| శతకములు | భాస్కర శతకము |
|
| ఉ. |
స్థానముఁ దప్పివచ్చునెడఁ దానెటువంటి బలాఢ్యుఁడున్ నిజ స్థానికుఁడైన యల్పుని కతంబున నైనను మోసపోవుఁగా; కానల లోపలన్ వెడలి గంధగజం బొకనాఁడు నీటిలోఁ గానక చొచ్చినన్ మొసలి కాటుకు లోఁబడదటోటు భాస్కరా! |
101 |
| చ. |
సిరిగలవాని కెయ్యెడలఁ జేసిన మేలది నిష్ఫలం బగున్ నెఱిగుఱి గాదు పేదలకు నేర్పునఁ జేసిన సత్ఫలంబగున్ వఱపున వచ్చి మేఘుఁడొక వర్షము వాడిన చేలమీఁదటం గురిసినఁగాక యంబుధులఁ గుర్వఁగ నేమి ఫలంబు భాస్కరా! |
102 |
| చ. |
సిరివలెనేని సింహగుహ చెంత వసించినఁ జాలు సింహముల్ కరుల వధింపఁగా నచటఁ గల్గును దంతచయంబు ముత్యముల్ హరువుగ నక్కబొక్క కడ నాశ్రయమందిన నేమి గల్గెడుం గొరిసెలు దూడతోఁకలును గొమ్ములు నెమ్ములుఁగాక భాస్కరా! |
103 |
| చ. |
స్థిరతర ధర్మవర్తన బ్రసిద్ధికి నెక్కినవాని నొక్క ము ష్కరుఁ డతినీచవాక్యములఁ గాదని పల్కిన నమ్మహాత్ముఁడుం గొఱఁత వహింపఁడయ్యెడ; నకుంఠిత పూర్ణసుధాపయోధిలో నరుగుచుఁ గాకి రెట్ట యిడినందున నేమి కొఱంత భాస్కరా! |
104 |
| చ. |
స్ఫురతర కీర్తిమంతులగు పుత్త్రుల గాంచినఁగాక మూఢము ష్కరులఁ గనంగఁ దేజములు గల్గవుగా; మణికీలితాంగుళా భరణము లంగుళంబుల శుభస్థితిఁ బెట్టినఁగాక గాజు టుం గరములు పెట్టినందున వికాసము గల్గునటయ్య? భాస్కరా! |
105 |
| ఉ. |
సేనగ వాంఛితాన్నము భుజింపఁగలప్పుడు కాక లేనిచో మేనులు డస్సియుంట నిజమేకద దేహుల కగ్నిహోత్రుఁడౌ నే నిజభోజ్యముల్ గుడుచు నేనియుఁ బుష్టి వహించు లేనిఁనా డూని విభూతిలోనడఁగి యుండఁడె తేజము తప్పి భాస్కరా! |
106 |
| ఉ. |
హాళి నిజప్రబుద్ధి తిరమైన విధంబునఁ బెట్టుబుద్ధులా వేళలకంతె కాని మఱి వెన్కకు నిల్వవు; హేమకాంతి యె న్నాళులకుండుఁ గాని యొకనాడు పదంపడి సానఁ బట్టినన్ దాళియు నుండునే యినుప తాటకఁ జాయలు పోక భాస్కరా! |
107 |
| ఉ. |
హీనకులంబునందు జనియించినవారికి సద్గుణంబు లె న్నేనియుఁ గల్గియున్న నొక నేరము చెందకపోదు; పద్మముల్ భూనుతిఁ గాంచియు\న్ బురదఁ బుట్టుట వల్ల సుధాకరోదయం బైన నసహ్య మొందవె ప్రియంబునఁ జూడఁగ లేక భాస్కరా! |
108 |
| ఉ. |
ఇంచుక నేర్పు చాలక విహీనతఁ జెందిన నా కవిత్వము\న్ మించు వహించె నీకతన మిక్కిలి యెట్లనఁ దోలుబొమ్మలు\న్ మంచివివేకి వాని తెరమాటున నుండి ప్రశస్తరీతి నా డించిన నాడవే జనుల డెందము నింపవె ప్రీతి భాస్కరా! |
109 |