| శతకములు | మారుతి శతకము |
|
| శా. |
కంటిం జారణ సిద్ధ కిన్నర మరుద్గంధర్వ కాంతావళిన్ గంటిన్ మానవయోషలన్ బవనభుగ్రామా లలామంబులన్ గంటిన్ సర్వనిశాచరప్రమదలన్ గంటిం బురంబందు నే వెంటం జానకిఁ గాననైతి నని నిర్వేదింపవే మారుతీ! |
41 |
| శా. |
ఈ లంకాపురరాజ్యమందుగల చోట్లెల్లన్ సమగ్రంబుగా నాలోకించితి నింక నొక్క వన మీ యంతఃపురాభ్యాసమం దాలేఖేశవనంబు మాడ్కిఁ గడు హృద్యంబై రహిం గ్రాలెడిన్ బాలారత్నము నచ్చటన్ వెదకెదం గాకంచు డెందాన నీ వాలోచించి రయంబు మీరఁ జనవే యచ్చోటికిన్ మారుతీ! |
42 |
| మ. |
వనముఙ్మండలిఁ జొచ్చు చంద్రుని గతిన్ బ్రచ్ఛన్నవేషంబుతో వనముం జొచ్చి లతాగృహోత్కర తరువ్రాతంబులన్ దీర్ఘికల్ ఘనసౌధంబులు చూచుచున్ జని మరుత్కల్పుండవై శింశుపా ఖ్య నగారోహణ మాచరించితివి గాదా నేర్పునన్ మారుతీ! |
43 |
| మ. |
తరుణిం గ్రీష్మగభస్తి, తప్తలతచందానన్ రహిన్ వాడి భీ కర దైత్యాంగన లాడు మాటలకు నాకంపించుచున్ సారెకున్ జిరభక్తిన్ రఘురామ, రామ యనుచుం బేర్కొంచు శోకార్తయై తరుమూలంబున నున్న జానకిని సందర్శింపవే మారుతీ! |
44 |
| మ. |
కమనీయాకృతి శింశుపాఖ్యతరుశాఖాపర్ణలీనుండవై యమరారాతి దశాస్యుడన్న కటుక్రూరాలాపముల్ రాక్షస ప్రమదల్ వల్కు దురుక్తులంత త్రిజటాస్వప్నప్రకారంబు న య్యమ గావించు విలాపమంతయును నీ వాలింపవే మారుతీ! |
45 |
| శా. |
రామాధీశుడు తండ్రి పంపున మహారణ్యోర్వికిన్ వచ్చె ని ష్కామం దత్సతి సీత బల్మిఁ గొని వీకం బోయె బంక్త్యాస్యుఁడా రామన్ వే వెదకంగ నేను జలధిన్ లంఘించి శోధించి యి చ్చో మన్మాతను గంటిమంటి ననుచున్ శ్రోత్రానుకూలంబుగా వేమాఱున్ మధురంబుగాఁ బలుకవే విన్నాణివై మారుతీ! |
46 |
| మ. |
ఇది సంధింపఁగ వేళ యంచుఁ గడఁకన్ వృక్షంబు వేఁడిగ్గి య మ్మదిరాక్షీమణి మ్రోల నిల్చి పతిసేమంబంతయుం జెప్పి త ద్వదనాద్యాకృతి చిహ్నముల్ దెలిపి విశ్వాసంబు పుట్టించి దీ ప్యదనర్ఘాంగుళి ముద్రికం గుఱుతుగా నర్పింపవే మారుతీ! |
47 |
| మ. |
అతిసూక్ష్మాంగుఁడ వీవు ననుఁ గొని యీయంభోనిధిం దాటి యే గతి పోవంగలవంచు సీత పలుకం గౌతూహలం బొప్ప న ప్రతిమానామర శైలసన్నిభ శరీరం బర్మిలిం జూపి యా క్షితికన్యామణి కద్భుతంబు ముదముం గీల్కొల్పవే మారుతీ! |
48 |
| మ. |
ప్రమదం బొప్పఁగ సీత యిచ్చిన శిరోరత్నం బొగిన్ సంగ్రహిం చి మహాత్ముండగు రాము నిచ్చటికి నే శీఘ్రంబునఁ దోడి తె త్తు మదిన్ శోకముఁ దక్కియుండుమని యెంతో భక్తితో నూరడిం చి, మహిన్ సాగిలి మ్రొక్కి గైకొనవె యాశీర్వాదముల్ మారుతీ! |
49 |
| మ. |
జనకక్ష్మాపతిపుత్రిచేఁ దగ ననుజ్ఞాతుండవై 'యూరకే జననేలా, దశకంఠదైత్యునకు మత్సామర్థ్య మొక్కింత జూ పనగుం గా' కని తండ్రివోలె నతిరంహం బర్మిలిం దాల్చి గ్ర ద్దన నద్దైత్యుని ప్రాణతుల్యవన ముత్పాటింపవే మారుతీ! |
50 |