శతకములు కృష్ణ శతకము
 1 11 21 31 41 51 61 71 81 91
క. అండజవాహన విను బ్ర
హ్మాండంబుల బంతులట్ల యాడెడు నీ వా
కొండల నెత్తితి వందురు
కొండిక పనిగాక దొడ్డ కొండా కృష్ణా.
21
క. అంసాలంబితకుండల
కంసాంతక నీవు ద్వారకాపురిలోన\న్‌
సంసారి రీతినుండి ప్ర
శంసార్హుఁడ వైతి వహహ జగతిని గృష్ణా.
22
క. పదియాఱువేల నూర్వురు
సుదతులు నెనమండ్రు నీకు సొంపుగ భార్యల్‌
విదితంబుగ బహురూపుల
వదలక రమియింతువౌర వసుధను గృష్ణా.
23
క. అంగన పనుపున దోవతి
కొంగున నటుకులను ముడుచుకొని వచ్చిన యా
సంగతి విని దయనొసఁగితి
రంగుగ సంపదలు లోక రక్షక కృష్ణా.
24
క. హా వసుదేవకుమారక
కావుము నా మాన మనుచు కామిని వేఁడ\న్‌
ఆ వనజాక్షికి నిచ్చితి
శ్రీవర యక్షయ మటంచు జీరలు కృష్ణా.
25
క. శుభ్రమగు పాంచజన్యము
అభ్రంకషమగుచు మ్రోవ నాహవభూమి\న్‌
విభ్రమలగు దనుజసుతా
గర్భంబుల పగులఁజేయు ఘనుడవు కృష్ణా.
26
క. జయమును విజయున కియ్యవె
హయముల ములుకోల మోపి యదలించి మహా
రయమున రొప్పవె తేరును
భయమున రిపుసేన విఱిగి పాఱఁగఁ గృష్ణా.
27
క. దుర్జనులగు నృపసంఘము
నిర్జింపఁగఁ దలచి నీవు నిఖిలాధారా
దుర్జనులను వధియింపను
నర్జును రధచోదకుండ వైతివి కృష్ణా.
28
క. శక్రసుతుఁ గాచుకొఱకై
చక్రము చేపట్టి భీష్ముఁ జంపఁగ చను నీ
విక్రమ మేమని పొగడుదు
నక్రాగ్రహ సర్వలోక నాయక కృష్ణా.
29
క. దివిజేంద్రసుతునిఁ జంపియు
రవిసుతు రక్షించినావు రఘురాముఁడవై
దివిజేంద్రసుతునిఁ గాచియు
రవిసుతుఁ బరిమార్చితౌర రణమునఁ గృష్ణా.
30
AndhraBharati AMdhra bhArati - shatakamulu - kR^ishhNa shatakamu ( telugu andhra )