| శతకములు | మారుతి శతకము |
|
| మ. |
చతురత్వంబున నీవు లక్ష్మణునికై సంజీవిఁ దేఁబోవుచో దితిజాధీశ్వరు పంపునం బ్రబల దైతేయుండు మారీచదై త్యతనూజాతుఁడు కాలనేమి ఘనమాయామౌనియై త్రోవఁ జిం తితవిఘ్నం బొనరింప డాయుటయు వానిం ద్రుంపవే మారుతీ! |
91 |
| మ. |
తొలుతం బల్మరు మందు లిమ్మనుచు నెంతో వేడి, యీకున్న కే వలశక్తిన్ హరి మందరాచలము నుత్పాటించినట్లీవు క ట్టలుకన్ వాలముఁజుట్టి పాదముల నిట్టట్టూచి దిగ్రాజిఘూ ర్ణిల దివ్యౌషధశైలముం బెఱుకవే క్రీడాగతిన్ మారుతీ! |
92 |
| శా. |
గీర్వాణాద్రివిభాగమున్ శిరముపై గీల్కొల్ప దుర్దాంతదో ర్గర్వం బొప్పఁగ వచ్చుచుండ గిరికిం గాపున్న పెక్కండ్రు గం ధర్వుల్ బోవఁగనీక నడ్డపడినన్ దర్పంబునన్ వారలన్ దుర్వారోద్ధతి వాలజానిలమునం దూలింపవే మారుతీ! |
93 |
| మ. |
గరిమన్ మాల్యవదాది రాక్షసు లసంఖ్యాతంబుగా వచ్చి యం బరవీథిం జలరాశిమధ్యమున దర్పం బేర్పడం దాకినన్ గిరిరాజంబును కందుకంబు కరణిన్ గేలన్ రహిం దాల్చి దు ర్భరవీర్యంబున వారిఁ జంపి జముఁ గొల్వం బంపవే మారుతీ! |
94 |
| మ. |
అవలీలన్ నిశిజాములోపల రయం బారంగ సంజీవిశై లవరంబుం గొని తెచ్చి జన్యమునఁ బౌలస్త్యోల్లసచ్ఛక్తిచే నవనిన్ మూర్ఛితుఁడైన లక్ష్మణున కీవా మందులర్పించి, శూ రవరేణ్యుం బ్రతికించి మెప్పుఁ గొనవే రాజేంద్రుచే మారుతీ! |
95 |
| మ. |
అనఘా! యెంతని చెప్పవచ్చు భవదీయావార్యదోస్సత్త్వమున్ కనకోర్వీధరసన్నిభౌషధగిరిన్ వాలంబునం జుట్టి గ్రం దున లంకాపురినుండి సత్వరమునం దొల్లింటిచోటం బడన్ వినువీథిన్ వడి ద్రిప్పివైవవె జగద్విశ్రాంతిగా మారుతీ! |
96 |
| మ. |
అల మైరావణుఁ డొక్కనాఁటి నిశి నిద్రాసక్తులై యున్న భూ పలలామేంద్రుల మ్రుచ్చిలించియు వెసన్ పాతాళలంకాపురిన్ ఖలుఁడై చొచ్చిన వాని వెంటఁ జని యాకష్టాత్మునిం ద్రుంచి శో భిలుచున్ నీవటు రామలక్ష్మణుల దేవే క్రమ్మఱన్ మారుతీ! |
97 |
| మ. |
దశకంఠుం బరిమార్చి, యాత్మజయముం ధాత్రీజకుం జెప్పి, త త్కుశలం బారసి రమ్మటంచు వెస గాకుత్స్థుండు పంపం బురం బు శశిప్రక్రియఁ జొచ్చి, రావణువధంబుం దెల్పి, సీతాసతిన్ విశదానందరసాబ్ధిఁ దేల్చినది నీవే కావొకో మారుతీ! |
98 |
| శా. |
ధీరోదాత్తుఁడు రాముఁడంప నటు నందిగ్రామముం జేరి, నీ వారూఢిన్ భరతున్ మహాత్ముఁ గని, రామాధీశ్వరుం డర్థి సీ తారామవరజాన్వితంబుగ భరద్వాజాశ్రమం బర్మిలిం జేరెన్ ఱేపట వచ్చునంచు నమృతస్ఫీతోక్తులం తెల్పి యా ధీరున్ హర్షపయోధి వీచికలపై దేలింపవే మారుతీ! |
99 |
| మ. |
సరసాగ్రేసరుఁడైన రామవిభుఁ డంచద్రత్నసౌవర్ణపు ష్పరథంబెక్కి సుమిత్రపట్టి వెనుకన్ ఛత్రంబుఁ బట్టన్ మహా భిరతిన్ లక్ష్మణుఁ డవ్విభీషణుఁ డొగిన్ వింజామరల్ వీవ సుం దరసాకేతపథంబుఁ బట్టి చనుచోఁ దత్పాదుకల్ మౌళిపైఁ బరమప్రీతి ధరించి మ్రోలఁ జనవే వర్ణింపుచున్ మారుతీ! |
100 |