| శతకములు | దేవకీనందన శతకము |
|
| మ. |
విలసత్కావ్యకళాధురీణతలు తద్విజ్ఞానులైనట్టి వే త్తలకుం గాకవి యేల మూర్ఖులకు గాధల్ జెందు భాగీరథీ దళితాంభోరుహ షండమండిత మరందగ్రాస మాధుర్యవాం ఛలు జోరీఁగల కేల తేంట్లగతి కృష్ణా దేవకీనందనా. |
31 |
| మ. |
చతురంభోధిపరీత భూవలయరాజానేకకోటీర రం జితమాణిక్యవిరాజమానపద రాజీవుండు ధర్మాత్మజుం డతికారుణ్యముచేత మత్స్యపతికొ ల్వాసింపఁడే నీదు శా శ్వత కారుణ్యము గల్గునంతకును కృష్ణా దేవకీనందనా. |
32 |
| మ. |
శుకమద్గౌతమ కణ్వ కుత్స జమదగ్న్యోదంక శాండిల్య శౌ నక పారాశర కశ్యపాత్రి ఘటజాహ్నేంద్ర ప్రభూత త్రియం బక కంజోద్భవ నారదాదిమునిహృత్పంకేజ సౌమ్యత్పిపా సకృపాసాగర నీకు మ్రొక్కెదను కృష్ణా దేవకీనందనా. |
33 |
| మ. |
వివిధోగ్రస్థవన ప్రచండబలవిద్వేషావనీనాయకో త్సవభంజీకృతశాలి యర్జునుఁడు దోస్సత్వుండు మత్స్యావనీ ధవుగేహంబున నాట్యతాళధరియై తా నిల్వఁడే సన్ముని స్తవ నీసత్కృప గల్గునంతకును కృష్ణా దేవకీనందనా. |
34 |
| మ. |
బలభేది న్నలయించి ఖాండవవని\న్ భస్మంబు గావించి ము న్నెలమి\న్ దైత్యులఁద్రుంచి యొక్కటి శివున్నిర్జించి కౌరవ్యుల\న్ బలి గావించి కిరీటి బోయలకు గోపస్త్రీల నొప్పింపఁడే యల నీతేజము నీవు గైకొనినఁ గృష్ణా దేవకీనందనా. |
35 |
| మ. |
ఇలఁ దద్వైరి నృపాల ఫాలఫలక ప్రత్యగ్ర రక్తచ్ఛటా కలితోదార గదావిజృంభణ భుజాగర్వుండు భీముండు కు క్కలకుం జాపఁడె యేకచక్రపురి భిక్షావేళ యుష్మత్సము జ్జ్వలకారుణ్యము గల్గునంతకును కృష్ణా దేవకీనందనా. |
36 |
| మ. |
అతిసౌందర్యసమగ్రధైర్యఘనశౌర్యస్ఫూర్తియు\న్ గీర్తియు న్నతులప్రాభవరేఖయు\న్ గలిగి చోద్యంబెన్నఁగా ఘోటక ప్రతతిం దిద్దఁడె నిత్యము\న్ నకులుఁ డేపారంగ నీసత్కృప\న్ సతమై రాజ్యము గల్గునంతకును కృష్ణా దేవకీనందనా. |
37 |
| మ. |
బక దైతేయమహాబలు\న్ సమరభూభాగంబున\న్ వాయుపు త్రకుఁ డీల్గించిన నేకచక్రపురివారల్ మెచ్చి యింటింట వం టకము ల్బెట్టిరిగాని భిక్షయనుమాట\న్ మాన్పలేరైరి యం తకు వారల్ గొఱఁతేమి చాలుటకుఁ గృష్ణా దేవకీనందనా. |
38 |
| మ. |
గహనావాసములోన నన్నలకుఁ దా గారాబుతమ్ముండునై విహరించేతఱి భావికాలగతి నన్వేషించుచు\న్ శౌర్యసం గ్రహుఁడై యావులఁగాచె మత్స్యపురిలోఁ గర్మానుగుణ్యక్రియ స్సహదేవుం డతిధైర్యమార్గమునఁ గృష్ణా దేవకీనందనా. |
39 |
| మ. |
వినుతానేకతురంగవారణ రథోర్వీనాథదీవ్యన్నికే తన చక్రధ్వజచామరద్రఢిమతోఁ దథ్యాత్ముఁడౌ నాసుయో ధనుఁ డేకాకియుఁ బాదచారియునునై దర్పంబువోనాడి పో యెను మిమ్మెట్టుఁ దలంచి చూడకయ కృష్ణా దేవకీనందనా. |
40 |