శతకములు కృష్ణ శతకము
 1 11 21 31 41 51 61 71 81 91
క. తటతట లేటికిఁ జేసెదు
కటకట పరమాత్మ నీవు ఘంటాకర్ణు\న్‌
ఎటువలె పుణ్యునిఁ జేసితి
వటువలె రక్షింపుమయ్య యచ్యుత కృష్ణా.
71
క. తురగాధ్వరంబుఁ జేసిన
పురుషులకును వేఱెపదవి పుట్టుట యేమో
హరి మిముఁ దలఁచిన వారికి
నరుదా కైవల్యపదవి యచ్యుత కృష్ణా.
72
క. ఓ భవబంధవిమోచన
ఓ భరతాగ్రజ మురారి యోరఘు రామా
ఓ భక్తకామధేనువ
ఓ భయహర నన్నుగావుమో హరి కృష్ణా.
73
క. ఏతండ్రి కనకకశ్యపు
ఘాతకుఁడై యతనిసుతుని గరుణను గాచె\న్‌
ప్రీతి సురకోటి పొగడఁగ
నా తండ్రీ నిన్ను నేను నమ్మితి గృష్ణా.
74
క. ఓ పుండరీకలోచన
యో పురుషోత్తమ ముకుంద యో గోవిందా
యో పురసంహర మిత్రుఁడ
యో పుణ్యుఁడ నన్నుఁబ్రోవుమో హరి కృష్ణా.
75
క. ఏవిభుఁడు ఘోరరణమున
రావణుఁ వధియించి లంకరాజుగ నిలిపె\న్‌
దీవించి యావిభీషణు
నావిభు నేఁ దలఁతు మదిని నచ్యుత కృష్ణా.
76
క. గ్రహభయదోషము లొందవు
బహుపీడలు చేర వెఱచుఁ బాయును నఘముల్‌
ఇహపర ఫలదాయక విను
తహతహలెక్కడివి నిన్నుఁదలఁచినఁ గృష్ణా.
77
క. గంగ మొదలైన నదులను
మంగళముగఁ జేయునట్టి మజ్జనములకు\న్‌
సంగతి గలిగిన ఫలములు
రంగుగ మిముఁదలఁచు సాటి రావుర కృష్ణా.
78
క. ఆ దండకావనంబున
కోదండముఁదాల్చినట్టి కోమలమూర్తీ
నాదండ గావ రమ్మీ
వేదండము కాచినట్టి వేల్పువు కృష్ణా.
79
క. చూపుము నీరూపంబును
బాపపు దుష్కృతము లెల్లఁ బంకజనాభా
పాపుము నాకును దయతో
శ్రీపతి నిను నమ్మినాఁడ సిద్ధము కృష్ణా.
80
AndhraBharati AMdhra bhArati - shatakamulu - kR^ishhNa shatakamu ( telugu andhra )