| శతకములు | దాశరథి శతకము |
|
| ఉ. |
ధారుణి జాపజుట్టిన విధంబునగైకొని హేమనేత్రుఁడ వ్వారిధిలోన డాఁగినను వానివధించి వరాహమూర్తివై ధారుణిఁ దొంటి కైవడిని దక్షిణశృంగమునన్ ధరించి వి స్తార మొనర్చితీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ! |
71 |
| చ. |
పెటపెట నుక్కు కంబమున భీకరదంత నఖాంకుర ప్రభా పటలము గప్ప నుప్పతిలి భండనవీథి నృసింహభీకర స్ఫుటపటుశక్తి హేమకశిపున్ విదలించి సురారిపట్టి నం తటఁగృపఁజూచితీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ! |
72 |
| చ. |
పదయుగళంబు భూగగన భాగములన్ వెసనూని విక్రమా స్పదుఁడగు నబ్బలీంద్రునొక పాదమునం దలక్రిందనొత్తి మే లొదవ జగత్త్రయంబు బురుహూతునికియ్య వటుండవైన చి త్సదమలమూర్తి వీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ! |
73 |
| చ. |
ఇరువదియొక్కమాఱు ధరణీశుల నెల్ల వధించి తత్కళే బర రుధిర ప్రవాహమునఁ బైతృకతర్పణ మొప్పఁజేసి భూ సురవరకోటికిన్ ముదము సొప్పడ భార్గవరామమూర్తివై ధరణినొసంగితీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ! |
74 |
| చ. |
దురమునఁ దాటకం దునిమి ధూర్జటివిల్ దునుమాడి సీతనుం బరిణయమంది తండ్రిపనుపన్ ఘనకాననభూమి కేఁగి దు స్తరపటుచండ కాండకులిశాహతి రావణకుంభకర్ణ భూ ధరములఁ గూల్చితీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ! |
75 |
| చ. |
అనుపమ యాదవాన్వయసుధాబ్ధిసుధానిధి కృష్ణమూర్తి నీ కనుజుఁడుగా జనించి కుజనావళి నెల్ల నడంచి రోహిణీ తనయుఁడనంగ బాహుబల దర్పమునన్ బలరామమూర్తివై తనరిన వేల్పవీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ! |
76 |
| చ. |
సురలునుతింపగాఁ ద్రిపుర సుందరులన్ వరియింప బుద్ధరూ పరయఁగ దాల్చితీవు త్రిపురాసురకోటి దహించుచున్నప్పుడా హరునకుఁ దోడుగా వరశరాసన బాణముఖోగ్రసాధనో త్కర మొనరించితీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ! |
77 |
| ఉ. |
సంకరదుర్గమై దురిత సంకులమైన జగంబుజూచి స ర్వంకషలీల నుత్తమ తురంగమునెక్కి కరాసిఁబూని వీ రాంక విలాసమొప్ప గలికాకృతి సజ్జనకోటికిన్ నిరా తంక మొనర్చితీవెకద దాశరథీ! కరుణాపయోనిధీ! |
78 |
| చ. |
మనమున నూహపోహణలు మర్వకమున్నె కఫాదిరోగముల్ దనువుననంటి మేనిబిగి దప్పకమున్నె నరుండు మోక్ష సా ధన మొనరింపఁగావలయుఁ దత్త్వవిచారము మానియుండుట ల్తనువునకున్ విరోధమిది దాశరథీ! కరుణాపయోనిధీ! |
79 |
| చ. |
ముదమున కాటపట్టు భవమోహమద ద్విరదాంకుశంబు సం పదల కొటారు కోరికల పంట పరంబునకాది వైరుల న్నదన జయించుత్రోవ విపదబ్ధికి నావ గదా సదాభవ త్సదమల నామసంస్మరణ దాశరథీ! కరుణాపయోనిధీ! |
80 |