శతకములు వేంకటేశ శతకము
1 11 21 31 41 51 61 71 81 91
అసలు విడిచిన నలమటలే లేవు, నిర్ధనికుండైన నిర్భయంబు
పరహింస మానినఁ బాపంబు చెందదు భోగ మొల్లకయున్న బుద్ధి చెడదు
వెసఁ బరాధీనత విడిచిన ముడిరాదు, ధరఁ గోరకున్న బంధంబు లేదు
మగువల రోసిన మరుబాధ లడరవు, మమత మానిన విచారములు లేవు
 
గాన సకలంబుఁ దలపోసి ఘనతమెఱసి, చెలఁగుపురుషుండె మిగుల నిశ్చింతుఁడరయ
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
11
వలవనివైర మెవ్వరితోడఁ గొఱగాదు, మెలఁగి ధూర్తులయిండ్లు మెట్టఁజనదు
బుధుల నుదాసీనబుద్ధిఁ జూడఁగరాదు, పాపంబు సొమ్మని పట్టఁ దగదు
బంధువిరోధంబు పాటింపఁ జెల్లద, యేలిక కెదురాడ నెపుడు వలదు
ఆత్మ నమ్మిన వారి నపహరించుట కీడె, యని మొన నోడిన నదియ కొఱఁత
 
పదరఁ బనిలేదు నీతిసంపన్నునకును, బలిమినొయ్యన నానాఁట బ్రబలవలయు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
12
పలుమాఱు శపథము ల్పలికెడు నాతండు, పూటలు వడునట్టి పోటువాడు
కూటసాక్షులకును గురియైనయాతండు, నట నింటివారితో నలుగువాడు
విభుని రహస్యము ల్వెలిపుచ్చునాతండు, పరులచే లంచము ల్పట్టువాఁడు
కుడుచునింటికిఁ జేటు కోరెడునాతండు, మహినుపకారంబు మఱచువాఁడు
 
పడునధోగతి నిహమును బరములేక, కొఱకునకుఁబోయు బడిగంటఁగూలుకరణి
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
13
కోపంబు నడఁచిన గురుతరాధ్వరఫల, మింద్రియజయము మహేంద్రపదవి
చలము వారించుట సామ్రాజ్యవిభవంబు, చాంచల్య ముడుగుట సకలసిద్ధి
వెస నహంకారంబు విడుచుట భాగ్యంబు, దైన్యవర్జనమె యుత్తమగుణంబు
నిందఁబాసినయున్కి నిరుపమలాభంబు, ఋణవిముక్తుండౌట హృదయసౌఖ్య
 
మింతకంటెను మేలు లే దెంచి చూడ, మహిత నీతిజ్ఞులైనట్టి మానవులకు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
14
ఆచారవంతుఁ డౌనతఁడె విప్రోత్తముఁ, డఖిలంబు రక్షించునతఁడు రాజు
వరుసతోఁ గార్యనిర్వాహకుఁడే మంత్రి, రుచిరవర్తనుఁడె పురోహితుండు
కడుఁ దిట్ట దీవింపగలవాఁడె సత్కవి, యమృతహస్తుఁడు వైద్యుఁ డఖిలదిశలఁ
బోటజ్జయెఱిఁగిన పురుషుండు దళవాయి గణితజ్ఞుఁ డగువాఁడు కరణ మరయ
 
బురుషరత్నంబులని యండ్రు బుధులు వీరి, నితరు లెల్లను సామాన్యు లెంచిచూడ
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
15
తినఁదిన జిహ్వకుఁ దీపైన మొగచాటు, సారెకుఁ బలుకుట చప్పదనము
కాంతలు పిక్కినఁ గడు వేసటైతోఁచు, నెంతసంపదగల్గె నంతచింత
కడువేఁడఁ జొచ్చినఁ గడఁగు లాఘవమెల్లఁ, బాసలు దప్పినఁ బాటి చెడును
ఇంటింటి కేఁగిన నెడయుఁ బెద్దఱికంబు, తనవాసి విడిచినఁ దఱుఁగు వన్నె
 
మట్టుమీఱక లోకసమ్మతముగాఁగ, గుట్టుతోడుత మెలఁగినఁ గోటిసేయుఁ
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
16
పరకాంతకై సింహబలుఁడట్లు మృతుఁడయ్యె, రాజ్యలోభమునఁ గౌరవుఁ డులిసె
బరుషోక్తులను శిశుపాలుఁడు హతుఁడయ్యె, మహినిజూదమున ధర్మజుఁడు నొగిలె
నల పాండురాజు వేఁటాడి శాపమునొందె, మును రావణుఁడు చలముననె సమసెఁ
గ్రూరదండంబునఁ గూలెను వేనుండు, చదిసెఁ బానమున రాక్షసగురుండు
 
ఘనవివేకులు వీరలగతులు దెలసి, వ్యసనములు మాని నడువంగవలయు నిలను
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
17
తన పురాకృతముచేఁ దగులపోరాదు, బ్రహ్మవ్రాఁతకు మాఱు పలుకరాదు
పంచాస్త్రునస్త్రము ల్పట్టి చూడఁగరాదు, ప్రకృతిస్వభావ మాఁపంగరాదు
దైవికం బెల్లను దప్పింపగారాదు, కాల మెవ్వరికినిఁ గడపరాదు
పోయినప్రాణంబు పొదపెట్టి తేరాదు, గతజలంబుల నడ్డకట్టరాదు
 
ఏమిచేయఁగవచ్చు సర్వేశ్వరాజ్ఞ, వరుస నెంతటివారికి వగవవలదు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
18
కామాతురత్వంబు కడుసిగ్గుపడనీదు, భూతంబు సోఁకిన బుద్ధిలేదు
ఆకఁట నలఁగిన నచట నెక్కడిలావు, రోగంబు బలసిన రుచులు దలఁగుఁ
గడఁగి శోకపువేళఁ గలుగదు హర్షంబు, యాజ్ఞ కెంతయును సౌఖ్యంబు దూర
మాఁడుబిడ్డలఁగన్న యపుడె పంతంబు వీడు, నుత్సాహ మెడలిన నుడుగుబలిమి
 
యెందులకునౌను సంసారి యేమిసేయుఁ, గలిగినది తొంటి తన కర్మ ఫలముగాక
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
19
ఇల దొమ్మరిది జాతిహీనత యెంచదు, పూటకూళ్లది పుణ్యమునకుఁ జొరదు
జారకామిని తన చావు చింతింపదు, నొరిసి లంజియ మొగమాటపడదు
విరహిణి మదిలోన వెఱపు వాటింపదు, చెలఁగి దూతిక కడు సిగ్గుపడదు
పరగృహవాసిని పరనింద కోడదు, వడి సంతబసివి యెవ్వరిది గాదు
 
ధర్మవిదుఁ డిట్టివారల దగులకెపుడు, వెలయ సన్మార్గవర్తియై మెలగవలయు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
20
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vEMkaTEsha shatakamu ( telugu andhra )