంగ గానమ్ము చింత నీ కేమున్నదే, కోకిలా! చింత నీ కేమున్నదే? |
| చెంత గూర్చుని మోము చెలువు గుల్కగ వలపు దెలుపుచుం బలుకంగ చెలిచెంత లేని నా చింత లెన్నడు తీరునే, కోకిలా! చింత లెన్నడు తీరునే? |
| పాడవే కోకిలా పాడవే యింపుగా ప్రాణముల్ హాయిచే పరవశ మ్మొందగా పాట పాడవె తీయగా, కోకిలా! పాట పాడవె తీయగా? |