| శతకములు | దాశరథి శతకము |
|
| ఉ. |
కంటి నదీతటంబుఁ బొడఁగంటిని భద్రనగాదివాసముం గంటి నిలాతనూజ నురు కార్ముకమార్గణ శంఖచక్రముల్ గంటిని మిమ్ము లక్ష్మణునిఁ గంటి కృతార్థుడనైతి నో జగ త్కంటక దైత్యనిర్దళన దాశరథీ! కరుణాపయోనిధీ! |
21 |
| చ. |
హలికునకున్ హలాగ్రమున నర్థము చేకురుభంగి దప్పిచే నలమటఁజెందువానికి సురాపగలో జలమబ్బినట్లు దు ర్మలిన మనోవికారినగు మర్త్యుని నన్నొడఁగూర్చి నీపయిం దలపు ఘటింపఁజేసితివి దాశరథీ! కరుణాపయోనిధీ! |
22 |
| ఉ. |
కొంజక తర్కవాదమను గుద్దలిచేఁ బరతత్త్వభూస్థలిన్ రంజిలఁద్రవ్వి కన్గొనని రామనిధానము నేఁడు భక్తి సి ద్ధాంజనమందు హస్తగత మయ్యె భళీయనగా మదీయహృ త్కంజమునన్ వసింపుమిఁక దాశరథీ! కరుణాపయోనిధీ! |
23 |
| ఉ. |
రాముఁడు ఘోరపాతకవిరాముఁడు సద్గుణకల్పవల్లికా రాముఁడు షడ్వికారజయరాముఁడు సాధుజనావనవ్రతో ద్దాముఁడు రాముఁడే పరమదైవము మాకని మీయడుంగుఁ గెం దామరలే భజించెదరు దాశరథీ! కరుణాపయోనిధీ! |
24 |
| ఉ. |
చక్కరమాని వేము దినఁజాలిన కైవడి మానవాధముల్ పెక్కురు బక్కదైవముల వేమఱుగొల్చెద రట్లకాదయా మ్రొక్కిన నీక మ్రొక్కవలె మోక్షమొసంగిన నీవ యీవలెన్ దక్కినమాట లేమిటికి దాశరథీ! కరుణాపయోనిధీ! |
25 |
| ఉ. |
రాకలుషంబులెల్ల బయలం బడద్రోచిన మా కవాటమై దీకొనిఁ బ్రోచు నిక్కమని ధీయుతులెన్నఁ దదీయవర్ణముల్ గైకొని భక్తిచే నుడువఁ గానరు గాక విపత్పరంపరల్ దాకొనుచే జగజ్జనుల దాశరథీ! కరుణాపయోనిధీ! |
26 |
| ఉ. |
"రామహరే కకుత్స్థకుల రామహరే రఘురామరామ శ్రీ రామహరే" యటంచు మది రంజిల భేకగళంబులీల నీ నామము సంస్మరించిన జనంబు భవంబెడబాసి తత్పరం ధామనివాసులౌదుఁరట దాశరథీ! కరుణాపయోనిధీ! |
27 |
| ఉ. |
చక్కెర లప్పకున్ మిగుల జవ్వని కెంజిగురాకు మోవికిం జొక్కపుజుంటి తేనియకుఁ జొక్కులుచుం గనలేరుగాక నేఁ డక్కట రామనామ మధురామృతమానుటకంటె సౌఖ్యమా తక్కినమాధురీ మహిమ దాశరథీ! కరుణాపయోనిధీ! |
28 |
| ఉ. |
అండజవాహ నిన్ను హృదయంబున నమ్మినవారి పాపముల్ కొండలవంటివైన వెసఁ గూలి నశింపకయున్నె సంతతా ఖండలవైభవోన్నతులు గల్గకమానునె మోక్షలక్ష్మికై దండయొసంగకున్నె తుద దాశరథీ! కరుణాపయోనిధీ! |
29 |
| ఉ. |
చిక్కని పాలపై మిసిమిఁ జెందిన మీఁగడ పంచదారతో మెక్కినభంగి మీ విమల మేచకరూప సుధారసంబు నా మక్కువపళ్ళెరంబున సమాహిత దాస్యమనేటి దోయిటన్ దక్కెనటంచు జుఱ్ఱెదను దాశరథీ! కరుణాపయోనిధీ! |
30 |