| శతకములు | ధూర్తమానవా శతకము |
|
|
మరణపు శయ్యమీఁద నొక-మారయినన్ నను దప్పకుండ సం స్మరణము చేసినంతటనె-స్వర్గము వచ్చునటందు, వేగతిన్ బొరయును? నిట్లె నీ వెపుడు-బొంకుచునుందువు దీనికై నినున్ గఱకఱ గొంతు కోసెదను-కానివి చెప్పకు ధూర్తమానవా! |
21 |
|
ఏ నొకజాతికూడు భుజి-యించుచు మిక్కిలి తక్కుజాతులన్ హీనముగాగఁ జూతునని-యెవ్వరు సెప్పిరి నీకు వంచకా! మానవు లందఱున్ సరిస-మానులు గారొకొనాకు? మాయురే! మానక నీవ యిట్టి యవ-మానముఁ జేతువె ధూర్తమానవా! |
22 |
|
త్వరపడకుండ సంజపడు-దాఁకను తప్పుపనుల్ పొనర్చి పై బొరుగున నున్న తోఁటలను-బూవులు మ్రుచ్చిలి కోసి తెచ్చి నా శిరమునఁ బోసినంతటనె-చేసిన పాపము లొక్కసారిగా మఱచెడునట్టి వెంగలినె-మానక యిట్టివి ధూర్తమానవా! |
23 |
|
పసులను, జెట్టుచేమలను,-బక్షితతిన్, గ్రిమికీటకాదులన్ బుసుకున దాకినంతఁ దల-పోయవు స్నానముమాట; కాని మా నిసి నినుఁ దాకినంతఁ దల-నిండుగ స్నానము ధర్మమార్గమే! ముసిముసినవ్వు నవ్వెదవు-మోరెగబట్టుక ధూర్తమానవా! |
24 |
|
బొచ్చు నొసంగి యెట్లు పరి-పూర్ణమనోరథసిద్ధిఁ బొందగా వచ్చును? బిచ్చివాఁడనని-భావమునం దలపోయుచుంటివా? పుచ్చును నీదు పాపములు-పోరచి మానుము యిట్టి వానినిన్; బొచ్చెము లిట్లుచెప్పి ప్రజ-మోసము చేయకు ధూర్తమానవా! |
25 |
|
ఒక దేవాలయమందు స్త్రీలకు రహ-స్యోత్సాహివై బోధముల్ నికరాదాయముతోడ జోడుచెవులున్-నిండించుచున్నావఁటే! అకటా కొంపల నెన్ని దీసితివొ య-త్యాచారముల్ సల్పి, నీ మొకమున్ రాసెద మానకున్న యెడలన్-ముమ్మాటికిన్ ధూర్తమానవా! |
26 |
|
బిడ్డలకోసరమ్ము విల-పించెడి యా జవరాండ్రతోడుతన్ బిడ్డలు తప్పకుండఁ బ్రభ-వించెదరంచు సమాదరంబునన్ గడ్డముపట్టి "గర్భగుడి"-గర్భముఁ జేర్చుదువట్టెరేల నో వెడ్డరి! నాకు మంచి పని-వెట్టితి వింతకు ధూర్తమానవా! |
27 |
|
వాజను మానకున్న నప-వాదులు; తప్పవు శృంగభంగముల్; రోజులు నీకుఁ జాల విసి-రో! జులుమింతకు మానకున్నచోఁ బాజివియౌదు వీవు నగు-బాటు ఘటిల్లును; నింక మీఁద నీ పోజును జూచి మోసపడి-పోవుట గల్గదు ధూర్తమానవా! |
28 |
|
తిరిపెము నెత్తియెత్తి యతి-దీనతఁ దిర్గుచు జోలి బట్టుచున్ తిరుపతికొండ మీఁది కెగ-దేకుచు నచ్చట చెప్పుదెబ్బ లీ వొరువుగఁ దిన్న లేశము ప్ర-యోజన ముండదు ధర్మమార్గమున్ బిఱిఁదికిఁ ద్రోసిపుచ్చి పర-పీడకుఁ బూనిన ధూర్తమానవా! |
29 |
|
తిరుపతిఁ బుట్టి; రంగపురి-తెన్నుల వర్ధిలి; కాశిలోపలన్ మరణము పొందినప్పటికి-మారదు కర్మఫలానుభూతి; నీ వెరిగియు దీని స్వార్థరతి-నెల్లవిధంబుల నెంతమందినో పురపుర నెల్లవేళలను-మోసముఁ జేతువే ధూర్తమానవా! |
30 |