| శతకములు | కృష్ణ శతకము |
|
| క. |
నీ నామము భవహరణము నీ నామము సర్వసౌఖ్య నివహకరంబు\న్ నీ నామ మమృత పూర్ణము నీ నామము నేఁదలంతు నిత్యము కృష్ణా. |
81 |
| క. |
పరులను నడిగిన జనులకు కుఱుచ సుమీ యిది యటంచు గుఱుతుగ నీవు\న్ గురుచఁడవై వేఁడితి మును ధరఁ బాదత్రయము బలిని దద్దయుఁ గృష్ణా. |
82 |
| క. |
పాలను వెన్నయును మ్రుచ్చిల ఱోలను మీ తల్లి కట్ట రోషముతోడ\న్ లీలావినోది వైతివి బాలుఁడవా బ్రహ్మకన్న ప్రభుఁడవు గృష్ణా. |
83 |
| క. |
రఘునాయక నీనామము లఘుమతితోఁ దలఁపఁగలనె లక్ష్మీరమణా అలఘములఁ బాపుము దయతో రఘురాముఁడ వైన లోక రక్షక కృష్ణా. |
84 |
| క. |
అప్పా యిత్తువు దయతో నప్పాలను నతిరసంబు లనుభవశాలీ యప్పా నను గనుఁగొనవే యప్పా నను బ్రోవు వేంకటప్పా కృష్ణా. |
85 |
| క. |
కొంచెపువాఁడని మదిలో నెంచకుమీ వాసుదేవ యిభవరద హరీ యంచితముగ నీ కరుణకుఁ గొంచము నధికంబు గలదె కొంతయుఁ గృష్ణా. |
86 |
| క. |
వావిరి నీ భక్తులకు\న్ గావరమున నెగ్గు సేయు గర్వాంధులకు\న్ దేవ వధించుట వింటిని నీవల్లను భాగ్యమయ్యె నిజముగఁ గృష్ణా. |
87 |
| క. |
అయ్యా పంచేంద్రియములు నుయ్యాలల నూచినట్టు లూచఁగ నేను\న్ జయ్యన గలఁగుచు నుంటిని గుయ్యాలింపుము మహాత్మ గుఱుతుగఁ గృష్ణా. |
88 |
| క. |
కంటికి ఱెప్ప విధంబున బంటుగదా యనుచు నన్నుఁ బాయక యెపుడు\న్ జంటయు నీ వుండుట నే కంటక మగు పాపములను గడచితిఁ గృష్ణా. |
89 |
| క. |
యమునకు నిఁక నే వెఱువను కమలాక్ష జగన్నివాస కామితఫలదా విమలమగు నీదు నామము నమఁరఁగఁ దలఁచెదను వేగ ననిశము కృష్ణా. |
90 |