శతకములు నరసింహ శతకము
 1 11 21 31 41 51 61 71 81 91
సీ. నీకథల్‌ చెవులలో సోఁకుట మొదలుగాఁ - బులకాంకురము మేనఁ బుట్టువాఁడు
నయమైన నీ దివ్యనామకీర్తనలోన - మగ్నుఁడై దేహంబు మఱచువాఁడు
ఫాలంబుతో నీదు పాదయుగ్మమునకుఁ - బ్రేమతోఁ దండ మర్పించువాఁడు
హా పుండరీకాక్ష! హా రామ! హరి! యంచు - వేడ్కతోఁ గేకలు వేయువాఁడు
 
తే. చిత్తకమలంబునను నిన్నుఁ జేర్చువాఁడు - నీదు లోకంబు నందుండు నీరజాక్ష!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
91
సీ. నిగమగోచర! నేను నీకు మెప్పగునట్లు - లెస్సగాఁ బూజింపలేను సుమ్మి
నాకుఁ దోఁచిన భూషణములు పెట్టెదనన్నఁ - గౌస్తుభమణి నీకుఁ గలదు ముందె
భక్ష్యభోజ్యముల నర్పణముఁ జేసెద నన్న - నీవు పెట్టితి సుధ నిర్జరులకుఁ
గలిమికొలదిగఁ గానుకల నొసంగెద నన్న - భార్గవీదేవి నీ భార్యయయ్యె
 
తే. నన్ని గలవాఁడ వఖిల లోకాధిపతివి! - నీకు సొమ్ములు పెట్ట నేనెంతవాఁడ!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
92
సీ. నవ సరోజదళాక్ష! నన్నుఁ బోషించెడు - దాతవు నీవంచు ధైర్యపడితి
నా మనంబున నిన్ను నమ్మినందుకుఁ దండ్రి! - మేలు నా కొనరింపు నీలదేహ!
భళిభళీ! నీ యంత ప్రభువు నెక్కడఁ జూడఁ - బుడమిలో నీ పేరు పొగడవచ్చు
ముందుఁ జేసిన పాపమును నశింపఁగఁ జేసి - నిర్వహింపుము నన్ను నేర్పుతోడఁ
 
తే. బరమ సంతోషమాయె నా ప్రాణములకు - నీ ఋణము దీర్చుకొననేర నీరజాక్ష!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
93
సీ. ఫణుల పుట్టల మీఁదఁ బవ్వళించిన యట్లు - పులుల గుంపునఁ జేరఁబోయిన యట్లు
మకరి వర్గంబున్న మడుఁగుఁ జొచ్చినయట్లు - గంగ దాపున నిండ్లు గట్టినట్లు
చెదల భూమిని చెరగు చాఁప బఱచినయట్లు - ఓటిబిందెలఁ బాల నునిచినట్లు
వెఱ్ఱివానికిఁ బహువిత్త మిచ్చినయట్లు - కమ్మగుడిసె మందుఁ గాల్చినట్లు
 
తే. స్వామి నీ భక్తవరులు దుర్జనులతోడఁ - జెలిమిఁ జేసిన యట్లైనఁ జేటు వచ్చు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
94
సీ. దనుజసంహార! చక్రధర! నీకు దండంబు - లిందిరాధిప! నీకు వందనంబు
పతితపావన! నీకు బహునమస్కారముల్‌ - నీరజాతదళాక్ష! నీకు శరణు
వాసవార్చిత! మేఘవర్ణ! నీకు శుభంబు - మందరధర! నీకు మంగళంబు
కంబుకంధర! శార్ఙ్గకర! నీకు భద్రంబు - దీనరక్షక! నీకు దిగ్విజయము
 
తే. సకలవైభవములు నీకు సార్వభౌమ! - నిత్యకల్యాణములు నగు నీకు నెపుడు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
95
సీ. మత్స్యావతారమై మడుఁగులోపలఁ జొచ్చి - సోమకాసురుఁ ద్రుంచి చోద్యముగను
దెచ్చి వేదములెల్ల మెచ్చ దేవతలెల్ల - బ్రహ్మకిచ్చితి వీవు భళి! యనంగ
నా వేదముల నియ్య నాచారనిష్ఠల - ననుభవించుచు నుందు రవనిసురులు
సకలపాపంబులు సమసిపోవు నటంచు - మనుజులందఱు నీదు మహిమఁ దెలిసి
 
తే. యుందు రరవిందనయన! నీయునికిఁ దెలియు - వారలకు వేగ మోక్షంబు వచ్చు ననఘ!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
96
సీ. కూర్మావతారమై కుధరంబు క్రిందను - గోర్కెతో నుండవా కొమరు మిగుల?
వరాహావతారమై వనభూములను జొచ్చి - శిక్షింపవా హిరణ్యాక్షు నపుడు?
నరసింహమూర్తివై నరభోజను హిరణ్య - కశిపునిఁ ద్రుంపవా కాంతి మీఱ?
వామనరూపమై వసుధలో బలిచక్ర - వర్తి నణంపవా వైర ముడిగి?
 
తే. యిట్టి పనులెల్లఁ జేయఁగా నెవరికేని - తగునె నరసింహ! నీ కిది దగును గాక!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
97
సీ. లక్ష్మీశ! నీ దివ్యలక్షణ గుణముల - వినఁజాల కెప్పుడు వెఱ్ఱినైతి
నావెఱ్ఱిగుణములు నయముగా ఖండించి - నన్ను రక్షింపుమో నళిననేత్ర!
నిన్ను నే నమ్మితి నితరదైవముల నే - నమ్మలేదెప్పుడు నాగశయన!
కాపాడినను నీవె కష్టపెట్టిన నీవె - నీ పాదకమలముల్‌ నిరత మేను
 
తే. నమ్మియున్నాను నీ పాదనళినభక్తి - వేగ దయచేసి రక్షింపు వేదవిద్య!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
98
సీ. అమరేంద్రవినుత! నిన్ననుసరించినవారు - ముక్తిఁ బొందిరి వేగ ముదముతోడ
నీ పాదపద్మముల్‌ నెఱ నమ్మియున్నాను - నాకు మోక్షంబిమ్ము నళిననేత్ర!
కాచి రక్షించు నన్‌ గడతేర్చు వేగమే - నీ సేవకునిఁ జేయు నిశ్చయముగఁ
గాపాడినను నీకుఁ గైంకర్యపరుఁడనై - చెలఁగి నీ పనులను జేయువాఁడ
 
తే. ననుచుఁ బలుమాఱు వేఁడెద నబ్జనాభ! - నాకుఁ బ్రత్యక్ష మగుము నిన్‌ నమ్మినాను
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
99
సీ. శేషప్ప యను కవిచెప్పిన పద్యముల్‌ - చెవుల కానందమై చెలఁగుచుండు
నే మనుజుండైన నెలమి నీ శతకంబు - భక్తితో విన్న సత్ఫలము గలుగుఁ
జెలఁగి యీ పద్యముల్‌ చేర్చి వ్రాసినవారు - కమలాక్షు కరుణను గాంతురెపుడు
నింపుగాఁ బుస్తకంబెపుడుఁ బూజించిన - దురితజాలంబులు దొలఁగిపోవు
 
తే. నిద్ది పుణ్యాకరం బనియెపుడు జనులు - గష్టమెన్నక పఠియింపఁ గలుగు ముక్తి
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
100
AndhraBharati AMdhra bhArati - shatakamulu - narasiMha shatakamu ( telugu andhra )