శతకములు మారుతి శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101 111
మ. ప్రమదం బొప్పఁగ రాముఁడున్‌ భవదభిప్రాయంబు నూహించి, నీ
సముదంచద్పదభక్తికిన్‌ విమలప్రజ్ఞాయుక్తికిన్‌ మెచ్చి, సం
యములైనన్‌ బడయంగరాని మహనీయాధ్యాత్మ విద్యోపదే
శముఁ గావింపఁడె నీకు మేదినిసుతాసంయుక్తుఁడై మారుతీ!
101
మ. భవదీయోరుతపఃప్రభావమును శశ్వత్సాధుభావంబు, యో
గ్యవివేకంబును శాస్త్రపాండితియు నిష్కామత్వమున్‌ సంతతా
ర్జవమున్‌ జూచి రఘుప్రవీరుఁడు భవిష్యద్బ్రహ్మవౌదంచు నీ
కు వరం బర్థి నొసంగడే బృహదనుక్రోశంబునన్‌ మారుతీ!
102
మ. మునిశాపంబున నీప్రభావమహిమంబున్‌, శక్తియున్‌ నీవెఱుం
గని బీజంబున శైలసుప్తవిలసత్కంఠీరవేంద్రంబు లా
గున నట్లుంటివి గాక నిక్కము మదిన్‌ గోపించినన్‌ సర్వలో
కనికాయంబుల నొక్క పెట్ట నుఱుముం గావింపవే మారుతీ!
103
మ. హరివంశోత్తమ! నీవు చేసిన విచిత్రాచింత్యకార్యంబులా
హరియైనన్‌, హరుఁడైన, పంకజభవుఁడైనన్‌, దిగీశుల్‌, పురం
దరుఁడైనన్‌, నిఖిలాహిలోకపతులైనం జేయఁగా లేరు నీ
సరివారెవ్వరు లేరు ముజ్జగములం జర్చింపఁగా మారుతీ!
104
మ. ధృతియున్‌, నీతియు, సాహసంబు, స్మృతియున్‌, తేజంబు సర్వశ్రుతి
స్మృతిపారీణతయున్‌, యశంబు, విజయోన్మేషంబు, శాస్త్రజ్ఞతా
చతురత్వంబు, శమక్షమాదిగుణముల్‌, సాధుత్వమున్‌, శౌర్యమున్‌
వితతప్రజ్ఞ, జితేంద్రియత్వము రహిన్‌ నీకే తగున్‌ మారుతీ!
105
శా. నీ మాహాత్మ్యము, నీ రయోపచయమున్‌, నీ సత్త్వసామగ్రియున్‌
సామాన్యంబె యొకింత వాయువునకున్‌, నాగారికిన్‌ కల్గితే
నేమోకాని తలంప ముజ్జగములం దెవ్వారికిం గల్గదో
హైమాద్రిప్రతిమోన్నతీ! గురుమతీ! అర్కద్యుతీ! మారుతీ!
106
మ. ఉదయాస్తాద్రులమీఁద పాదయుగళం బొప్పారగా నుంచి, మే
ను దివంబంతయు నిండఁ బెంచి, యలభానుం డర్మిలిం జెప్పఁగా
జదువుల్‌ నేర్చుతఱిన్‌ భవత్తనువిలాసంబంతయుం జూచి స
ర్వదివౌకుల్‌ వెఱతోఁ ద్రివిక్రమునిగా భావింపరే మారుతీ!
107
మ. అమరాద్రిప్రతిమానవిగ్రహము, బాలార్కప్రతీకాశవ
క్త్రము శోభిల్లఁగ బారిజాతతరుమూలం బందు గూర్చుండి, యు
త్తమభక్తిన్‌ రఘురామమూర్తిని మదిన్‌ ధ్యానింపుచున్‌ దత్పవి
త్రమహామంత్ర మొగిన్‌ జపించు నిను నే బ్రార్థించెదన్‌ మారుతీ!
108
శా. నీ కళ్యానగుణంబులున్‌, మహిమయున్‌, నీరేజగర్భుండు, తా
రాకాంతుండును, భోగివల్లభుఁడు, గీర్వాణప్రభుండును, భవా
నీకాంతుండు గణింపజాల రనినన్‌ నేనెంతవాడన్‌ రహిన్‌
నాకుం దోఁచినభంగి నెన్నితిఁ గృపన్‌ మన్నింపవే మారుతీ!
109
శా. ఆరామాధిపు నొద్ద వానరు లనేకాక్షౌహిణుల్‌ లేరె? యె
వ్వారైనన్‌ బహులక్షయోజనము లవ్వారాశి లంఘించి, సొం
పారన్‌ యామములోన నౌషధినగం బాసక్తి తేఁజాలిరే?
ఔరా! నీకది జెల్లెఁగాక! కపివంశాగ్రేసరా! మారుతీ!
110
AndhraBharati AMdhra bhArati - shatakamulu - mAruti shatakamu ( telugu andhra )