| శతకములు | భాస్కర శతకము |
|
| ఉ. |
శ్రీగల భాగ్యశాలి కడఁజేరఁగ వత్తురు తారు దారె దూ రాగమన ప్రయాసమున కాదట నోర్చియునైన నిల్వ ను ద్యోగము చేసి; రత్ననిలయుండని కాదె సమస్తవాహినుల్ సాగరుఁ జేరుటెల్ల ముని సన్నుత! మద్గురుమూర్తి! భాస్కరా! |
1 |
| ఉ. |
అంగన నమ్మరాదు తన యంకెకు రాని మహాబలాఢ్యు వే భంగుల మాయలొడ్డి చెఱుపం దలపెట్టు! వివేకియైన సా రంగధరుం బదంబులు కరంబులు గోయఁగ జేసెఁ దొల్లి చి త్రాంగి యనేకముల్ నుడువరాని కుయుక్తులు పన్ని భాస్కరా! |
2 |
| ఉ. |
అక్కరపాటు వచ్చు సమయంబునఁ జుట్టము లొక్కరొక్కరి న్మక్కువ నుద్ధరించుటలు మైత్రికిఁ జూడఁగ యుక్తమే సుమీ యొక్కట; నీటిలో మెరక నోడల బండ్లును బండ్లనోడలున్ దక్కక వచ్చుచుండుట నిదానము గాదె తలంప భాస్కరా! |
3 |
| చ. |
అడిగినయట్టి యాచకుల యాశలెఱుంగక లోభవర్తియై కడపిన ధర్మదేవత యొకానొక యప్పుడు నీదు వాని కె య్యెడల; నదెట్లు పాలు తమకిచ్చునె యెచ్చటనైన లేగలన్ గుడువఁగ నీనిచోఁ గెరలి గోవులు తన్నునుగాక భాస్కరా! |
4 |
| చ. |
అతిగుణహీన లోభికిఁ బదార్థము గల్గిన లేకయుండినన్ మితముగఁ గాని కల్మిగల మీఁదట నైన భుజింపఁడింపుగా సతమని నమ్ము దేహమును సంపద; నేఱులు నిండి పాఱినన్ గతుకఁగ జూచుఁ గుక్క తన కట్టడ మీఱక యెందు భాస్కరా! |
5 |
| చ. |
అదను దలంచి కూర్చి ప్రజ నాదరమొప్ప విభుండు కోరినన్ గదిసి పదార్థమిత్తురటు కానగ వేగమె కొట్టి తెండనన్ మొదటికి మోసమౌఁ; బొదుగు మూలముగోసినఁ బాలు గల్గునే పిదికినఁ గాక భూమిఁ బశుబృందము నెవ్వరికైన భాస్కరా! |
6 |
| చ. |
అనఘుని కైనఁ జేకుఱు ననర్హునిఁ గూడి చరించునంతలో మన మెరియంగ నప్పుడవమానము కీడు ధరిత్రియందు నే యనువుననైనఁ దప్పవు యదార్థము; తానది యెట్టులన్నచో నినుమును గూర్చి యగ్ని నలయింపదె సమ్మెటపెట్టు భాస్కరా! |
7 |
| చ. |
అలఘుగుణ ప్రసిద్ధుఁడగు నట్టి ఘనుండొకఁ డిష్టుఁడై తనున్ వలచి యొకించు కేమిడినవానికి మిక్కిలి మేలుచేయుఁగా; తెలిసి కుచేలుఁ డొక్క కొణిదెం డడుకుల్ దనకిచ్చినన్ మహా ఫలదుఁడు కృష్ణుఁడత్యధిక భాగ్యములాతని కీఁడె? భాస్కరా! |
8 |
| చ. |
అవనివిభుండు నేరుపరియై చరియించినఁ గొల్చువార లె ట్లవగుణు లైననేమి? పనులన్నియుఁ జేకుఱు వారిచేతనే; ప్రవిమలనీతిశాలి యగు రాముని కార్యము మర్కటంబులే తవిలి యొనర్పవే జలధి దాఁటి సురారులఁ ద్రుంచి భాస్కరా! |
9 |
| ఉ. |
ఆదరమింత లేక నరుఁడాత్మబలోన్నతి మంచివారికి\న్ భేదము చేయుటం దనదు పేర్మికిఁ గీడగు మూలమె; ట్లమ ర్యాద హిరణ్యపూర్వకశిపన్ దనుజుండు గుణాఢ్యుడైన ప్ర హ్లాదున కెగ్గుచేసి ప్రళయంబును బొందఁడె మున్ను భాస్కరా! |
10 |