| శతకములు | భాస్కర శతకము |
|
| ఉ. |
పండితులైనవారు దిగువం దగనుండగ, నల్పుఁ డొక్కడు ద్ధండతఁ బీఠమెక్కిన బుధ ప్రకరంబులకేమి యెగ్గగున్; కొండొకకోతిఁ జెట్టు కొనకొమ్మల నుండగ, గ్రింద గండ భే రుండ మదేభ సింహనికురంబములుండవె చేరి భాస్కరా! |
61 |
| ఉ. |
పట్టుగ నిక్కుచున్ మదముఁ బట్టి మహాత్ములఁ దూలనాడినం బట్టిన కార్యముల్ చెడును బ్రాణమువోవు నిరర్థదోషముల్ పుట్టు, మహేశుఁ గాదని కుబుద్ధి నొనర్చిన యజ్ఞ తంత్రముల్ ముట్టక పోయి దక్షునికి మోసము వచ్చెఁగదయ్య భాస్కరా! |
62 |
| చ. |
పరహితమైన కార్య మతిభారము తోడిదియైనఁ బూను స త్పురుషుఁడు లోకముల్పొగడఁ బూర్వమునందొక ఱాలవర్షమున్ గురియఁగ జొచ్చినన్ గదిసి గొబ్బున గోజనరక్షణార్థమై గిరినొక కేల నెత్తెనట కృష్ణుఁడు ఛత్రము భాతి భాస్కరా! |
63 |
| చ. |
పలుచని హీనమానవుఁడు పాటిఁదలంపక నిష్ఠురోక్తులం బలుకుచు నుండుఁగాని, మతి భాసురుఁడైన గుణప్రపూర్ణుఁడ ప్పలుకులఁ బల్కఁబోవఁడు నిబద్ధిగ నెట్లన; వెల్తికుండఁ దా దొలకుచునుండుఁ గాని మఱితొల్కునె నిండుఘటంబు భాస్కరా! |
64 |
| చ. |
పలుమఱు సజ్జనుండు ప్రియభాషలె పల్కుఁ గఠోరవాక్యముల్ బలుకఁడొకానొకప్పుడు నవి పల్కినన్ఁ గీడును గాదు నిక్కమే; చలువకు వచ్చి మేఘుఁడొక జాడను దా వడగండ్ల రాల్చినన్ శిలలగు నోటు వేగిరమె శీతలనీరము గాక భాస్కరా! |
65 |
| ఉ. |
పాపపుఁ ద్రోవవాని కొకపట్టున మేను వికాసమొందినన్ లోపల దుర్గుణంబె ప్రబలుం గద! నమ్మగఁ గూడ దాతనిన్; బాపటకాయకున్ నునుపు పైపయి గల్గినఁ గల్గుగాక యే రూపున దానిలోఁగల విరుద్ధపుఁ జేదు నశించు భాస్కరా! |
66 |
| ఉ. |
పూనిన భాగ్యరేఖ చెడిపోయిన పిమ్మట నెట్టిమానవుం డైనను వాని నెవ్వరుఁ బ్రియంబునఁ బల్కరు పిల్వరెచ్చటం దానది యెట్లొకో యనినఁ దథ్యము పుష్పమువాడి వాసనా హీనత నొంది యున్న యెడ నెవ్వరు ముట్టుదురయ్య భాస్కరా! |
67 |
| ఉ. |
పూరిత సద్గుణంబు గల పుణ్యున కించుక రూప సంపదల్ దూరములైన వాని యెడ దొడ్డగఁ జూతురు బుద్ధిమంతు లె ట్లారయ; గొగ్గులైన మఱి యందుల మాధురి చూచి కాదె ఖ ర్జూర ఫలంబులం ప్రియము చొప్పడ లోకులు గొంట భాస్కరా! |
68 |
| ఉ. |
ప్రల్లదనంబుచే నెఱుక పాటొక యింతయులేక యెచ్చటన్ బల్లిదుఁడైన సత్ప్రభు నబద్ధములాడినఁ గ్రుంగిపోదు; రె ట్లల్ల సభాస్థలిం గుమతులై శిశుపాలుఁడు దంతవక్త్రుఁడుం గల్లలు గృష్ణునుం బలికి కాదె హతంబగుటెల్ల భాస్కరా! |
69 |
| ఉ. |
ప్రేమను గూర్చి యల్పునకుఁ బెద్దతనంబును దొడ్డవానికిం దా మతితుచ్ఛపుంబని నెదం బరికింపగ యీయరాదుగా వామకరంబుతోడఁ గడువం గుడిచేత నపానమార్గముం దోమఁగ వచ్చునే మిగులఁ దోఁచని చేఁతగు గాక భాస్కరా! |
70 |