| శతకములు | దేవకీనందన శతకము |
|
| మ. |
అమరు ల్పద్మజువ్రాతఁదాఁటి యిపుడొక్కబ్దంబు పెద్దయ్య దు ర్దమ దోర్దండపటుప్రతాప నిజసంరంభామరానీక వి క్రమ దుర్వారగజాసురప్రళయ మింకం జేయ ఫాలాక్షుని\న్ సమరక్షోణి జయించె నర్జునుఁడు కృష్ణా దేవకీనందనా. |
51 |
| శా. |
అక్రూరాత్మకు లైన పాండవుల బాహశక్తియు\న్ ధాత్రి ని ర్వక్రంబయ్యెడునట్లు జేతు ననుచు\న్ వాత్సల్య మింపొంద నా శక్రాత్మోద్భవు తేరిపై దురమున\న్ సారథ్యముం జేసితౌ చక్రీ నీమునికోలకు\న్ జయము కృష్ణా దేవకీనందనా. |
52 |
| శా. |
గంభీరంబుగ రాయభారగరిమ\న్ గౌంతేయుకార్యార్థమై శుంభల్లీలల ధార్తరాష్ట్రుసభఁ దామూహించి తద్వాక్యము ల్సంభాషింపఁగ వా రవజ్ఞ దలఁప\న్ సర్వంబు నీవైనచో శంభుండేయెఱుఁగు\న్ భవన్మహిమ కృష్ణా దేవకీనందనా. |
53 |
| శా. |
ఏలావిద్యలు సొంపు రూపవిభవం బేలా కులీనత్వము\న్ శీలత్వంబును నేల యేటికి వచశ్శ్రీ యేల బాహాబలం బేలా చాతురి మీకృపాగరిమ నిక్షేపంబు లేకుండిన\న్ జాలిం బొందినఁ గల్గునే సిరులు కృష్ణా దేవకీనందనా. |
54 |
| శా. |
సర్వజ్ఞుండును సర్వలోకగురుఁడు\న్ సర్వంసహానాథుఁడు\న్ సర్వేశుండును సర్వసాధకుఁడునౌ సర్వేశ నీమూర్తి దా సర్వంబు న్గలిగించు పెంచునణఁచు\న్ సందేహమేలా స్మృతుల్ 'సర్వం విష్ణుమయం జగ'త్తనఁగ కృష్ణా దేవకీనందనా. |
55 |
| మ. |
పుడమి\న్ బెద్దలబోటివారి నడుగం బోరాదె చోద్యంబు పా ల్కడలి\న్ గల్గినముద్దరాలు గలుగంగా పూర్వకాలంబున\న్ పొడవెల్ల\న్ గడుతగ్గి దానవునితో బొంకైనమాటాడి మూఁ డడుగు ల్నేలను వేఁడఁగాఁ జనవు కృష్ణా దేవకీనందనా. |
56 |
| శా. |
రంగప్రౌఢిమ భార్గవుం గెలిచి కౌరవ్యుల్ భయం బంది వీ రాగంబుం ధరియించి జీవము సతంబై యుండ వర్తించునా గాంగేయుండు శిఖండిచేతఁ దెగె నీ కారుణ్యముం దప్పియుం డంగా మృత్యువుధాటి కోపుదురె కృష్ణా దేవకీనందనా. |
57 |
| శా. |
అక్రూరస్థితి నుండఁగా వలయు రాజాస్థానమధ్యంబున\న్ వక్రింపం బనిలేదు ధర్మమునకై వర్తింపఁగాఁ బోయిన\న్ శుక్రాచార్యుని కన్నుఁ బో నడఁచవే సూటి\న్ గుశాగ్రంబున\న్ జక్రీ నీకరపంకజాంతరముఁ గృష్ణా దేవకీనందనా. |
58 |
| మ. |
వరసౌందర్యవివేకధైర్యనయనావాత్సల్యధౌరేయుఁ డీ ధరణీనాయకరత్న మంచు మహితార్థంబాశ్రితశ్రేణికి\న్ స్థిరసామ్రాజ్యవిభుత్వ మాధ్రువునికి\న్ దేజంబుగానిచ్చి తా సరణి\న్ మీకృప గల్గువాఁ డగుట కృష్ణా దేవకీనందనా. |
59 |
| శా. |
ధారాపూర్వముగాఁగ సంయమికి సప్తద్వీపముల్ సూనృత ప్రారంభమున నిచ్చి చేతితడియాఱ\న్ లేక వర్తింపఁడే శారీరార్థ మటంచు భిక్షము హరిశ్చంద్రుండు యాగాదిసం చారుం డుండు మనండె తొల్లి హరి కృష్ణా దేవకీనందనా. |
60 |