శతకములు నరసింహ శతకము
 1 11 21 31 41 51 61 71 81 91
సీ. అతివిద్యనేర్చుట యన్నవస్త్రములకే - పసుల నార్జించుట పాలకొఱకె
సతిని బెండ్లాడుట సంసారసుఖముకే - సుతులఁ బోషించుట గతులకొఱకె
సైన్యముల్‌ గూర్చుట శత్రుభయమునకే - సాము నేర్చుటలెల్ల చావుకొఱకె
దానమిచ్చుటయు ముందటి సంచితమునకే - ఘనముగాఁ జదువుట కడుపుకొఱకె
 
తే. యితర కామంబుఁ గోరక సతతముగను - భక్తి నీయందు నిలుపుట ముక్తికొఱకె
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
31
సీ. ధరణిలో వేయేండ్లు తనువు నిల్వఁగబోదు - ధన మెప్పటికి శాశ్వతంబు గాదు
దారసుతాదులు తనవెంట రాలేరు - భృత్యులు మృతినిఁ దప్పించలేరు
బంధుజాలము తన్ను బ్రతికించుకోలేదు - బలపరాక్రమ మేమి పనికిరాదు
ఘనమైన సకల భాగ్యం బెంతఁ గల్గిన - గోచిమాత్రంబైనఁ గొనుచుఁబోఁడు
 
తే. వెఱ్ఱికుక్కల భ్రమలన్ని విడిచి నిన్ను - భజనఁ జేసెడివారికిఁ బరమసుఖము
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
32
సీ. నరసింహ! నాకు దుర్ణయములే మెండాయె - సుగుణ మొక్కటి లేదు చూఁడ జనిన
నన్యకాంతల మీఁద యాశ మానఁగలేను - నొరుల క్షేమము చూచియోర్వలేను
ఇటువంటి దుర్బుద్ధులిన్ని నాకున్నవి - నేను జేసెడివన్ని నీచకృతులు
నావంటి పాపిష్ఠినరుని భూలోకాన - బుట్టఁ జేసితివేల భోగిశయన!
 
తే. అబ్జదళనేత్ర! నాతండ్రివైన ఫలము - నేరములు గాచి రక్షింపు నీవె దిక్కు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
33
సీ. ధీరతఁ బరుల నిందింప నేర్చితి గాని - తిన్నఁగా నినుఁ బ్రస్తుతింపనైతిఁ
బొరుగు కామినులందు బుద్ధి నిల్పితిఁ గాని - నిన్ను సంతతము ధ్యానింపనైతిఁ
బెరికి ముచ్చటలైన మురిసి వింటిని గాని - యెంచి నీ కథ లాలకించనైతిఁ
గౌతుకంబునఁ బాతకము గడించితిఁ గాని - హెచ్చు పుణ్యము సంగ్రహింపనైతి
 
తే. నవనిలో నేను జన్మించినందుకేమి - సార్థకము గానరాదాయె స్వల్పమైన
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
34
సీ. అంత్యకాలమునందు నాయాసమున నిన్నుఁ - దలఁతునో తలఁపనో తలఁతు నిపుడె
నరసింహ! నరసింహ! నరసింహ! లక్ష్మీశ! - దానవాంతక! కోటిభానుతేజ!
గోవింద! గోవింద! గోవింద! సర్వేశ! - పన్నగాధిపశాయి! పద్మనాభ!
మధువైరి! మధువైరి! మధువైరి! లోకేశ! - నీలమేఘశరీర! నిగమవినుత!
 
తే. ఈ విధంబున నీనామమిష్టముగను - భజన సేయుచు నుందు నా భావమందు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
35
సీ. ఆయురారోగ్య పుత్రార్థ సంపదలన్ని - కలుగఁజేసెడి భారకర్త వీవె
చదువు లెస్సఁగనేర్పి సభలో గరిష్ఠాధి - కార మొందించెడి ఘనుఁడ వీవె
నడక మంచిది పెట్టి నరులు మెచ్చెడునట్టి - పేరు రప్పించెడి పెద్ద వీవె
బలువైన వైరాగ్యభక్తిజ్ఞానములిచ్చి - ముక్తిఁ బొందించెడు మూర్తి వీవె
 
తే. అవనిలో మానవుల కన్నియాసలిచ్చి - వ్యర్థులను జేసి తెలిపెడివాఁడ వీవె
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
36
సీ. కాయ మెంత భయానఁ గాపాడిననుగాని - ధాత్రిలో నది చూడ దక్కఁబోదు
ఏవేళ నేరోగమేమరించునొ? సత్త్వ - మొందఁగఁ జేయునే చందమునను
ఔషధంబులు మంచివనుభవించినఁ గాని - కర్మక్షీణంబైనఁ గాని విడదు
కోటివైద్యులు గుంపుగూడివచ్చినఁ గాని - మరణ మయ్యెడు వ్యాధిమాన్పలేరు
 
తే. జీవుని ప్రయాణకాలంబు సిద్ధమైన - నిలుచునా దేహ మిందొక్క నిమిషమైన?
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
37
సీ. జందెమింపుగ వేసి సంధ్య వార్చిన నేమి - బ్రహ్మ మందక కాఁడు బ్రాహ్మణుండు
తిరుమణి శ్రీచూర్ణగురురేఖ లిడినను - విష్ణు నొందక కాఁడు వైష్ణవుండు
బూదిని నుదుటను బూసికొనిన నేమి - శంభు నొందక కాఁడు శైవజనుఁడు
కాషాయ వస్త్రాలుగట్టి కప్పిన నేమి - యాశ పోవక కాఁడు యతివరుండు
 
తే. ఎట్టి లౌకికవేషాలు గట్టుకొనిన - గురునిఁ జెందక సన్ముక్తి దొరకఁబోదు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
38
సీ. నరసింహ! నే నిన్ను నమ్మినందుకుఁ జాల - నెనరు నాయందుంచు నెమ్మనమున
నన్ని వస్తువులు నిన్నడిగి వేసటపుట్టె - నింకనైనఁ గటాక్షమియ్యవయ్య
సంతసంబున నన్ను స్వర్గమందే యుంచు - భూమియందే యుంచు భోగిశయన!
నయముగా వైకుంఠనగరమందే యుంచు - నరకమందే యుంచు నళిననాభ!
 
తే. ఎచట నన్నుంచిననుగాని యెపుడు నిన్ను - మఱచి పోకుండ నీ నామస్మరణనొసఁగు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
39
సీ. దేహ మున్నవఱకు మోహసాగరమందు - మునుఁగుచుందురు శుద్ధమూఢజనులు
సలలితైశ్వర్యముల్‌ శాశ్వతం బనుకొని - షడ్భ్రమలను మానఁజాల రెవరు
సర్వకాలము మాయసంసార బద్ధులై - గురుని కారుణ్యంబుఁ గోరుకొనరు
జ్ఞాన భక్తి విరక్తులైన పెద్దలఁ జూచి - నిందఁ జేయక తాము నిలువలేరు
 
తే. మత్తులైనట్టి దుర్జాతిమనుజులెల్ల - నిన్నుఁ గనలేరు మొదటికే నీరజాక్ష!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
40
AndhraBharati AMdhra bhArati - shatakamulu - narasiMha shatakamu ( telugu andhra )