ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
బ్రహ్మాస్త్రముచే రావణుఁడు మడియుట
యనవుడు విని రాముఁడభిరామబలుఁడు
వినుతవిక్రమ 2339భుజావిభవనిర్భరుఁడు
విదితమౌ శస్త్రాస్త్త్ర వేదియుఁగాన
“యిది వేళ బ్రహ్మాస్త్ర మెత్తంగ.”ననుచు
భూదేవ దేవ తపోధన వేద
వైదికకర్మప్రవర్తనల్‌ దలఁచి
తన ప్రతాపంబును దర్పంబు మెఱసి
ధనువు మ్రోయించుచు ధరణి గంపింపఁ
గౌశికకృతమైన క్రతువేళఁ దనకుఁ
గౌశికుఁడిచ్చినఁగైకొన్నయట్టి
యక్షయబ్రహ్మాస్త్ర మప్పుడు దలఁచి
దక్షత వేదమంత్రము2340లుచ్చరించి
తిరముగా నరిఁబోసి తెగ నిండఁదిగిచి
పరగఁబ్రత్యాలీఢ పాదుఁడై నిలిచి
దేవేంద్రుఁడాదిగా దివిజు లుప్పొంగ
దేవారియురముపై దృష్టి సంధించి
యేసె; నేయుటయుఁబె2341ల్లేచి యా బాణ
మాసురా2342లోక కీలాభీల మగుచు
వసువులు కెలఁకుల వనజాతమిత్ర
వసువులగ్రంబున 2343వాసవాదులును
2344బిఱుఁద ముందటమహాపృథులమారుతము
గఱుల నుజ్జ్వలదివ్యకళలెల్లవెలుఁగ,
సహజంబులై పేర్చి సంతతామోఘ
మహితమై దేదీప్యమానమై సకల
శాఖామృగాభీష్టసఫలమై చతుర
లేఖావలోకనాలీఢమై నిగుడి,
నిలువక విలయాభ్రనిర్ఘాతఘోష
2345ములు పర్వ రాక్షసముఖ్యులు బెదర,
జయజయధ్వనులతోఁజదలు గ్రక్కదల,
రయమున రావణోరస్థ్సలిఁగాఁడి
యయ్యింద్ర యమ వరుణాదులచేత
వ్రయ్యనిమర్మముల్‌ వ్రచ్చి, రావణుని
ప్రాణముల్‌ గొని యుచ్చి పాఱి, యా దివ్య
బాణంబు వెస మహీభాగంబుఁగాఁడె.
“నీ కూఁతుఁజెఱ2346పట్టి నీచభావమునఁ
గైకొనఁదలఁచిన ఖలునిప్రాణములు
కైకొంటి నే.” నని కదిసి భూస్థలికిఁ
బ్రాకటంబుగఁజెప్పఁ బఱచెనో యనఁగ
మహిఁగాఁడి పఱతెంచి మగుడి రాఘవుని
మహిత తూణీర మున్మద వృత్తిఁజొచ్చె
నలి బ్రహ్మమనుమని నాటి చంపుటకుఁ
గలిగినదోషంబు గడతేర్చుకొనఁగ
నే చందమున నెందు నితరంబు లేమి
చూచి రాఘవుమర్వు సొచ్చెనో యనఁగ.
రాఘవాస్త్రక్షత రక్తాంబుధార
లోఘంబులై పర్వ2347నొఱులుచు నంతఁ
గులిశధారాహతిఁగుంభినిఁగూలు
కులశైలమునుబోలి కూలె రావణుఁడు.
నా దైత్యుభూరి దేహాతిపాతమున
భూదేవి యప్పు డద్భుతముగాఁగ్రుంగెఁ;
గ్రుంగె శైలంబులుఁ; గ్రుంగె దిక్కరులుఁ;
గ్రుంగె భుజంగంబుఁ;గ్రుంగెఁగూర్మంబుఁ;
దలఁకిరి సప్తపాతాళవల్లభులుఁ;
దలఁకిరి హతశేషదైత్యపుంగవులు;
గిరిచరు లార్చిరి; కీర్తించి రమర
వరులుఁ; గిన్నరులు దిగ్వరులు ఖేచరులు;
నా రఘురాముపై నప్సరస్‌స్త్రీలు
బోరనఁగురిసిరి పుష్పవర్షములు;
దివ్యదుందుభులును దివ్యకాహళులు
దివ్యశంఖంబులు దివినిండ మ్రోసె;
శీతలపరిమళాశ్లిష్టవాయువులు
వీతెంచె; దిక్కులు విమలంబు లయ్యె.
సురమునిఖేచరశోకంబడంచి
పరికించి సకలభూభారంబు డించి
యభిమతజయశీలుఁడై పేర్చి రామ
విభుఁడంతఁదనచేతి విల్లెక్కు డించి
యానందమయచిత్తుఁడగుచు నావిల్లు
జానకీవిభుఁడు లక్ష్మణుచేతి కిచ్చె.
సకలవానరులును సకలఖేచరులు
సకలదిక్పతులును సకలభూపతులు
సకలభూతంబులు సకలదేవతలు
సకలగంధర్వులు సకల సన్మునులు
సకలపన్నగులును సకలసిద్ధులును
సకలలోకంబులు సన్నుతుల్‌ సేయ
ననిమొన గర్వాంధు నంధకాసురునిఁ
దునుమాడి విలసిల్లుధూర్జటి వోలె
రాముఁడు లోకాభిరాముఁడై విజయ
ధాముఁడై నవసుధాధాముఁడై యొప్పె.
నంత విభీషణుండధిక శోకమున
సంతాపమందుచు సమరమధ్యమున[వా.రా. సర్గ 112]
నలఘుఁడై పడియున్న యగ్రజుఁజూచి
పలుమాఱు నెలుఁగెత్తి పలవింపఁదొడఁగె:

  1. కళా
  2. లతోఁబుచ్చి
  3. ల్లెగసి
  4. లోల
  5. వసురత్నతతులు
  6. భిదురమందర… గదల
  7. ములసర్వ
  8. గొని
  9. నొరయుచు వచ్చి
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )