| శతకములు | దాశరథి శతకము |
|
| చ. |
సలలిత రామనామ జప సారమెఱుంగను గాశికాపురీ నిలయుఁడఁగాను మీచరణ నీరజరేణు మహాప్రభావముం దెలియ నహల్యఁగాను జగతీవర! నీదగు సత్యవాక్యముం దలఁపఁగ రావణాసురుని తమ్ముఁడగాను భవద్విలాసముల్ తలఁచి నుతింప నాతరమె దాశరథీ! కరుణాపయోనిధీ! |
51 |
| ఉ. |
పాతకులైన మీ కృపకుఁ బాత్రులు కారె తలంచి చూడ జ ట్రాతికిఁగల్గె భావన మరాతికి రాజ్యసుఖంబము గల్గె దు ర్జాతికిఁబుణ్యమబ్బె గపిజాతిమహత్త్వము నొందెఁగావునం దాతవ యెట్టివారలకు దాశరథీ! కరుణాపయోనిధీ! |
52 |
| ఉ. |
మామక పాతక వ్రజము మాన్పనగణ్యము చిత్రగుప్తు లే మేమని వ్రాఁతురో శమనుఁడేమి విధించునొ కాలకింకర స్తోమ మొనర్చుటేమొ వినఁ జొప్పడదింతకుమున్నె దీనచిం తామణి యెట్లుగాచెదవొ దాశరథీ! కరుణాపయోనిధీ! |
53 |
| ఉ. |
దాసిన చుట్టమా శబరి దాని దయామతి నేలినావు నీ దాసుని దాసుడా గుహుడు తావక దాస్య మొసంగినావు నే జేసినపాపమో వినుతి చేసిన గావవు గావుమయ్య నీ దాసులలోన నేనొకఁడ దాశరథీ! కరుణాపయోనిధీ! |
54 |
| ఉ. |
దీక్షవహించి నా కొలది దీనుల నెందఱిఁ గాచితో జగ ద్రక్షక తొల్లి యా ద్రుపదరాజతనూజ తలంచినంతనే యక్షయమైన వల్వలిడి తక్కట నా మొఱఁజిత్తగించి ప్ర త్యక్షము గావవేమిటికి దాశరథీ! కరుణాపయోనిధీ! |
55 |
| ఉ. |
నీలఘనాభమూర్తివగు నిన్నుఁగనుంగొనఁగోరి వేడినన్ జాలముసేసి డాగెదవు సంస్తుతికెక్కిన రామనామ మే మూలను దాచుకోఁగలవు ముక్తికి బ్రాపది పాపమూలకు ద్దాలముగాదె మాయెడల దాశరథీ! కరుణాపయోనిధీ! |
56 |
| చ. |
వలదు పరాకు భక్తజన వత్సల నీ చరితంబు వమ్ముగా వలదు పరాకు నీ బిరుదు వజ్రమువంటిది కావకూరకే వలదు పరాకు నా దురిత వార్ధికిఁదెప్పవుగా మనంబులో దలఁతుమె కా నిరంతరము దాశరథీ! కరుణాపయోనిధీ! |
57 |
| ఉ. |
తప్పులెఱుంగలేక దురితంబులు సేసితినంటి నీవు మా యప్పవుగావుమంటి నిఁక నన్యులకున్ నుదురంటనంటి నీ కొప్పిదమైన దాసజను లొప్పిన బంటుకు బంటనంటి నా తప్పులకెల్ల నీవెగతి దాశరథీ! కరుణాపయోనిధీ! |
58 |
| చ. |
ఇతఁడు దురాత్ముఁడంచు జనులెన్నఁగ నాఱడిఁగొంటి నేనెపో పతితుఁడనంటిపో పతితపావనమూర్తివి నీవుగల్గ నే నితరుల వేఁడనంటి నిహమిచ్చిన నిమ్ము పరంబొసంగు మీ యతులిత రామనామ మధురాక్షరపాళి నిరంతరంబు హృ ద్గతమని నమ్మికొల్చెదను దాశరథీ! కరుణాపయోనిధీ! |
59 |
| ఉ. |
అంచితమైన నీదు కరుణామృతసారము నాదుపైని బ్రో క్షించినఁ జాలు దాన నిరసించెద నా దురితంబులెల్లఁ దూ లించెదఁ వైరివర్గ మెడలించెదఁ గోర్కుల నీదుబంటనై దంచెదఁ గాలకింకరుల దాశరథీ! కరుణాపయోనిధీ! |
60 |