| శతకములు | భాస్కర శతకము |
|
| చ. |
మదిఁ దను నాసపడ్డయెడ మంచిగుణోన్నతుఁడెట్టి హీనునిన్ వదలఁడు మేలుపట్టున నవశ్యము మున్నుగ నాదరించుఁగా; త్రిదశ విమానమధ్యమునఁ దెచ్చి కృపామతి సారమేయమున్ మొదల నిడండె ధర్మజుఁడు మూఁగి సురావళి చూడ భాస్కరా! |
81 |
| ఉ. |
మాటల కోర్వజాలఁ డభిమానసమగ్రుఁడు ప్రాణహానియౌ చోటులనైనఁ దానెదురు చూచుచునుండుఁ; గొలంకు లోపల న్నీట మునింగినప్పు డతి నీచము లాడిన రాజరాజు పో రాట మొనర్చి నేలఁబడఁడాయెనె భీముని చేత భాస్కరా! |
82 |
| ఉ. |
మానవనాథుఁ డాత్మరిపు మర్మ మెఱింగినవాని నేలినం గాని జయింపలేఁ డరులఁ; గార్ముకదక్షుఁడు రామభద్రుఁ డా దానవనాయకున్ గెలువఁ దా నెటులోపుఁ దదీయ నాభికా పానసుధ న్విభీషణుఁడు తార్కొని చెప్పకయున్న భాస్కరా! |
83 |
| ఉ. |
మానవుఁ డాత్మకిష్టమగు మంచిప్రయోజన మాచరించుచోఁ గానక యల్పుఁడొక్కఁ డది గాదని పల్కిన వాని పల్కుకై మానగఁజూడఁడా పని సమంచిత భోజనవేళ నీఁగ కా లూనిన వంటకంబు దినకుండఁగ నేర్పగునోటు భాస్కరా! |
84 |
| ఉ. |
మానిని చెప్పు నెట్లెఱుకమాలిన వాఁడటు చేసినన్ మహా హాని ఘటించు నే ఘనునికైన నసంశయ ముర్విపైఁ గృపా హీనతఁ బల్కినన్; దశరథేశ్వరుఁ డంగన మాటకై గుణాం భోనిధి రాముఁ బాసి చనిపోవఁడె శోకముతోడ భాస్కరా! |
85 |
| చ. |
మునుపొనరించు పాతక మమోఘము జీవులకెల్లఁ బూని యా వెనుకటి జన్మమం దనుభవింపక తీఱదు; రాఘవుండు వా లిని బడనేసి తా మగుడ లీల యదూద్భవుఁడై కిరాతుచే వినిశిత బాణపాతమున వీడ్కొనఁడే తన మేను భాస్కరా! |
86 |
| ఉ. |
రాకొమరుల్ రసజ్ఞునిఁ దిరంబుగ మన్నన నుంచినట్లు భూ లోకమునందు మూఢుఁ దమ లోపలనుంపరు; నిక్కమే కదా! చేకొని ముద్దుగాఁ జదువు చిల్కను బెంతురుగాక పెంతురే కాకము నెవ్వరైన శుభకారణ సన్మునిసేవ్య భాస్కరా! |
87 |
| ఉ. |
లోకములోన దుర్జనుల లోఁతు నెఱుంగక చేరరాదు సు శ్లోకుఁడు చేరినం గవయఁజూతురు చేయుదు రెక్కసక్కెముల్ కోకిలఁ గన్నచోట గుమికూడి యసహ్యపుఁ గూతలార్చుచుం గాకులు తన్నవే తఱిమి కాయము తల్లడమంద భాస్కరా! |
88 |
| ఉ. |
లోను దృఢంబుగాని పెనులోభిని నమ్మి యసాధ్యకార్యముల్ కానక పూనునే నతఁడు గ్రక్కునఁ గూలును; నోటిపుట్టిపై మానవుఁ డెక్కిపోవ నొకమాటు బుటుక్కున ముంపకుండునే తానొకలోఁతునం గెడసి దానిఁ దరింపఁగ లేక భాస్కరా! |
89 |
| ఉ. |
వంచన యింతలేక యెటువంటి మహాత్ముల నాశ్రయించినం గొంచెమె కాని మేలు సమకూడ దదృష్టము లేనివారికిన్; సంచితబుద్ధి బ్రహ్మ ననిశంబును వీఁపున మోచునట్టి రా యంచకుఁ దమ్మితూండ్లు దిననాయెఁగదా ఫలమేమి భాస్కరా! |
90 |