| శతకములు | నరసింహ శతకము |
|
| సీ. |
శ్రీ మనోహర! సురార్చిత సింధుగంభీర! - భక్తవత్సల! కోటిభానుతేజ! కంజనేత్ర! హిరణ్యకశ్యపాంతక! శూర! - సాధురక్షణ! శంఖచక్ర హస్త! ప్రహ్లాద వరద! పాపధ్వంస! సర్వేశ! - క్షీరసాగరశయన! కృష్ణవర్ణ! పక్షివాహన! నీలభ్రమరకుంతలజాల! - పల్లవారుణపాదపద్మయుగళ |
|
| తే. |
చారుశ్రీచందనాగరుచర్చితాంగ! - కుందకుట్మలదంత! వైకుంఠధామ! భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! |
1 |
| సీ. |
పద్మలోచన! సీసపద్యముల్ నీమీఁదఁ - జెప్పఁ బూనితినయ్య!చిత్తగింపు గణ యతి ప్రాస లక్షణముఁ జూడఁగలేదు - పంచకావ్య శ్లోకపఠన లేదు అమరకాండత్రయంబరసి చూడఁగలేదు - శాస్త్రీయ గ్రంథముల్ చదువలేదు నీ కటాక్షంబుననే రచించెదఁ గాని - ప్రజ్ఞ నాయది గాదు ప్రస్తుతింపఁ |
|
| తే. |
దప్పుగలిగిన సద్భక్తి తక్కువౌనె - చెఱకునకు వంకపోయిన చెడునె తీపు? భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! |
2 |
| సీ. |
నరసింహ! నీ దివ్యనామమంత్రముచేత - దురితజాలములెల్ల ద్రోలవచ్చు నరసింహ! నీ దివ్యనామమంత్రముచేత - బలువైన రోగముల్ బాపవచ్చు నరసింహ! నీ దివ్యనామమంత్రముచేత - రిపు సంఘముల సంహరింపవచ్చు నరసింహ! నీ దివ్యనామమంత్రముచేత - దండహస్తుని బంట్లఁదఱుమవచ్చు |
|
| తే. |
భళిర నేనీ మహామంత్రబలముచేత - దివ్యవైకుంఠ పదవి సాధింపవచ్చు భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! |
3 |
| సీ. |
ఆదినారాయణా! యనుచు నాలుకతోడఁ - బలుక నేర్చినవారి పాదములకు సాష్టాంగముగ నమస్కార మర్పణఁ జేసి - ప్రస్తుతించెదనయ్య బహువిధముల ధరణిలో నరులెంత దండివారైనను - నిన్నుఁ గాననివారి నే స్మరింప మేము శ్రేష్ఠులమంచు మిడుకుచుండెడివారి - చెంతఁ జేరఁగఁబోను శేషశయన! |
|
| తే. |
పరమ సాత్త్వికులైన నీ భక్తవరుల - దాసులకు దాసుఁడను జుమీ ధాత్రిలోన భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! |
4 |
| సీ. |
ఐశ్వర్యములకు నిన్ననుసరింపఁగలేదు - ద్రవ్య మిమ్మని వెంటఁ దగులలేదు కనక మిమ్మని చాలఁ గష్టపెట్టఁగలేదు - పల్ల కిమ్మని నోటఁ బలుకలేదు సొమ్ము లిమ్మని నిన్నునమ్మి కొల్వఁగలేదు - భూము లిమ్మని పేరు పొగడలేదు బలము లిమ్మని నిన్ను బ్రతిమాలఁగాలేదు - పసుల నిమ్మని పట్టుపట్టలేదు |
|
| తే. |
నేను గోరిన దొక్కటే నీలవర్ణ - చయ్యనను మోక్షమిచ్చినఁ జాలు నాకు భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! |
5 |
| సీ. |
మందుఁడనని నన్ను నిందఁ జేసిననేమి? - నా దీనతను జూచి నవ్వనేమి? దూరభావములేక తూలనాడిన నేమి? - ప్రీతిసేయక వంకఁ బెట్టనేమి? కక్కసంబులు పల్కి వెక్కిరించిన నేమి? - తీవ్రకోపముచేతఁ దిట్టనేమి? హెచ్చుమాటల చేత నెమ్మెలాడిన నేమి? - చేరి దాపట గేలిచేయనేమి? |
|
| తే. |
కల్ప వృక్షమువలె నీవు గల్గనింకఁ - బ్రజల లక్ష్యంబు నాకేల?పద్మనాభ భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! |
6 |
| సీ. |
చిత్తశుద్ధిగ నీకుసేవఁజేసెదఁ గాని - పుడమిలో జనుల మెప్పులకుఁ గాదు జన్మపావనతకై స్మరణఁజేసెదఁ గాని - సరివారిలోఁ బ్రతిష్ఠలకుఁ గాదు ముక్తికోసము నేనుమ్రొక్కి వేఁడెదఁ గాని - దండి భాగ్యము నిమిత్తంబుఁ గాదు నిన్నుఁ బొగడఁగ విద్యనేర్చితినే కాని - కుక్షినిండెడి కూటికొఱకుఁ గాదు |
|
| తే. |
పారమార్థికమునకు నేఁ బాటుపడితిఁ - గీర్తికి నపేక్షపడలేదు కృష్ణవర్ణ! భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! |
7 |
| సీ. |
శ్రవణ రంధ్రముల నీసత్కథల్ పొగడంగ - లేశ మానందంబు లేనివాఁడు పుణ్యవంతులు నిన్నుఁబూజసేయఁగఁ జూచి - భావమం దుత్సాహపడనివాఁడు భక్తవర్యులు నీ ప్రభావముల్ పొగడంగఁ - దత్పరత్వములేక తలఁగువాఁడు తనచిత్తమందు నీ ధ్యానమెన్నఁడు లేక - కాలమంతయు వృథాగడుపువాఁడు |
|
| తే. |
వసుధలోనెల్ల వ్యర్థుండువాఁడె యగును - మఱియుఁ జెడుఁగాక యెప్పుడు మమతనొంది భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! |
8 |
| సీ. |
గౌతమీస్నానానఁ గడతేఱుద మఁటన్న - మొనసి చన్నీళ్లలో మునుఁగలేను తీర్థయాత్రలచేఁ గృతార్థుఁ డౌద మఁటన్న - బడలి నేమంబు లే నడుపలేను దాన ధర్మముల సద్గతిని జెందుదమన్న - ఘనముగా నా యొద్ద ధనము లేదు తపమాచరించి సార్థకత నొందుదమన్న - నిమిషమైన మనస్సు నిలుపలేను |
|
| తే. |
కష్టములకోర్వ నాచేతఁగాదు నిన్ను - స్మరణ చేసెద నా యథాశక్తి కొలఁది భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! |
9 |
| సీ. |
అర్థివాండ్రకునీక హానిఁ జేయుటకంటెఁ - దెంపుతో వసనాభిఁ దినుట మేలు ఆఁడుబిడ్డల సొమ్ములపహరించుటకంటె - బండఁ గట్టుక నూతఁ బడుట మేలు పరులకాంతలఁ బట్టి బల్మిఁ గూడుటకంటె - బడబాగ్ని కీలలఁ బడుట మేలు బ్రతుకఁ జాలక దొంగపనులు చేయుటకంటెఁ - గొంగుతో ముష్టెత్తుకొనుట మేలు |
|
| తే. |
జలజదళనేత్ర నీ భక్తజనులతోడి - జగడమాడెడు పనికంటెఁ జావు మేలు భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! |
10 |