| శతకములు | నరసింహ శతకము |
|
| సీ. |
పలురోగములకు నీపాదతీర్థమె కాని - వలపు మందులు నాకు వలదు వలదు చెలిమిసేయుచు నీకు సేవఁ జేసెదఁ గాన - నీ దాసకోటిలో నిలుపవయ్య గ్రహభయంబునకుఁ జక్రముఁ దలంచెదఁ గాని - ఘోరరక్షలు గట్టఁగోరనయ్య పాముకాటుకు నిన్నుఁభజనఁ జేసెదఁ గాని - దాని మంత్రము నేను తలఁపనయ్య |
|
| తే. |
దొరికితివి నాకు దండి వైద్యుఁడవు నీవు - వేయికష్టాలు వచ్చిన వెఱవనయ్య భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! |
51 |
| సీ. |
కూటికోసము నేఁ గొఱగాని జనులచేఁ - బలు గద్దరింపులు పడఁగ వలసె దార సుత భ్రమ దగిలి యుండఁగఁ గదా - దేశ దేశము లెల్లఁ దిరుగవలసెఁ? బెను దరిద్రత పైని బెనఁగి యుండఁగఁ గదా - చేరి నీచుల సేవ చేయవలసె? నభిమానములు మదినంటి యుండఁగఁ గదా - పరులఁ జూచిన భీతి పడఁగవలసె? |
|
| తే. |
నిటుల సంసారవారధి నీఁదలేక - వేయి విధముల నిన్ను నే వేఁడుకొంటి భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! |
52 |
| సీ. |
సాధు సజ్జనులతో జగడమాడినఁ గీడు - కవులతో వైరంబుఁ గాంచఁ గీడు పరమ దీనులఁ జిక్కఁబట్టి కొట్టినఁ గీడు - భిక్షగాండ్రను దుఃఖపెట్టఁ గీడు నిరుపేదలను జూచి నిందఁ జేసినఁ గీడు - పుణ్యవంతులఁ దిట్ట బొసఁగుఁ గీడు సద్భక్తులను దిరస్కారమాడినఁ గీడు - గురుని ద్రవ్యము దోఁచుకొనినఁ గీడు |
|
| తే. |
దుష్టకార్యము లొనరించు దుర్జనులకు - ఘనతరంబైన నరకంబు గట్టిముల్లె భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! |
53 |
| సీ. |
పరులద్రవ్యము మీఁద భ్రాంతి నొందినవాఁడు - పరకాంతల కపేక్ష పడెడువాఁడు అర్థుల విత్తంబు లపహరించెడువాఁడు - దాన మియ్యంగ వద్దనెడివాఁడు సభలలోపల నిల్చి చాడి చెప్పెడివాఁడు - పక్షపు సాక్ష్యంబు పలుకువాఁడు విష్ణుదాసులఁ జూచి వెక్కిరించెడివాఁడు - ధర్మసాధులఁ దిట్టఁ దలఁచువాఁడు |
|
| తే. |
ప్రజల జంతుల హింసించు పాతకుండు - కాలకింకర గదలచేఁ గష్టమొందు భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! |
54 |
| సీ. |
నరసింహ! నా తండ్రి నన్నేలు నన్నేలు - కామితార్థము లిచ్చి కావు కావు దైత్యసంహార! చాల దయయుంచు దయయుంచు - దీనపోషక! నీవె దిక్కు దిక్కు రత్నభూషితవక్ష! రక్షించు రక్షించు - భువనరక్షక! నన్నుఁ బ్రోవు బ్రోవు మారకోటిస్వరూప! మన్నించు మన్నించు - పద్మలోచన! చేయి పట్టు పట్టు |
|
| తే. |
సురవినుత! నేను నీచాటుఁ జొచ్చినాను - నా మొఱాలించి కడతేర్చు నాగశయన! భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! |
