| కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 016. వెఱ్ఱిపిల్ల |
| 16. వెఱ్ఱిపిల్ల |
| గుత్తొంకాయ్ కూరోయ్ బావా! కోరి వండినానోయ్ బావా! కూరలోపలా నా వలపంతా కూరిపెట్టినానోయ్ బావా! కోరికతో తినవోయ్ బావా! |
| తియ్యని పాయసమోయ్ బావా! తీరుగ వండానోయ్ బావా! పాయసమ్ములో నా ప్రేమనియేటి పాలుబోసినానోయ్ బావా! బాగని మెచ్చాలోయ్ బావా! |
| కమ్మని పూరీలోయ్ బావా! కర కర వేచానోయ్ బావా! కరకర వేగిన పూరీలతో నా కాంక్ష వేపినానోయ్ బావా! కనికరించి తినవోయ్ బావా! |
| వెన్నెల యిదుగోనోయ్ బావా! కన్నుల కింపౌనోయ్ బావా! వెన్నెలలో నా కన్నెవలపనే వెన్న గలిపినానోయ్ బావా! వేగముగా రావోయ్ బావా! |
| పువ్వుల సెజ్జిదిగో మల్లే పువ్వుల బరిచిందోయ్ బావా! పువ్వులలో నా యవ్వనమంతా పొదిపిపెట్టినానోయ్ బావా! పదవోయ్ పవళింతాం బావా! |