| శతకములు | భాస్కర శతకము |
|
| ఉ. |
ఆరయ నెంత నేరుపరియై చరియించిన వాని దాపునన్న్ గౌరవమొప్పఁగూర్చు నుపకారి మనుష్యుఁడు లేక మేలు చే కూరదదెట్లు; హత్తుగడ గూడునె; చూడఁ బదాఱువన్నె బం గారములోన నైన వెలిగారము కూడక యున్న భాస్కరా! |
11 |
| ఉ. |
ఈ క్షితినర్థకాంక్ష మదినెప్పుడు పాయక లోకులెల్ల సం రక్షకుఁడైన సత్ప్రభుని రాకలు గోరుదు రెందుఁ; జంద్రికా పేక్షఁ జెలంగి చంద్రుఁడుదయించు విధంబునకై చకోరపుం బక్షులు చూడవే యెదు రపార ముదంబును బూని భాస్కరా! |
12 |
| ఉ. |
ఈ జగమందు దా మనుజుఁడెంత మహాత్మకుఁడైన దైవమా తేజము తప్పఁ జూచు నెడఁ ద్రిమ్మరి కోల్పడు; నెట్లన న్మహా రాజకుమారుఁడైన రఘురాముఁడు గాల్నడఁ గాయలాకులున్ భోజనమై తగన్వనికిఁ బోయి చరింపఁడె మున్ను భాస్కరా! |
13 |
| చ. |
ఉరుకరుణాయుతుండు సమయోచిత మాత్మ దలంచి యుగ్రవా క్పరుషత జూపినన్ ఫలము గల్గుట తథ్యముగాదె; యంబుదం బురిమినయంతనే కురియకుండునె వర్షము లోకరక్షణ స్థిరతరపౌరుషంబున నశేషజనంబు లెఱుంగ భాస్కరా! |
14 |
| చ. |
ఉరుగుణవంతుఁడొడ్లు తనకొం డపకారము చేయునప్పుడుం బరహితమే యొనర్చు నొకపట్టున నైనను గీడుఁ జేయగా నెఱు గఁడు; నిక్కమేకద యదెట్లన? గవ్వముఁ బట్టి యంతయుం దరువఁగఁ జొచ్చినం బెరుగుతాలిమి నీయదె వెన్న? భాస్కరా! |
15 |
| చ. |
ఉరుబలశాలి నంచుఁ దను నొల్లని యన్య [పతివ్రతాంగనా సురతము గోరెనేని కడసుమ్మది భూతికిఁ బ్రాణహాని యౌ; శిరములు గూల రాఘవునిచే దశకంఠుఁడు ద్రుంగిపోవఁడే యెఱుఁగక సీత కాసపడి యిష్టుల భృత్యులఁ గూడి భాస్కరా! |
16 |
| ఉ. |
ఊరక వచ్చుఁ బాటు పడకుండిననైన ఫలం బదృష్ట మే పారఁగఁ గల్గువానికిఁ బ్రయాసము నొందిన దేవదానవుల్ వారలటుండఁగా నడుమ వచ్చిన శౌరికిఁ గల్గెఁ గాదె సృం గారపుఁ బ్రోవు లక్ష్మియును గౌస్తుభరత్నము రెండు భాస్కరా! |
17 |
| ఉ. |
ఊరక సజ్జనుండొదిఁగి యుండిననైన దురాత్మకుండు ని ష్కారణమోర్వలేక యపకారము చేయుట వాని విద్యగా; చీరలు నూరుటంకములు చేసెడివైనను బెట్టె నుండఁగాఁ జేరి చినింగిపోఁ గొఱుకు చిమ్మట కేమి ఫలంబు? భాస్కరా! |
18 |
| ఉ. |
ఎట్టుగఁ బాటుపడ్డ నొక యించుక ప్రాప్తము లేక వస్తువుల్ పట్టుపడంగ నేరవు; నిబద్ధి సురావళిఁ గూడి రాక్షసుల్ గట్టు పెకల్చి పాల్కడలిఁ గవ్వముచేసి మథించి రంతయున్ వెట్టియె గాక యేమనుభవించిరి వారమృతంబు భాస్కరా! |
19 |
| చ. |
ఎడపక దుర్జనుండొరుల కెంతయుఁ గీడొనరించుఁ గాని యే యెడలను మేలు సేయఁడొక యించుకయైనను; జీడపుర్వు దాఁ జెడఁ దిను నెంతెకాక పుడుసెండు జలంబిడి పెంప నేర్చునే పొడవగుచున్న పుష్పఫల భూరుహ మొక్కటినైన భాస్కరా! |
20 |