| శతకములు | మారుతి శతకము |
|
| శా. |
శ్రీమద్రామ పదారవిందయుగళిన్ సేవించి, యస్మద్గురు స్వామిన్ వేడ్క భజించి, సత్కవి నమస్కారంబుఁ గావించి, వా గ్భూమప్రౌఢిమ నీకు నొక్క శతకంబున్ భక్తి నర్పించెదన్ నా మీదం గృపజేసి కైకొను మమందప్రీతితో మారుతీ! |
1 |
| మ. |
అనఘా! నీవు జనించి నప్పుడె సముద్యద్భూరితేజంబునన్ వినువీథిం గనుపట్టు బాలరవి సద్బింబంబు నీక్షించి, యె ఱ్ఱని పండంచు గ్రసింప బత్రిపతిలీలన్ వేడ్క మున్నూరు యో జనముల్ మింటికి దాటితౌఁ ద్రిభువనశ్లాఘ్యుండవై మారుతీ! |
2 |
| మ. |
నిజగర్భస్థితశైవతేజము, సమున్నిద్రాత్మ తేజంబుఁ గూ డ జగత్ప్రాణుఁ డమోఘ కేసరివనాటక్షేత్రమందర్థి నిం చ, జయశ్రీ మహిమాప్తి నయ్యుభయతేజంబుల్ రహిన్ మిశ్రమై త్రిజగంబుల్ గొనియాడ బుట్టితివి గాదే నీవిలన్ మారుతీ! |
3 |
| మ. |
అనిమేషేభము తెల్లపండనుచు బాల్యక్రీడలన్ మ్రింగ నొ య్యన డాయం బవిచే బలారి నిను మూర్ఛాక్రాంతునిం జేయ బూ ర్వనగాధిత్యక మీఁద వామహనువున్ భగ్నంబుగా వ్రాలినన్ హనుమంతుండను పేరు నాడమరె నీకన్వర్థమై మారుతీ! |
4 |
| మ. |
అపుడా గంధవహుండు నీదయిన మూర్ఛావస్థ వీక్షించి, తా గుపితుండై నిజమూర్తి వైభవము సంకోచింపఁగాఁ జేయ న చ్చపు గూర్మిన్ నిఖిలాస్త్రశస్త్రముల బంచత్వంబు లేకుండ స త్కృపతో నీకు వరంబులిచ్చిరిగదా బృందారకుల్ మారుతీ! |
5 |
| మ. |
ఒక పాదంబు మహోదయాచలముపై నొప్పారఁగా నుంచి వే ఱొక పాదం బపరాద్రి మీఁద నిడి యయ్యుష్ణాంశుచే బల్విడిన్ సకలామ్నాయము లభ్యసించిన భవచ్చాతుర్య మేమందు దా పక దివ్యోరుతర ప్రభావము నుతింపన్ శక్యమే? మారుతీ! |
6 |
| మ. |
బలవంతుండగు వాలి ప్రోలు వెడలింపం, బత్నిఁ గోల్పోయి మి క్కిలి దుఃఖంబున ఘోరకాననములం గ్రీడించి వర్తించు నా జలజాప్తాత్మజు నొజ్జ పట్టి యని యశ్రాంతంబుఁ జేపట్టి యా బలభిత్సూతికిఁ జిక్కకుండ ననుకంపం బ్రోవవే మారుతీ! |
7 |
| మ. |
తనపత్నిం దిలకింపుచున్ నిబిడకాంతారోర్వి వర్తించు రా మ నరేంద్రోత్తము పాలి కర్కజుఁడు పంపం భిక్షువేషంబునన్ జని, సుగ్రీవుని చందముం దెలిపి యా క్ష్మానాథు దోడ్తెచ్చి, మె ల్లన నయ్యిద్దఱకుం ధనంజయుని మ్రోలన్ సఖ్యసంబంధమున్ వినయం బొప్ప ఘటింపఁ జేసినది నీవే కాదొకో మారుతీ! |
8 |
| మ. |
మనుజగ్రామణి సత్కృపాత్త కపిసామ్రాజ్య స్థితుండయ్యు భూ తనయాన్వేషణ కార్యమున్ మఱచి కందర్పక్రియామత్తుఁడై తనివిం జెందక యున్న భానుజునిఁ దత్కాలార్హ నీత్యుక్తయు క్తిని బోధించిన నీతిశాలివి నినుం గీర్తించెదన్ మారుతీ! |
9 |
| శా. |
లేరా కీశులనేకులుం? ద్రిజగముల్ వీక్షించి రా నేర్పరుల్ గారా? రాముఁడు జానకిన్ వెదక వీఁకన్ గీశులం బంపుచో నారూఢిన్ భవదీయ దివ్యమహిమ వ్యాపారముల్ సూచి కా దా! రత్నాంగుళి భూషణం బిడియె నీ హస్తంబునన్ మారుతీ! |
10 |