శతకములు కృష్ణ శతకము
 1 11 21 31 41 51 61 71 81 91
క. పంచేంద్రియమార్గంబులఁ
గొంచెపు బుద్ధిని జరించి కొన్ని దినంబుల్‌
ఇంచుక సజ్జన సంగతి
నెంచగ మిమ్మెఱిఁగినాఁడ నిప్పుడె కృష్ణా.
51
క. దుష్టుండ దురాచారుఁడ
దుష్టచరిఁత్రుఁడను చాల దుర్బుద్ధిని నేఁ
నిష్ట నిను గొల్వనేరను
కష్టుఁడ నగు నన్ను కావు కరుణను గృష్ణా.
52
క. కుంభీంద్రవరద కేశవ
జంభాసురవైరి దివిజ సన్నుత చరితా
అంభోజనేత్ర జలనిధి
గంభీరా నన్నుఁ గావు కరుణను గృష్ణా.
53
క. దిక్కెవ్వరు ప్రహ్లాదుకు
దిక్కెవ్వరు పాండుసుతుల దీనుల కెపుడు\న్‌
దిక్కెవ్వ రయ్యహల్యకు
దిక్కెవ్వరు నీవె నాకు దిక్కువు కృష్ణా.
54
క. హరి నీవె దిక్కు నాకును
సిరితో నేతెంచి మకరి శిక్షించి దయ\న్‌
బరమేష్ఠి సురలు పొగడఁగ
కరిఁ గాచిన రీతి నన్నుఁ గావుము కృష్ణా.
55
క. పురుషోత్తమ లక్ష్మీపతి
సరసిజగర్భాది మౌనిసన్నుతచరితా
మురభంజన సురరంజన
వరదుఁడ వగు నాకు భక్త వత్సల కృష్ణా.
56
క. క్రతువులు తీర్థాటనములు
వ్రతములు దానములు సేయ వలెనా లక్ష్మీ
పతి మిముఁ దలచినవారికి
నతులితపుణ్యములు గలుగు టరుదే కృష్ణా.
57
క. స్తంభమున వెడలి దానవ
డింభకు రక్షించినట్టి రీతిని వెలయ\న్‌
అంభోజనేత్ర జలనిధి
గంభీరుఁడ నన్నుఁ గావు కరుణను గృష్ణా.
58
క. శతకోటి భానుతేజా
యతులితసద్గుణగణాఢ్య యంబుజనాభా
రతినాథజనక లక్ష్మీ
సతిహిత ననుఁ గావు భక్త వత్సల కృష్ణా.
59
క. మందుఁడ నే దురితాత్ముఁడ
నిందల కొడిఁగట్టినట్టి నీచుని నన్ను\న్‌
సందేహింపక కావుము
నందుని వరపుత్ర నిన్ను నమ్మితి గృష్ణా.
60
AndhraBharati AMdhra bhArati - shatakamulu - kR^ishhNa shatakamu ( telugu andhra )