| శతకములు | భాస్కర శతకము |
|
| చ. |
ఫలమతి సూక్ష్మమైనను నృపాలుడు మంచిగుణాఢ్యుడైనచో నెలమి వివేకులాతని కపేక్షయొనర్తు; రదెట్లు చంద్రికా విలసనమైనఁ దా మనుభవింపఁ జకోరము లాసఁ జేరవే చలువ గలట్టివాఁడగుటఁ జందురు నెంతయుఁ గోరి భాస్కరా! |
71 |
| ఉ. |
బంధుర సద్గుణాఖ్యుఁ డొక పట్టున లంపట నొందియైన దు స్సంధిఁ దలంపఁ డన్యులకుఁ జాల హితం బొనరించుఁ గాక, శ్రీ గంధపుఁ జెక్క రాగిలిచుఁ గాదె శరీరుల కుత్సవార్థమై గంధములాత్మఁ బుట్టఁ దఱుఁగంబడి యుండుటలెల్ల భాస్కరా! |
72 |
| చ. |
బలము దొలంగు కాలమునఁ బ్రాభవసంపదలెంత ధన్యుఁడున్ నిలుపుకొనంగనోపఁ; డది నిశ్చయ మర్జునుఁడీశ్వరాదులం గెలిచినవాఁడు బోయలకు గీడ్పడి చూచుచుఁ గృష్ణభార్యలు బలువుర నీయఁడే నిలువఁ బట్ట సమర్థుఁడు గాక భాస్కరా! |
73 |
| చ. |
బలయుతుఁ డైన వేళ నిజ బంధుఁడు తోడ్పడుఁ గాని యాతఁడే బలము తొలంగెనేని తన పాలిటి శత్రు; వదెట్లు పూర్ణుఁడై జ్వలనుఁడు కానఁ గాల్చు తఱి సఖ్యముఁ జూపును వాయుదేవుఁడా బలియుఁడు సూక్ష్మదీపమగు పట్టున నార్పదె గాలి భాస్కరా! |
74 |
| ఉ. |
బల్లిదుఁడైన సత్ప్రభువు పాయక యుండినఁగాని రచ్చలోఁ జిల్లరవారు నూఱుగురు సేరినఁ దేజము గల్గదెయ్యెడన్ జల్లని చందురుండెడసి సన్నపుఁ జుక్కలు కోటియున్న జిల్లునె వెన్నెలల్ జగము జీఁకటులన్నియుఁ బాయ భాస్కరా! |
75 |
| చ. |
భుజబల శౌర్యవంతులగు పుత్త్రుల గాంచిన వారి కెయ్యెడన్ నిజహృదయేప్సితార్థములు నిక్కము చేకుఱుఁ గుంతిదేవికిన్ విజయబలాఢ్యుఁ డర్జునుఁడు వీరపరాక్రమ మొప్ప దేవతా గజమును దెచ్చి తల్లి వ్రతకార్యము దీర్పఁడె తొల్లి భాస్కరా! |
76 |
| ఉ. |
భూనుతులైన దేవతలు పూర్వము కొందఱు వావివర్తనల్ మాని చరింపరో యనుచు మానవులట్ల చరింపఁబోల; దం భోనిధులన్నియుం దనదు పుక్కిటఁ బట్టె నగస్త్యుఁడంచు నా పూనిక కెవ్వఁడోపు నది పూర్వమహత్త్వము సుమ్ము భాస్కరా! |
77 |
| ఉ. |
భూపతి కాత్మబుద్ధి మది బుట్టనిచోఁట బ్రధానులెంత ప్ర జ్ఞాపరిపూర్ణులైనఁ గొనసాగదు కార్యము; కార్యదక్షులై యోపిన ద్రోణ భీష్మ కృప యోధులనేకులు గూడి కౌరవ క్ష్మాపతికార్యమేమయినఁ జాలిరె చేయఁగ నాడు భాస్కరా! |
78 |
| ఉ. |
భూరి బాలాఢ్యుఁడైనఁ దలపోయక విక్రమశక్తిచే నహం కారము నొందుటల్ తగవు గాదతఁడొక్కెడ మోసపోవుఁ గా వీరవరేణ్యుఁ డర్జునుఁడు వింటికి నే నధికుండ నంచుఁ దా నూరక వింటినెక్కిడఁగ నోపడు కృష్ణుఁడు లేమి భాస్కరా! |
79 |
| ఉ. |
భ్రష్టున కర్థవంతులగు బాంధవులెందఱు గల్గినన్ నిజా దృష్టము లేదు గావున దరిద్రతఁ బాపఁగలేరు; సత్కృపా దృష్టిని నిల్పి లోకుల కతిస్థిరసంపద లిచ్చు లక్ష్మి యా జ్యేష్ట కదేటికిం గలుగఁజేయదు తోడనె పుట్టి భాస్కరా! |
80 |