శతకములు చెన్నమల్లు సీసములు
1 14 19 22 26 31 36
మాహేశ్వర స్థలము
సర్వేశుఁ డనఁజాల సర్వాత్ముఁ డనఁజాల - సర్వగతుం డనఁ జాలఁ జాల
హరుఁ డనఁజాల మూర్ధాంగుఁ డనంజాల - జర్మాస్థిధరుఁ డనఁజాలఁ జాల
శశిమౌళి యనఁజాల సర్పాంగుఁ డనఁజాల - నీలగళుం డనఁజాలఁ జాల
మూర్తి నాఁజాల నమూర్తియు ననఁజాల - సాధ్యాదం బనఁజాలఁ జాలఁ
 
బ్రాణనాథునందు భక్తైక్యతనునందు - లింగమందు గురువుజంగమందుఁ
గందునట్ల వినుతి గావింతు సేవింతు - నిన్నుఁ మదిఁ దలంతుఁ జెన్నమల్లు.
14
కరమర్థి నీకు శృంగారంబుగాఁ బూజ - సేయుదుఁగాని యాశింప ఫలము
వేడుకతోడుత విభవార్థముగ నుతుల్‌ - సేయుదుఁగాని యాశింప మెప్పు
తగిలి నీకు సుఖార్థముగఁ బదార్థార్పణ - సేయుదుఁగాని యాశింప రుచుల
లాలితంబుగ నీకు లీలార్థముగ భక్తి - సేయుదుఁగాని యాశింప ముక్తి
 
నీవు పూజాఫలార్థివే నిష్ఫలార్థి - నీవు కీర్తి ప్రియుండవే నిష్క్రియుండ
సకలసుఖభోగి వీవె ప్రసాదముక్తి - సన్నిహితుఁడను నీబంటఁ జెన్నమల్లు.
15
చూడ్కి నీలోఁ జూచి చూడంగవలవదే - వినికి నీవినికిగా వినఁగవలదె
నెఱిదాఁకకటమున్న గుఱిచేయవలవదే - నడుపు నీ వెంబడి నడువవలదె
రుచులు నీజిహ్వను రుచియింపవలవదే - చేత నేచేయిగాఁ జేయవలదె
తలఁపు నీలో నుండి తలఁపంగవలవదే - పలుకు నీముఖమందుఁ బలుకవలదె
 
యంత్రధారిచేతి జంత్ర మున్నటులు నీ - వాడినట్లు దేహ మాడవలదె
యట్లుగాన నీమహాప్రసాదానూన - సిద్ధి కేవలంబె చెన్నమల్లు.
16
సంకీర్ణలౌకికాచారవర్జితుఁడేని - విధినిషేధక్రియావివశుఁ డెట్లు
విధినిషేధక్రియావిరహితవర్తులే - నుభయకర్మఫలప్రయుక్తు లెట్టు
లుభయకర్మఫలోత్త రోద్యుక్తు లేనియు - స్వర్ాదిలోకప్రచారు లెట్లు
స్వర్గాదిలోక ప్రచార దూరగులేని - స్తన్యపానక్రియాసక్తు లెట్లు
 
అట్లుగాన లౌకికాచారదూరులఁ - బరమభక్తి రతులఁ బాత్రయుతుల
నతుల తత్త్వయుతుల నట్టిమహాత్ములఁ - జేర్పవయ్య నన్నుఁ జెన్నమల్లు.
17
జైమినికృతపూర్వమీమాంసకులు చతు - ర్థ్యంతంబు దా దైవ మని గుఱించి
కర్తలేఁడని కర్తకర్మంబె యని 'స్వర్గ - కామో యజే' త్తను కర్మకాండ
భాట్టశాస్త్రంబను భాష్యంబుసేయు భ - ట్టాచార్యలింగమ ట్లంతరింపఁ
బొరి మహిమ్నమున 'ముఖరయతి మోహాయ - జగతా' మనుచు నున్న శాస్త్రమతము
 
నడఁచె గావునఁ దత్త్వ మహత్త్వశక్తిఁ - దగిలి మీమాంసకుల ముక్కుఁ బగులఁగోసి
నట్టిభక్తుల వేదవేదాంతసార - శేఖరులఁ జేర్పవే నన్నుఁ జెన్నమల్లు.
18
AndhraBharati AMdhra bhArati - shatakamulu - chennamallu sIsamulu shatakamu - pAlakuriki sOmanAtha ( telugu andhra )