| శతకములు | దాశరథి శతకము |
|
| ఉ. |
ఎక్కడి తల్లితండ్రి సుతులెక్కడివారు కళత్రబాంధవం బెక్కడ జీవుఁడెట్టి తనువెత్తినఁ బుట్టుచుఁ బోవుచున్నవాఁ డొక్కఁడె పాపపుణ్యఫల మొందిననొక్కడె కానరాడు వే ఱొక్కఁడు వెంటనంటిభవ మొల్లనయా కృపఁజూడవయ్య నీ టక్కరి మాయలందిడక దాశరథీ! కరుణాపయోనిధీ! |
91 |
| ఉ. |
దొరసిన కాయముల్ముదిమి తోచినఁజూచి ప్రభుత్వముల్సిరుల్ మెఱపులుగాగజూచి మఱి మేదినిలోఁ దమతోడివారు ముం దరుగుటచూచి చూచి తెగునాయువెఱుంగక మోహపాశము ల్దరుఁగని వారికేమి గతి దాశరథీ! కరుణాపయోనిధీ! |
92 |
| చ. |
సిరిగలనాఁడు మైమఱచి చిక్కిననాఁడు దలంచి పుణ్యముల్ పొరిఁబొరి సేయనైతినని పొక్కినఁగల్గునె గాలిచిచ్చుపైఁ గెరలినవేళఁ దప్పికొని కీడ్పడువేళ జలంబుగోరి త త్తరమునఁ ద్రవ్వినంగలదె దాశరథీ! కరుణాపయోనిధీ! |
93 |
| ఉ. |
జీవనమింకఁ బంకమునఁ జిక్కినమీను చలింపకెంతయున్ దావుననిల్చి జీవనమె దద్దయుఁ గోరువిధంబు చొప్పడం దావలఁమైనగాని గుఱి దప్పనివాఁడు తరించువాఁడయా తావకభక్తియోగమున దాశరథీ! కరుణాపయోనిధీ! |
94 |
| చ. |
సరసుని మానసంబు సరసజ్ఞుఁడెఱుంగును ముష్కరాధముం డెఱిఁగి గ్రహించువాడె కొలనేక నివాసముఁగాగ దర్దురం బరయఁగ నేర్చునెట్లు వికచాబ్దమరంద రసైక సౌరభో త్కరము మిళిందమొందు క్రియ దాశరథీ! కరుణాపయోనిధీ! |
95 |
| ఉ. |
నోఁచిన తల్లితండ్రికిఁ దనూభవుఁడొక్కడె చాలు మేటి చే చాఁచనివాఁడు వేఱొకఁడు చాచిన లేదనకిచ్చువాఁడు నో రాఁచి నిజంబకాని పలుకాడనివాఁడు రణంబులోన మేన్ దాఁచనివాఁడు భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ! |
96 |
| ఉ. |
"శ్రీయుత జానకీరమణ చిన్మయరూప రమేశరామ నా రాయణ పాహిపాహి"యని బ్రస్తుతిఁ జేసితి నా మనంబునం బాయక కిల్బిష వ్రజ విపాటనమందఁగజేసి సత్కళా దాయి ఫలంబు నాకియవె దాశరథీ! కరుణాపయోనిధీ! |
97 |
| ఉ. |
ఎంతటి పుణ్యమో శబరి యెంగిలిగొంటివి వింతగాదె నీ మంతనమెట్టిదో యుడుతమైని కరాగ్ర నఖాంకురంబులన్ సంతసమందఁజేసితివి సత్కులజన్మమ దేమిలెక్క వే దాంతముగాదె నీ మహిమ దాశరథీ! కరుణాపయోనిధీ! |
98 |
| ఉ. |
బొంకనివాఁడె యోగ్యుఁ డరిబృందము లెత్తినచోటఁ జివ్వకుం జంకనివాఁడె జోదు రభసంబున నర్థికరంబు సాఁచినం గొంకనివాఁడె దాత మిముఁ గొల్చి భజించినవాఁడె పో నిరా తంకమనస్కుఁడెన్నగను దాశరథీ! కరుణాపయోనిధీ! |
99 |
| చ. |
భ్రమరము గీటకంబుఁగొని పాల్పడి ఝాంకరణోపకారియై భ్రమరముగా నొనర్చునని పల్కుటఁజేసి భవాది దుఃఖసం తమసమెడల్చి భక్తి సహితంబుగ జీవుని విశ్వరూప త త్త్వమును ధరించుటేమరుదు దాశరథీ! కరుణాపయోనిధీ! |
100 |