| శతకములు | ధూర్తమానవా శతకము |
|
|
ఇతరులఁ బర్వుతో బ్రదుక-నిచ్చుట నెన్నఁడు నేర్చికొందు వా యతమగు నీ ప్రపంచసుఖ-మన్నది యొక్కటె నీ సుఖంబుగాఁ బ్రతిదినమున్ స్మరించు సమ-భావము నెన్నఁడు నేర్చికొందు వు న్నతిఁ గనుచుండి నీ ప్రజ ల-నారతమున్ నినుమెచ్చ మానవా! |
31 |
|
చేసినవేమో చేసితివి-చెన్నటివై; యని నేను సైరణన్ జేసితి; నింకముందయినఁ-జేసిన తప్పుల దిద్దుబాటుకై గాసిలియైన యత్నములు-గట్టిగఁ జేయక యూరకున్నచో వేసరఁబోక కట్టి కుడి-పించెదఁ దప్పదు ధూర్తమానవా! |
32 |
|
నే వచ్చి నీకుఁ గలలో వావిరి చెప్పినది యెల్ల వ్రాయుటచేతన్ నీవే ధన్యుఁడ వైతివి రావోయీ! త్రిపురనేని రామస్వామీ! |
33 |
|
పైగా నాతనినే విమానముపయిన్-స్వర్గంబు గొంపోయి త ద్భోగావాప్తిని గూర్చినాఁడ నని సు-ద్దుల్ చెప్పుచున్నాఁడవా? జాగీరిచ్చునె యే ప్రభుండయిన రా-జద్రోహికిన్ స్వర్గమా? నీ గాండ్రింపులు గట్టిపెట్ట నిఁకనే-నిన్ బూనవా? మానవా! |
34 |
|
ఎడ్డెతనంబుఁ జూపెదవె!-యెంతని నే సహియింతు నిన్ను; నీ కడ్డము వచ్చినంతటనె-యాతఁడు ధర్మవిదూరుడౌనె? పెన్ గడ్డము లేకయున్న నెటు-కాఁగలడయ్య ఋషీంద్రుఁ డెందు! నీ నడ్డి విఱుంగు నింకపయి-నన్ మతిదప్పిన ధూర్తమానవా! |
35 |
|
ఆ యాచార్యుఁ డెవఁడో తెల్పవుగ య-త్యాచారముం జల్పుచున్ కాయంబెల్లను రాజయక్ష్మయను రో-గంబందుటన్ గ్రుళ్ళి వే యాయాసంబునఁ దూలుచున్నతఁడు నా-యాచార్యులం దొక్కఁడా? నాయాజ్ఞా పరిపాలురం దొకఁడ! నన్-వంచింతువా? మానవా! |
36 |