| శతకములు | కృష్ణ శతకము |
|
| క. |
శ్రీ రుక్మిణీశ కేశవ నారద సంగీతలోల నగధర శౌరీ ద్వారకనిలయ జనార్దన కారుణ్యముతోడ మమ్ముఁ గావుము కృష్ణా. |
1 |
| క. |
నీవే తల్లివి తండ్రివి నీవే నా తోడు నీడ నీవే సఖుడౌ నీవే గురుడవు దైవము నీవే నా పతియు గతియు నిజముగఁ గృష్ణా. |
2 |
| క. |
నారాయణ పరమేశ్వర ధారాధర నీలదేహ దానవవైరీ క్షీరాబ్ధిశయన యదుకుల వీరా ననుగావు కరుణ వెలయగఁ గృష్ణా. |
3 |
| క. |
హరి యను రెండక్షరములు హరియించును పాతకముల నంబుజనాభా హరి నీ నామమహత్త్వము హరి హరి పొగడంగ వశమె హరి శ్రీ కృష్ణా. |
4 |
| క. |
క్రూరాత్ముఁ డజామీళుఁడు నారాయణ యనుచు నాత్మనందనుఁ బిలువ నేరీతి నేలుకొంటివి యేరీ నీసాటి వేల్పు లెందును కృష్ణా. |
5 |
| క. |
చిలుక నొకరమణి ముద్దులు చిలుకను శ్రీరామ యనుచు శ్రీపతి పేరన్ బిలిచిన మోక్షము నిచ్చితి వలరఁగ మిముఁ దలఁచు జనుల కరుదా కృష్ణా. |
6 |
| క. |
అక్రూరవరద మాధవ చక్రాయుధ ఖడ్గపాణి శౌరి ముకుందా శక్రాది దివిజసన్నుత శుక్రార్చిత నన్నుఁ గరుణ జూడుము కృష్ణా. |
7 |
| క. |
నందుని ముద్దుల పట్టివి మంధరగిరిధరుని హరిని మాధవు విష్ణున్ సుందర రూపుని మునిగణ వందితు నినుఁ దలఁతు భక్త వత్సల కృష్ణా. |
8 |
| క. |
ఓ కారుణ్యపయోనిధి నా కాధారంబ వగుచు నయముగఁ బ్రోవ\న్ నాకేల యితర చింతలు నాకాధిపవినుత లోక నాయక కృష్ణా. |
9 |
| క. |
వేదంబులు గననేరని ఆది పరబ్రహ్మమూర్తి వనఘ మురారీ నాదిక్కుఁజూచి కావుము నీ దిక్కే నమ్మినాఁడ నిజముగఁ గృష్ణా. |
10 |