55 |
| సీ. |
నీ భక్తులను గనుల్ నిండఁ జూచియు రెండు - చేతుల జోహారు సేయువాఁడు నేర్పుతో నెవరైన నీకథల్ చెప్పంగ - వినయమందుచుఁ జాల వినెడువాఁడు తన గృహంబునకు నీదాసులు రాఁ జూచి - పీటపైఁ గూర్చుండఁ బెట్టువాఁడు నీ సేవకుల జాతినీతు లెన్నక చాల - దాసోహ మని చేరఁ దలఁచువాఁడు |
|
| తే. |
పరమభక్తుండు ధన్యుండు భానుతేజ! - వానిఁ గనుఁగొన్నఁ బుణ్యంబు వసుధలోన భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! |
56 |
| సీ. |
పక్షివాహన! నేనుబ్రతికినన్ని దినాలు - కొండెగాండ్రను గూడి కుమతినైతి నన్నవస్త్రము లిచ్చి యాదరింపుము నన్నుఁ - గన్నతండ్రివి నీవె కమలనాభ! మరణ మయ్యెడినాఁడు మమతతో నీ యొద్ద - బంట్లఁ తోలుము ముందు బ్రహ్మజనక! ఇనజభటావళి యీడిచి కొనిపోక - కరుణతో నా యొద్దఁ గావలుంచు |
|
| తే. |
కొసకు నీ సన్నిధికిఁ బిల్చుకొనియు నీకు - సేవకునిఁ జేసికొనవయ్య శేషశయన! భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! |
57 |
| సీ. |
నిగమాదిశాస్త్రముల్ నేర్చిన ద్విజుఁడైన - యజ్ఞకర్తగు సోమయాజియైన ధరణిలోపలఁ బ్రభాత స్నానపరుడైన - నిత్య సత్కర్మాది నిరతుఁడైన నుపవాస నియమంబులొందు సజ్జనుఁడైనఁ - గావివస్త్రము గట్టు ఘనుఁడునైనఁ దండిషోడశ మహాదానపరుండైన - సకల యాత్రలు సల్పు సరసుఁడైన |
|
| తే. |
గర్వమునఁ గష్టపడి నిన్నుఁ గానకున్న - మోక్షసామ్రాజ్య మొందఁడు మోహనాంగ! భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! |
58 |
| సీ. |
పంజరంబునఁ గాకిఁ బట్టి యుంచిన లెస్స - పలుకునే వింతైన చిలుక వలెను? గార్దభంబును దెచ్చి కళ్లెమింపుగ వేయఁ - దిరుగునే గుఱ్ఱంబు తీరుగాను? ఎనుపపోతును మావటీఁడు శిక్షించిన - నడచునే మదవారణంబు వలెను? పెద్దపిట్టను మేఁతఁబెట్టి పెంచినఁ గ్రొవ్వి - సాగునే వేఁటాడు డేఁగ వలెను? |
|
| తే. |
కుజనులను దెచ్చి నీ సేవ కొరకుఁ బెట్ట - వాంఛతోఁ జేతురే భక్తవరుల వలెను? భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! |
59 |
| సీ. |
నీకు దాసుఁడ నంటి నిన్ను నమ్ముకయుంటిఁ - గాన నాపై నేఁడు కరుణఁజూడు దోసిలొగ్గితి నీకు ద్రోహ మెన్నఁగఁబోకు - పద్మలోచన! నేను పరుఁడగాను భక్తి నీపై నుంచి భజనఁ జేసెదఁ గాని - పరుల వేఁడను జుమ్మి వరము లిమ్ము దండిదాతవు నీవు తడవు సేయక కావు - ఘోరపాతకరాశిఁ గొట్టివైచి |
|
| తే. |
శీఘ్రముగఁ గోర్కె లీడేర్చి చింత దీర్చు - నిరతముగ నన్ను బోషించు నెనరు నుంచు భూషణవికాస! శ్రీధర్మపురనివాస! - దుష్టసంహార! నరసింహ దురితదూర! |
60 |