శతకములు నరసింహ శతకము
 1 11 21 31 41 51 61 71 81 91
సీ. వదనంబు నీనామభజన గోరుచునుండు - జిహ్వ నీ కీర్తనల్‌ సేయఁ గోరు
హస్తయుగ్మంబు నిన్నర్చింపఁ గోరును - గర్ణముల్‌ నీ మీఁద కథలు గోరుఁ
దనువు నీ సేవయే ఘనముగాఁ గోరును - నయనముల్‌ నీ దర్శనంబుఁ గోరు
మూర్ధమ్ము నీ పదమ్ముల మ్రొక్కఁగాఁ గోరుఁ - నాత్మ నీదై యుండు నరసి చూడ
 
తే. స్వప్నమున నైన నేవేళ సంతతమును - బుద్ధి నీ పాదములయందుఁ బూనియుండు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
81
సీ. పద్మాక్ష! మమతచేఁ బరము నందెద మంచు - విఱ్ఱవీఁగుదుమయ్య వెఱ్ఱిపట్టి
మాస్వతంత్రంబైన మదము గండ్లకుఁ గప్పి - మొగము పట్టదు కామమోహమునను
బ్రహ్మదేవుండైనఁ బైడిదేహము గల్గఁ - జేసివేయక మమ్ముఁ జెఱిచె నతఁడు
తుచ్ఛమైనటువంటి తోలెమ్ముకల తోడి - ముఱికి చెత్తలు చేర్చి మూట కట్టె
 
తే. నీ శరీరాలు పడిపోవుటెఱుఁగ కేము - కాముకుల మైతిమిఁక మిమ్ముఁగానలేము
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
82
సీ. గరుడవాహన! దివ్యకౌస్తుభాలంకార! - రవికోటితేజ! సారంగవదన!
మణిగణాన్విత! హేమమకుటాభరణ! చారు - మకరకుండల! లసన్మందహాస!
కాంచనాంబర! రత్నకాంచీవిభూషిత! - సురవరార్చిత! చంద్రసూర్యనయన!
కమలనాభ! ముకుంద! గంగాధరస్తుత! - రాక్షసాంతక! నాగరాజశయన!
 
తే. పతితపావన! లక్ష్మీశ! బ్రహ్మజనక! - భక్తవత్సల! సర్వేశ! పరమపురుష!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
83
సీ. పలుమాఱు దశ రూపములు ధరించితి వేల? - యేకరూపముఁ బొందవేల నీవు?
నయమున క్షీరాబ్ధి నడుమఁ జేరితి వేల? - రత్నకాంచన మందిరములు లేవె?
పన్నగేంద్రునిమీఁదఁ బవ్వళించితి వేల? - జలతారు పట్టెమంచములు లేరె?
ఱెక్కలు గల పక్షినెక్కసాగితి వేల? - గజతురంగాందోళికములు లేవె?
 
తే. వనజలోచన! యిటువంటివైభవములు - సొగసుగా నీకుఁ దోఁచెనో సుందరాంగ?
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
84
సీ. తిరుపతి స్థలమందుఁ దిన్నఁగా నే నున్న - వేంకటేశుఁడు మేఁతవేయలేఁడొ?
పురుషోత్తమమునకుఁ బోయినఁజాలు జ - గన్నాథుఁ డన్నంబుఁ గడపలేఁడొ?
శ్రీరంగమునకు నేఁ జేరఁబోయినఁ జాలు - స్వామి గ్రాసముఁ బెట్టి సాఁకలేఁడొ?
కాంచీపురములోనఁ గదిసి నేఁ గొలువున్నఁ - గరివరదుఁడు పొట్టఁ గడపలేఁడొ?
 
తే. యెందుఁ బోవక నేను నీ మందిరమున - నిలిచితిని నీకు నామీఁద నెనరు లేదు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
85
సీ. తార్క్ష్యవాహన! నీవు దండిదాత వటంచుఁ - గోరి వేడుక నిన్నుఁ గొల్వవచ్చి
యర్థిమార్గమును నేననుసరించితినయ్య - లావైనఁ బదునాల్గులక్ష లైన
వేషముల్‌ వేసి నావిద్యాప్రగల్భతఁ - జూపసాగితి నీకు సుందరాంగ!
యానందమైన నేనడుగ వచ్చిన దెచ్చి - వాంఛఁ దీర్పుము నీలవర్ణ! వేగ
 
తే. నీకు నావిద్య హర్షంబుగాక యున్న - తేపతేపకు వేషముల్‌ దేను సుమ్మి
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
86
సీ. అమరేంద్రవినుత! నేనతి దురాత్ముఁడ నంచుఁ - గలలోన నైనను గనులఁ బడవు
నీవు ప్రత్యక్షమై నిలువకుండిన మానె - దొడ్డగా నొక యుక్తి దొరకెనయ్య!
గట్టికొయ్యను దెచ్చి ఘనముగా ఖండించి - నీ స్వరూపము చేసి నిలుపుకొందు
ధూప దీపము లిచ్చి తులసితోఁ బూజించి - నిత్యనైవేద్యముల్‌ నేమముగను
 
తే. నడుపుచును నిన్నుఁ గొలిచెదనమ్మి బుద్ధి - నీ ప్రపంచంబు గలుగు నాకింతె చాలు
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
87
సీ. భువనేశ! గోవింద! రవికోటిసంకాశ! - పక్షివాహన! భక్తపారిజాత!
యంభోజభవరుద్ర జంభారిసన్నుత! - సామగానవిలోల! సారసాక్ష!
వనధిగంభీర! శ్రీవత్స కౌస్తుభవక్ష! - శంఖచక్ర గదాసి శార్ఙ్గహస్త!
దీనరక్షక! వాసుదేవ! దైత్యవినాశ! - నారదార్చిత! దివ్యనాగశయన!
 
తే. చారు నవరత్నకుండల శ్రవణయుగళ! - విబుధవందిత పాదాబ్జ! విశ్వరూప!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
88
సీ. నాగేంద్రశయన! నీనామమాధుర్యంబు - మూఁడుకన్నుల సాంబమూర్తి కెఱుక
పంకజాతాక్ష! నీ బలపరాక్రమ మెల్ల - భారతీపతి యైన బ్రహ్మ కెఱుక
మధుకైటభారి! నీ మాయాసమర్థత - వసుధలో బలిచక్రవర్తి కెఱుక
పరమాత్మ! నీదగు పక్షపాతిత్వంబు - దశశతాక్షుల పురందరుని కెఱుక
 
తే. వీరి కెఱుకగు నీకథల్‌ వింత లెల్ల - నరుల కెఱుకన్న నెవరైన నవ్విపోరె?
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
89
సీ. అర్థులేమైన నిన్నడుగ వచ్చెద రంచు - క్షీరసాగరమందుఁ జేరినావు
నీచుట్టు సేవకుల్‌ నిలువకుండుటకునై - భయద సర్పముమీఁదఁ బండినావు
భక్తబృందము వెంటఁబడి చరించెద రంచు - నెగసి పోయెడి పక్షినెక్కినావు
దాసులు నీ ద్వారమాసింపకుంటకు - మంచి యోధుల కావలుంచినావు
 
తే. లావు గలవాఁడ వైతి వేలాగు నేను - నిన్నుఁ జూతును నా తండ్రి నీరజాక్ష!
భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర!
90
AndhraBharati AMdhra bhArati - shatakamulu - narasiMha shatakamu ( telugu andhra )