| శతకములు | దేవకీనందన శతకము |
|
| శా. |
శ్రీకైవల్యరమాధినాథ నిను నర్థిం గీర్తనల్జేసి కా దా కంజాతభవేంద్ర నారద శుకవ్యాసాంబరీషార్జునుల్ నీకారుణ్యముఁ గాంచుటల్ ననుమతి\న్ నేనెంతధన్యుండనో నాకుఁ జేకురె నట్టిభాగ్యములు కృష్ణా దేవకీనందనా. |
1 |
| శా. |
శ్రీవైకుంఠనివాసగోత్రధర లక్ష్మీనాథ గోపాల లీ లావిర్భావ పతంగవాహ యదువంశాంభోధిచంద్రోదయా నీవే దిక్కని యున్నవాఁడను దయన్ వీక్షించి రక్షించవే నావిజ్ఞాపన మాలకించు మది కృష్ణా దేవకీనందనా. |
2 |
| శా. |
శ్రీరామావసుధాకళత్రములపైఁ జెన్నొందు పాదాబ్జముల్ గారామారఁగఁ జూచి శేషఫణి దాఁ గౌతూహలంబొప్పఁగా క్షీరాంభోనిధిఁ బవ్వళించి యమరుల్ సేవింపఁగా నొప్పుని న్నారాధింతు మదీయచిత్తమునఁ గృష్ణా దేవకీనందనా. |
3 |
| శా. |
నీడల్ దేఱెడు చెక్కుటద్దములతో నిద్దంపుఁగెమ్మోవితో కూడీకూడని చిన్నికూకటులతో గోపార్భకశ్రేణితో వ్రీడాశూన్య కటీరమండలముతో వేడ్క\న్ వినోదించుచు న్నాఁ డా శైశవమూర్తి నేఁ దలఁతుఁ గృష్ణా దేవకీనందనా. |
4 |
| శా. |
అందెల్ చిన్నిపసిండిగజ్జియలు మ్రోయ\న్ మేఖలాఘంటికల్ క్రందై మ్రోయఁగ రావిరేకనుదుట\న్ గంపింప గోపార్భకుల్ వందారుల్ గన వెన్నముద్దలకు నై వర్తించు మీబాల్యపుం జందం బాదివిజుల్ నుతించుటలు కృష్ణా దేవకీనందనా. |
5 |
| శా. |
వేదోద్ధారకుఁగా సుధాప్రభువుఁగా విశ్వంభరావాహుఁగా వాదావిర్భవుఁగా త్రయీవటువుఁగా వర్ధిష్ణుతాయుష్యుఁగా కోదండాశుగపాణిఁగా బలునిఁగా ఘోరవ్రతచ్ఛేదిఁగా నాదిబ్రహ్మముఁగాఁ దలంతు మదిఁ గృష్ణా దేవకీనందనా. |
6 |
| మ. |
అమరుల్మ్రొక్కులచే మునుల్ నుతులచే నార్యుల్మహానిష్ఠచే సమరోత్సాహజనుల్ పునశ్చరణచే సాధుల్ దయాబోధచే నమితోదారకళాఢ్యు లర్పణలచే నధ్యాత్ము లైక్యంబుచే సమతం గాంచిరి మీపదాబ్జములు కృష్ణా దేవకీనందనా. |
7 |
| మ. |
జపముల్ సేయఁగ నేర నీమమున నిచ్చ ల్పూజ సేయంగలే నుపవాస వ్రతభక్తి చొప్పెఱుఁగ వేదోక్తక్రమస్థుండఁగా నపరాధంబులు నాయెడం దఱచు నే నజ్ఞాని నెబ్భంగుల\న్ జపలుం డంచు నుపేక్ష సేయకుము కృష్ణా దేవకీనందనా. |
8 |
| మ. |
సుకరంబై సురసేవ్యమై సులభమై సువ్యక్తమై యుక్తమై ప్రకటంబై పరమార్థమై ప్రమదమై ప్రద్యోతమై పథ్యమై యకలంకామృతమై యమోఘతరమై యానందమై యందమై సకలంబు\న్ భరియించు మీమహిమ కృష్ణా దేవకీనందనా. |
9 |
| శా. |
కొండల్వంటి కవీశ్వరుల్ శతకము ల్గూర్పంగఁ గోటానకో ట్లుండ\న్ నీవును జెప్పఁబూనితి వదేమో యంటివా వింటివా వండేనేర్పులఁ బెక్కురీతుల రుచుల్ వర్తింపవే శాకముల్ దండి\న్ నామన వాలకింపు మదిఁ గృష్ణా దేవకీనందనా. |
10 |