| శతకములు | మారుతి శతకము |
|
| మ. |
పటుపాథోధి తరంగ పంక్తులు గణింపం బోవు చందాన ను త్కటవేగంబునఁ బోవు నిన్నుఁ గని వేడ్కన్ వీతసందేహులై చటుల స్థైర్యబలద్యుతిస్యదమతుల్ శౌర్యంబు ధైర్యంబు మి క్కుట మౌఁగా కని నీకొసంగరె దివౌకుల్ దీవనల్ మారుతీ! |
21 |
| మ. |
పవనాభస్యద మొప్ప నీవు కడిమిం బథోనిధిం దాటుచో భవదీయోరు భుజోరువేగ జనితాభంగోర్మికాజాలముల్ దివితో రాయ ఘుమంఘుమార్భటులు దిగ్దేశంబులం బర్వఁ బ త్రవహేంద్రుండని భీతిలెన్ ఫణులు పాతాళంబునన్ మారుతీ! |
22 |
| మ. |
శరదశ్రేణుల దూరుచున్ వెడలుచుం జాబిల్లి చందానఁ బు ష్కర మార్గంబున నేగు నిన్నుఁ గని నీ చాతుర్యమున్ మెచ్చి ని ర్జరు లానంద మెలర్పఁ జల్లిన మరుత్సంతానపుష్పంబుల ట్లరుదారన్ గననయ్యెఁ జుట్టును సముద్యత్తారకల్ మారుతీ! |
23 |
| శా. |
ఛాయాగ్రాహిణి నామరాక్షసి సరస్వ న్మధ్యమందుండి నీ కాయచ్ఛాయను బట్టి వేఁ దిగువఁ దద్గర్భంబు భేదించి త త్కాయంబుం గొని మింటిపై కెగసి కిన్కన్ వార్ధిలో జీవితా పాయంబుం గలుగంగ వైచిన నినున్ వర్ణించెదన్ మారుతీ! |
24 |
| శా. |
మైనాకంబు నతిక్రమించి, సురసన్ మన్నించి, యా సింహికా ఖ్యానన్ రాక్షసిఁ గీడటంచి నడుమన్ గాలూద కస్తాద్రికిం భానుండేగక మున్నె, మారుతగతిన్ వారాశి నూఱామడన్ గ్లానిం జెందక దాటితీవు సురసంఘంబెన్నఁగా మారుతీ! |
25 |
| మ. |
అనఘా! భాస్కరుఁడొక్క మాఱుదయశైలాగ్రంబునందుండి య స్తనగాగ్రంబున కేగునంతకు సముద్యచ్ఛక్తి వేమాఱు బె ల్చన నక్కొండల రెండునుం దిరుగు తేజశ్శాలికిన్ నీకు చ య్యన నూఱామడ దాటుటేమి విషయం బస్తోకమే మారుతీ! |
26 |
| మ. |
తతవేగంబున వార్థి దాటి గడిమిం దద్యామ్యతీరస్థ ప ర్వతముం జేరి నగోపమాన నిజగాత్రవ్యాప్తి జాలించి, ని ర్గత మోహుండగు యోగిభంగిఁ బ్రకృతిం బ్రాపించి, లంకాపురీ స్థితసర్వంబును బోల జూచితివి గాదే దవ్వులన్ మారుతీ! |
27 |
| శా. |
పంకేజాసను శాసనంబున జయింపన్ రాక యశ్రాంతమున్ లంకాద్వారముఁ గాచియున్న కుపితన్ లంకన్ జయాంకన్ నిరా తంకప్రౌఢి నశంకముష్టిహతి చేతం దూలఁగాఁ బుచ్చి, వీ రాంకగ్రామణివై వెలింగెడు నినున్ బ్రార్థించెదన్ మారుతీ! |
28 |
| శా. |
ప్రాచుర్యంబుగ చందురుండు కిరణవ్రాతంబు పైఁ జల్లుచున్ సాచివ్యం బొనరింప యోగమహిమన్ మార్జాలమాత్రుండవై నీచుల్ దైత్యులు చూడకుండ సతి నన్వేషింపగా శేముషీ వైచిత్రిన్ వెస లంక డాసిన నినున్ వర్ణించెదన్ మారుతీ! |
29 |
| శా. |
లంకానామనిశాటి నాకరణిఁ దూలం బుచ్చి యాప్రోలిఁకన్ గంకోలూక వశంబు గాగలదు నిక్కంబంచు వామాంఘ్రి ని శ్శంకన్ ముందుగ బెట్టుచున్ సురభిళాంచద్రాజమార్గంబునన్ లంకాకాననవహ్నివై చనవె ధీరత్వంబునన్ మారుతీ! |
30 |