శతకములు వేంకటేశ శతకము
1 11 21 31 41 51 61 71 81 91
అధముని మొఱయైన నాలకించుట యొప్పు వినకున్న నానాజ్ఞ విఫలమగును
మెట్టి చూచుట యొప్పు మితిలేని రాజ్యంబుఁ బోకున్న నలజడిఁ బొందుచుండుఁ
దనసొమ్ము పలుమాఱుఁదలఁచి కన్గొనుఁటొప్పుఁ, గాకున్నఁ దెలియదు కలిమిలేమి
కలయు టొప్పును గులకాంతల వరుసతో, మానినఁ బాపంబు తోన కలుగు
 
మత్తుఁడై యున్నఁ గార్యంబు మట్టుపడదు, వలసియొల్లమి సేయఁగ వలదు పతికి
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
61
పతిసేయు కార్యంబు భటులచేఁ గూడదు, భటుల కృత్యంబు భూపతికిఁ దగదు
మగనిస్వతంత్రంబు మగువకుఁ జెల్లదు, మెలఁత విధంబు పెన్మిటికి వలదు
మంత్రియెన్నండు సామాన్యుఁడుండఁగ రాదు, సామాన్యుగతి నుండజనదు మంత్రి
కరణంబుతోఁ బగ కాఁపువానికిఁ గాదు, కాఁపుతోఁ బగ గాదు కరణమునకు
 
నధికకృత్యంబు లధమునకమరవెందు, నధమకృత్యంబు లధికున కమరవెందు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
62
పదుగు రాడినమాట పాటియై ధరఁ జెల్లు, నొక్క డాడినమాట యెక్కదెందు
నుఱక యుండినవాని కూరెల్ల నోపదు, నిజముముందఱఁ గల్ల నిలువ దెపుడు
చేసినచేఁత దాఁచినను బుట్టకపోదు, దేవతలకు నైనఁ దీఱ దాస
రాజు చేసినది ధర్మంబై ప్రవర్తిల్లుఁ, గపటాత్ముతోఁ బొందు కడకుఁ గీడు
 
పుడమిలోకులు మెచ్చంగ నడవవలయుఁ, జలముసాధింపఁ జెల్లదు సభలలోన
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
63
పరువంబు మీఱిన బహుపుష్పజాతులు, పదను దీసినయట్టి పరిమళంబు
నలువదియేండ్లపై నరసినవనితలు, పొంతఁ జల్లాఱిన భోజనంబు
మిగులఁ బెక్కుదుకూలమీఁదిటి వస్త్రంబు, వెలయఁ దొంబదియేండ్ల వృద్ధగజము
ప్రాఁతపంచారమై పరఁగెడుగుఱ్ఱంబు, వెసఁ గార మెడలిన వీడెములును
 
ఘనునకవియెల్ల భోగయోగ్యములు గావు, ... ... ... ...
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
64
నిర్మలు నొకధూర్తు నిందించుఁ గాకేమి, త్రోవలఁ గూయదే తొఱ్ఱఁ బులుఁగు
అధముండు సత్కవియండ నుండినయేమి, దొరలదే విరులలోఁ దుంగపోఁచ
కడఁగి యల్పుఁడు ఘనుఁ గారించుఁ గాకేమి, కఱవదే యొక దోమ గంధగజము
దొరతోడ నీచుండు దొడరఁ జూచిన నేమి, ప్రాకదే బలుమేడ బల్లిపిల్ల
 
యీడుగాకున్న పనులవి యేలయెంచ, నందునకు నేమి తారతమ్యములు లేవె
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
65
దుష్టు సూర్యునిదెస దుమ్మెత్తి చల్లినఁ, దనపైనె పడుఁగాక దాని కేమి
కొండతోఁ దగరు డీకొని యెంతతాఁకినఁ, దలవ్రక్కలగుఁ గాక దాని కేమి
మిడుతలు చిచ్చుపై వడి నెంతయెగసినఁ, దామె పొక్కెడుఁగాక దాని కేమి
వలఁ బడ్డ మీ నెంతవడిదాఁక బొరలినఁ, దనుఁ జుట్టుకొనుఁగాక దాని కేమి
 
యెదిరిసత్త్వంబు తనసత్త్వమెఱుఁగలేక, పోరువాఁడెందు నవివేక బుద్ధియండ్రు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
66
చెలఁగి యొక్కనిఁ జెఱచినవానిబ్రతుకును, గ్రూరుఁడై బలిమిఁ జేకొన్న పెండ్లి
కల్లలు పచరించి గడియించిన ధనంబు, దూఱులఁ బడునట్టి దొరతనంబుఁ
గపటవృత్తికిఁ జొచ్చి కైకొన్న రాజ్యంబు, దయలేక యుండెడు తపసితపము
నాసతోఁ గైకొన్న యట్టి సన్న్యాసంబుఁ, గపటాత్ము దేవాధికారవృత్తి
 
మనుపనెంతైన నేరదు మరలి మరలి, తొలఁగనీయక దుర్గతిఁద్రోచుఁగాని
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
67
ఎలమిఁ బతివ్రత నెవ్వండుగోరినఁ, జెదలంటునే నిప్పుసీమలోన
ఘనజితేంద్రియుని నేకాంత డగ్గఱినను, గలుఁగునే జలరాశి కప్పచేత
ధర్మవర్తనుని బాతకు లేమఱించిన, నేఱునిద్రించునే యెందునైన
ధీరాత్ము నితరుండు తెమలింపఁ గడఁగిన, గాలి యొక్కనిచేతఁ గట్టువడునె
 
యెందునను ధార్మికులకుఁ గీడేల కలుగు, నిజగుణంబులు బలిమిమై నిలుచుఁగాక
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
68
పుచ్చకాయలు దిన్నఁ బోయెడిమంత్రంబు, లిచ్చునే ఫలము లెందేరి కైనఁ
గడప దాఁటఁగ లేనిబడుగైన గుఱ్ఱంబు, లెక్కునే పౌఁజుపై నెందునైన
నాఁకలి యుడుపనియట్టి యాహారంబు బలియించునే మేను పటువుగాను
దగ విరజానది దాఁటనిదేవర, లొసఁగుదురే మోక్ష మూరకైన
 
ధరణి నన్నిటి సామర్థ్య మరసిచూచి, బలువుగలవెల్లఁ జేపట్టి వెలయవలయు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
69
జీలువు పెరిఁగిన మాలెకంబము గాదు, గొడ్డుఁ బెంచినఁ బాఁడిగోవు గాదు
ధరఁ బంచితం బెంత ద్రచ్చిన నేయిగా, దెండమావులును నీళ్ళెపుడు గావు
పరఁగ నుల్కలు నూఱు బండిమోకిలఁ గాదు, కూరయెంతైనను గూడుగాదు
ఎనుపోతు ఘనమైన నెద్దుతో సరిగాదు, కడు నశుద్ధపు వాఁగు గంగ గాదు
తొండంబు గలిగిన దోమ యేనుఁగు గాదు, కోడి కోయిల గాదు కూత లిడినఁ
 
బ్రబలి చూపట్టినవి యెల్లఁ బనికి రావు, ధీరుఁడగు నాతఁ డొక్కఁడే వీరుఁడరయ
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
70
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vEMkaTEsha shatakamu ( telugu andhra )