| శతకములు | నరసింహ శతకము |
|
| సీ. |
ఇలలోన నే జన్మమెత్తినప్పటినుండి - బహు గడించితినయ్య పాతకములు తెలిసి చేసితిఁ గొన్ని తెలియఁజాలక చేసి - బాధ నొందితినయ్య పద్మనాభ! అనుభవించెడు నప్పుడతి ప్రయాసంబంచుఁ - బ్రజలు చెప్పఁగఁ జాల భయము గలిగె నెగిరి పోవుటకునై యే యుపాయంబైనఁ - జేసి చూతమఁటన్నఁ జేతఁగాదు |
|
| తే. |
సూర్యశశినేత్ర! నీ చాటుఁజొచ్చి నాను - కలుషములు ద్రుంచి నన్నేలు కష్టమనక భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! |
41 |
| సీ. |
తాపసార్చిత! నేను పాపకర్ముఁడనంచు - నాకు వంకలఁ బెట్టఁబోకు సుమ్మి నాఁటికి శిక్షలు నన్ను చేయుటకంటె - నేఁడు సేయుము నీవు నేస్తమనక అతిభయంకరులైన యమదూతలకు నన్ను - నొప్పగింపకు మయ్య యురగశయన! నీ దాసులను బట్టి నీవు దండింపంగ - వద్దు వద్దనరెంత పెద్దలైనఁ |
|
| తే. |
దండ్రివై నీవు పరపీడ దగులఁజేయ - వాసిగల పేరు కపకీర్తి వచ్చునయ్య భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! |
42 |
| సీ. |
ధరణిలోపల నేను తల్లి గర్భమునందుఁ - బుట్టినప్పటినుండి పుణ్య మెఱుఁగ నేకాదశీ వ్రతంబెన్నఁ డుండఁగ లేదు - తీర్థయాత్రలకైనఁ దిరుగలేదు పారమార్థికమైన పనులు చేయఁగలేదు - భిక్ష మొక్కనికైనఁ బెట్టలేదు జ్ఞానవంతులకైనఁ బూని మ్రొక్కఁగ లేదు - ఇతర దానములైన నియ్యలేదు |
|
| తే. |
నళినదళనేత్ర! నిన్ను నే నమ్మినాను - జేరి రక్షింపవే నన్ను శీఘ్రముగను భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! |
43 |
| సీ. |
అడవిపక్షుల కెవ్వఁడాహార మిచ్చెను - మృగజాతి కెవ్వఁడు మేఁతఁబెట్టె వనచరాదులకు భోజన మెవ్వఁ డిప్పించెఁ - జెట్లకెవ్వఁడు నీళ్లు చేదిపోసె స్త్రీల గర్భంబున శిశువు నెవ్వఁడు పెంచె - ఫణుల కెవ్వఁడు పోసెఁ బరగఁ బాలు మధుపాళి కెవ్వఁడు మకరంద మొనరించె - బసుల కెవ్వఁ డొసంగెఁ బచ్చిపూరి |
|
| తే. |
జీవకోట్లను బోషింప నీవెకాని - వేఱె యొక దాత లేఁడయ్య వెదకిచూడ భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! |
44 |
| సీ. |
దనుజారి! నావంటి దాసజాలము నీకు - కోటి సంఖ్య గలరు కొదువ లేదు బంట్లసందడివల్ల బహుపరాకై నన్ను - మఱచి పోకుము భాగ్యమహిమచేత దండిగా భృత్యులు దగిలి నీకుండంగ - బక్క బంటే పాటి పనికి వచ్చు? నీవు మెచ్చెడి పనుల్ నేను జేయఁగలేక - యింత వృథా జన్మమెత్తినాను |
|
| తే. |
భూజనులలోన నే నప్రయోజకుఁడను - గనుక నీ సత్కటాక్షంబు గలుగఁజేయు భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! |
45 |
| సీ. |
కమలలోచన! నన్నుఁ గన్నతండ్రివి గాన - నిన్ను నేమఱకుంటి నేను విడక యుదరపోషణకునై యొకరి నే నాశింప - నేర నా కన్నంబు నీవు నడుపు పెట్టలేనంటివా పిన్న పెద్దలలోనఁ - దగవు కిప్పుడు దీయఁ దలఁచినాను ధనము భారంబైనఁ దల కిరీటము నమ్ము - కుండలంబులు పైఁడిగొలుసు లమ్ము |
|
| తే. |
కొసకు నీ శంఖచక్రముల్ కుదువఁబెట్టి - గ్రాసము నొసంగి పోషించు కపటముడిగి భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! |
46 |
| సీ. |
కువలయశ్యామ! నీకొలువు చేసిన నాకు - జీత మెందుకు ముట్టఁజెప్పవైతి మంచిమాటలచేతఁ గొంచెమియ్యఁగలేవు - కలహమౌ నిఁకఁ జుమ్మి ఖండితముగ నీవు సాధువు గాననింత పర్యంతంబు - చనవుచే నిన్నాళ్ళు జరుపవలసె నిఁక నేసహింప నీవిపుడు నన్నేమైన - శిక్ష చేసినఁ జేయు సిద్ధమైతి |
|
| తే. |
నేఁడు కరుణింపకుంటివా నిశ్చయముగఁ - దెగఁబడితి చూడు నీ తోడ జగడమునకు భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! |
47 |
| సీ. |
హరి! నీకుఁ బర్యంకమైన శేషుడు చాలఁ - బవనము భక్షించి బ్రతుకుచుండు ననువుగా నీకు వాహనమైన ఖగరాజు - గొప్పపామును నోటఁ గొఱుకుచుండు యదిగాక నీ భార్యయైన లక్ష్మీదేవి - దినము పేరంటంబు దిరుగుచుండు నిన్ను భక్తులు పిల్చి నిత్యపూజలు చేసి - ప్రేమఁ బక్వాన్నముల్ పెట్టుచుండ్రు |
|
| తే. |
స్వస్థముగ నీకు గ్రాసము జరుగుచుండఁ - గాసు నీ చేతి దొకటైనఁ గాదు వ్యయము భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! |
48 |
| సీ. |
పుండరీకాక్ష! నారెండు కన్నుల నిండ - నిన్నుఁ జూచెడి భాగ్యమెన్నఁడయ్య వాసిగా నా మనోవాంఛ దీరెడునట్లు - సొగసుగా నీ రూపు చూపవయ్య పాపకర్ముని కంటఁ బడకబోవుదమంచుఁ - బరుషమైన ప్రతిజ్ఞఁ బట్టినావె? వసుధలోఁ బతిత పావనుఁడ వీ వంచు నేఁ - బుణ్యవంతుల నోటఁ బొగడ వింటి |
|
| తే. |
నేమిటికి విస్తరించె నీకింత కీర్తి - ద్రోహినైనను నా కీవు దొరకరాదె? భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! |
49 |
| సీ. |
పచ్చి చర్మపుఁదిత్తి పసలేదు దేహంబు - లోపల నంతట రోయ రోఁత నరములు శల్యముల్ నవరంధ్రములు రక్త - మాంసంబు కండలు మైల తిత్తి బలువైన యెండ వానల కోర్వ దింతైనఁ - దాళలే దాఁకలి దాహములకు సకల రోగములకు సంస్థానమై యుండు - నిలువ దస్థిరమైన నీటి బుగ్గ |
|
| తే. |
బొందిలో నుండు ప్రాణముల్ పోయినంతఁ - గాటికే గాని కొఱగాదు గవ్వకైన భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! |
50 |