| శతకములు | దాశరథి శతకము |
|
| ఉ. |
కుక్షినజాండ పంక్తులొనఁగూర్చి చరాచరజంతుకోటి సం రక్షణసేయు తండ్రివి పరంపర నీ తనయుండనైన నా పక్షము నీవు గావలదె పాపము లెన్ని యొనర్చినన్ జగ ద్రక్షక కర్త వీవె కద దాశరథీ! కరుణాపయోనిధీ! |
41 |
| ఉ. |
గద్దరి యోగిహృత్కమల గంధరసానుభవంబుఁజెందు పె న్నిద్దపు గండుఁదేఁటి ధరణీసుత కౌఁగిలిపంజరంబునన్ ముద్దులు గుల్కు రాచిలక ముక్తినిధానమ రామ రాఁగదే తద్దయు నేఁడు నాకడకు దాశరథీ! కరుణాపయోనిధీ! |
42 |
| చ. |
కలియుగ మర్త్యకోటి నినుఁ గన్గొనరాని విధంబొ భక్తవ త్సలతవహింపవో చటుల సాంద్రవిపద్దశ వార్ధిఁగ్రుంకుచో బిలిచినఁ బల్కవింతమఱపే నరులిట్లనరాదుగాక నీ తలఁపునలేదే సీత చెఱ దాశరథీ! కరుణాపయోనిధీ! |
43 |
| చ. |
జనవర! మీ కథాళి విన సైఁపక కర్ణములందు ఘంటికా నినద వినోదముల్ సలుపు నీచునకున్ వరమిచ్చినావు ని న్ననయమునమ్మి కొల్చిన మహాత్ములకేమి యొసంగెదో సనం దననుత! మాకొసంగుమయ దాశరథీ! కరుణాపయోనిధీ! |
44 |
| ఉ. |
పాపము లొందువేళ రణపన్నగభూత భయజ్వరాదులం దాపద నొందువేళ భరతాగ్రజ మిమ్ము భజించువారికిం బ్రాపుగ నీవుఁ దమ్ముఁడిరు ప్రక్కియలంజని తద్విపత్తిసం తాపముమాన్పి కాతువఁట దాశరథీ! కరుణాపయోనిధీ! |
45 |
| చ. |
అగణితజన్మకర్మదురితాంబుధిలోఁ బహుదుఃఖవీచికల్ దెగిపడ నీఁదలేక జగతీధవ నీ పదభక్తినావచేఁ దగిలి తరింపగోరితిఁ బదంపడి నాదు భయంబుమాన్పవే తగదని చిత్తమందిడక దాశరథీ! కరుణాపయోనిధీ! |
46 |
| ఉ. |
నేనొనరించు పాపము లనేకములైనను నాదుజిహ్వకుం బానకమయ్యె మీపరమ పావననామము దొంటి చిల్క "రా మా! ననుఁగావు"మన్న తుది మాటకు సద్గతిఁజెందెఁ గావునన్ దాని ధరింపఁగోరెదను దాశరథీ! కరుణాపయోనిధీ! |
47 |
| చ. |
పరధనముల్ హరించి పరభామలనంటి పరాన్నమబ్బినన్ మురిపముకాని మీఁదనగు మోసమెఱుంగదు మానసంబు దు స్తరమిది కాలకింకర గదాహతి పాల్పడనీక మమ్మునే తఱిదరిఁజేర్చి కాచెదవొ దాశరథీ! కరుణాపయోనిధీ! |
48 |
| ఉ. |
చేసితి ఘోరకృత్యములు చేసితి భాగవతాపచారముల్ చేసితి నన్యదైవములఁ జేరి భజించిన వారిపొందు నేఁ చేసితినేరముల్ దలఁచి చిక్కులఁబెట్టకుమయ్య యయ్య నీ దాసుఁడనయ్య భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ! |
49 |
| చ. |
పరుల ధనంబుఁజూచి పర భామల జూచి హరింపగోరు మ ద్గురుతరమానసంబనెడు దొంగనుబట్టి నిరూఢదాస్య వి స్ఫురితవివేక పాశములఁ జుట్టి భవచ్చరణంబనే మరు త్తరువునఁ గట్టివేయఁగదె దాశరథీ! కరుణాపయోనిధీ! |
50 |