శతకములు మారుతి శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101 111
మ. వనజాప్త ప్రియపుత్రుఁ డెంత ధిషణావంతుఁడొ, సర్వంసహా
తనయాన్వేషణ మాచరింప గపులం దా బంపుచో, గార్యసా
ధనమందీ వతి దక్షిణుండవని కాదా! నేర్పుతో దక్షిణం
బునకున్‌ నిన్నధికారిఁ జేసి పనిచెన్‌ మోదంబునన్‌ మారుతీ!
11
శా. సీతన్‌ గానక, దప్పిచే బడలి గాసిం జెందు శైలాట సం
ఘాతంబుం గొని, శైలగహ్వర సుధా కల్పాంబువుల్‌, సత్ఫల
వ్రాతంబుం దనివార నందఱ భుజింపంజేసి, తద్దేవతా
ఖాతశ్వభ్రము వెల్వరించితివి యోగప్రౌఢిచే మారుతీ!
12
మ. జనకక్ష్మాపతిపుత్రి యున్నవిధమున్‌ సర్వంబు సంపాతిచే
విని, నీలాంగదముఖ్యవానరుల్‌ వేగంబె ప్రాయోపవె
శమున్‌ మాని భవత్సమేతులగుచున్‌ సంప్రీతితో నా మహేం
ద్ర నగారోహణ మాచరించి రఁట విన్నాణంబుగా మారుతీ!
13
మ. శరధిం గాంచి యలంఘనీయ మని తత్సంతారణాదక్షులై
వరుసన్‌ గీశులు భీతిచేఁ గళవళింపన్‌ వారి వారించి ని
న్నురుపాథోధి విలంఘన క్షమునిఁగా నూహించి ధీమంతుఁడా
పరమేష్ఠి ప్రియపుత్రుఁ డంచితగతిన్‌ బ్రార్థింపఁడే మారుతీ!
14
శా. "ఏలా మీకు భయంబు నేఁ గలుగ, మీ రిందుండుఁ డేనొక్కఁడన్‌
వాలాయంబు పయోధి దాటి యనువొందన్‌ లంకలో జానకిం
బోలం గన్గొని వత్తు, నిత్తు బరమామోదంబు మీ" కంచు ధై
ర్యాలాపంబులు వల్కి తేర్చితివి గాదా కీశులన్‌ మారుతీ!
15
మ. బలి బంధించిన నాఁటి వామన తనుప్రాబల్యముం దాల్చి, యు
జ్జ్వల చంద్రోదయవేళఁ బొంగు తటినీశస్ఫూర్తి నుప్పొంగి, ఘో
ర లయాభ్రంబు తెఱంగునన్‌ భయద గర్జారావముం జేసి, త
జ్జలధిం దాటఁగఁ బూనితీవు పరమోత్సాహమ్మునన్‌ మారుతీ!
16
మ. స్థిరసత్త్వంబున శైలరాజము ధరిత్రిం గ్రుంగఁ బాదంబులూ
ది, రహిన్‌ భూరిభుజోరు వేగమున ధాత్రీజాతముల్‌ పెల్లగి
ల్లి రయంబారఁగఁ దోడ రా, గగనమున్‌ లీలాగతిన్‌ మ్రింగ సు
స్థిరశక్తిం జనుమాడ్కి దాటితివి గాదే నింగికిన్‌ మారుతీ!
17
మ. అగజాలావృతమూర్తివై భుజరయోద్యద్వారివాహంబు లొ
ప్పుగ నిర్వంకల నంటి రా గదలి యంభోరాశిమధ్యంబునన్‌
గగనాధ్వంబున నేగు నిన్నమిషుల్‌, గంధర్వులున్‌ లంబప
క్ష గిరీంద్రంబును బోలె జూచిరికదా సంభ్రాంతులై మారుతీ!
18
శా. లోకాలోకగుహాముఖంబులు బదుల్‌ మ్రోయంగ నుద్వృత్తి న
స్తోకధ్వానమొనర్చి, వజ్రనిభ వక్షోఘట్టనస్ఫూర్తి మై
నాకంబున్‌ సుడిబెట్టి దాని పిదపన్‌ మన్నించి కేలూది ప్ర
త్యేకం బా బలవైరిచేత నభయంబిప్పింపవే మారుతీ!
19
మ. గరిమన్‌ వేల్పులు నీదు శక్తి దెలియం గాంక్షించి, నాగాంబయౌ
సురసం బంపిన వ్యాపితాస్య యగుచుం జొప్పాగి పోనీక ముం
దఱఁ దోతెంచిన, సూక్ష్మమూర్తివగుచుం దద్వక్త్రముం జొచ్చి గ్ర
మ్మర నేతెంచిన యోగసిద్ధుని నినుం బ్రార్థించెదన్‌ మారుతీ!
20
AndhraBharati AMdhra bhArati - shatakamulu - mAruti shatakamu ( telugu andhra )