| శతకములు | భాస్కర శతకము |
|
| ఉ. |
ఎడ్డె మనుష్యుఁడే మెఱుఁగు నిన్నె దినంబులు గూడి యుండినన్ దొడ్డ గుణాఢ్యునందుఁ గల తోరపు వర్తనలెల్ల బ్రజ్ఞఁ బే ర్వడ్డ వివేకి రీతి; రుచిపాకము నాలుకగా కెఱుంగునే? తెడ్డది కూరలోఁ గలయఁ ద్రిమ్మరుచుండిననైన భాస్కరా! |
21 |
| ఉ. |
ఎప్పుడదృష్టతా మహిమ యించుక పాటిలు నప్పుడింపు సొం పొప్పుచు నుండుఁగాక యది యొప్పని రూపుమాయుఁగా నిప్పున నంటియున్న యతి నిర్మలినాగ్ని గురుప్రకాశముల్ దప్పిన నట్టి బొగ్గునకు దా నలుపెంతయుఁ బుట్టు భాస్కరా! |
22 |
| ఉ. |
ఏగతిఁ బాటుపడ్డఁ గలదే భువి నల్పునకు\న్ సమగ్రతా భోగము భాగ్యరేఖగల పుణ్యునకుంబలె; భూరి సత్త్వసం యోగ మదేభ కుంభయుగళోత్థిత మాంసము నక్కకూనకే లాగు ఘటించు! సింహము దలంచినఁ జేకురు గాక భాస్కరా! |
23 |
| ఉ. |
ఏడ ననర్హుఁడుండు నటకేఁగు ననర్హుఁడు నర్హుఁడున్నచోఁ జూడగఁ నొల్లడెట్లన; నశుద్ధగుణస్థితి నీఁగ పూయముం గూడిన పుంటిపై నిలువఁ గోరిన యట్టులు నిల్వ నేర్చునే సూడిదఁ బెట్టు నెన్నుదుటి చొక్కపుఁ గస్తురి మీఁద భాస్కరా! |
24 |
| ఉ. |
ఏల సమస్త విద్యల నొకించుక భాగ్యము గల్గియుండినన్ జాలు, ననేక మార్గముల సన్నుతికెక్క నదెట్లొకో యనన్ రాలకు నేడ విద్యలు తిరంబుగ దేవరరూపు చేసినన్ వ్రాలి నమస్కరించి ప్రసవంబులు పెట్టరె మీఁద భాస్కరా! |
25 |
| ఉ. |
ఒక్కఁడె చాలు నిశ్చల బలోన్నతుఁ డెంతటి కార్యమైనఁ దాఁ జక్క నొనర్పఁ; గౌరవులసంఖ్యులు పట్టిన ధేనుకోటలం జిక్కఁగనీక తత్ప్రబల సేన ననేక శిలీముఖంబులన్ మొక్కపడంగఁ జేసి తుదముట్టఁడె యొక్కకిరీటి భాస్కరా! |
26 |
| ఉ. |
కట్టడ దప్పి తాము చెడు కార్యముఁ జేయుచు నుండిరేని దోఁ బుట్టిన వారినైన విడిపోవుట కార్యము; దౌర్మదాంధ్యముం దొట్టిన రావణాసురునితో నెడఁబాసి విభీషణాఖ్యుఁ డా పట్టున రాముఁ జేరి చిరపట్టము గట్టుకొనండె భాస్కరా! |
27 |
| ఉ. |
కట్టడ యైనయట్టి నిజకర్మము చుట్టుచు వచ్చి యే గతం బెట్టునొ పెట్టినయట్లనుభవింపక తీఱదు; కాళ్ళు మీఁదుగాఁ గట్టుక వ్రేలుడంచుఁ దలక్రిందుగఁ గట్టిరె యెవ్వరైన నా చెట్టున గబ్బిలంబులకుఁ జేసిన కర్మముగాక భాస్కరా! |
28 |
| ఉ. |
కట్టడ లేని కాలమున గాదు శుభం బొరులెంతవారు చే పట్టిననైన మర్త్యునకు భాగ్యము రాదనుటెల్లఁ గల్లకా దెట్టని పల్కినన్; దశరథేశ వసిష్ఠులు రామమూర్తికిన్ బట్టము కట్టఁ గోరి రది పాయక చేకుఱెనోటు భాస్కరా! |
29 |
| ఉ. |
కానగ చేరఁ బోలఁ డతికర్ముఁడు నమ్మిక లెన్ని చేసినం దానది నమ్మి వానికడ డాయఁగ బోయిన హాని వచ్చు న చ్చో నది యెట్లనం; గొఱఁకు చూపుచు నొడ్డిన బోను మేలుగా బోనని కానకాసపడి పోవుచుఁ గూలదెఁ గొక్కు భాస్కరా! |
30 |