శతకములు వేంకటేశ శతకము
1 11 21 31 41 51 61 71 81 91
తనకుఁగా మును చెడ్డజనులను రక్షించి, యిల మేలు గోరినహితులఁ బ్రోచి
వడిఁ దోడు నవసినవారిని మన్నించి, బడిదిరిగినవారిఁ బ్రభులఁ జేసి
మిగుల దూఱులు వడ్డ మిత్రులఁ బోషించి, సరి నర్థమిచ్చిన సఖుల మనిపి
యచటనుండి సహాయు లగువారి బ్రదికించి, ప్రాఁతవారలకు సంపద లొసంగి
 
యెల్లవారలు జయవెట్ట నేలుచుండి, వినుతి కెక్కిన యధిపుఁడు ఘనుఁడు దలఁప
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
31
పతికి మాఱాడక పలుమాఱు నేడ్వక, యలుగక మిగుల గయ్యాళిగాక
తనుఁ దిట్టికొనక కాతాళించి గొణఁగక, మ్రుచ్చిలింపక పాపమునకుఁ జొరక
పొరుగింటి కేఁగక పరు నాత్మఁ దలపక, కుపిత గాక పరానుకూల గాక
యదువదాఁచక మర్మ మవ్వలఁ జెప్పక, బొంకక నిద్దురపోతు గాక
 
కాఁపురముసేయు కామినిగలిగెనేని, పలుకులేటికిఁ బురుషుని భాగ్యమహిమ
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
32
ప్రాణంబుతో లంకెపాటిది తనసతి, ధనఋణంబుల లంకె తనయుఁ డరయ
సుఖదుఃఖముల లంకె సొరిదిఁ దల్లియుఁ దండ్రి, వారికి లంకెలు భ్రాతలెందు
భువి మానరక్షణంబునకు లంకె మఱంది, మెలఁత నొసఁగ లంకె మేనమామ
మేలు మీఁదటి లంకె మిత్రవర్గం బెల్ల, హర్షంబునకు లంకె యల్లుఁ డెపుడు
 
వారివారికిఁ దగినట్టి వరుస దెలిసి, యరయ వలయును యజమానుఁడైనవాఁడు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
33
ఇహము సాధించుట యిల గీర్తివడయుట, సర్వంబు దెలియుట చదువుకొనుట
యనుభవించుట భోగమఖిలపూజ్యుండౌట, నిధులుమెట్టుట కార్యనిపుణుఁడౌట
యర్థమార్జించుట యధికుతో సఖుఁడౌట, నుతికెక్కబ్రదుకుట చతురుఁడౌట
పుత్త్రులఁ గాంచుట పుణ్యంబుసేయుట, మురహరుఁ గొలుచుట ముక్తిఁగనుట
 
యిట్లుమెఱయనిగరజన్మమేమిబ్రాఁతి, సజ్జనులు నేర్తు రీమంచి సరవిఁ దిరుగఁ
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
34
శక్తికిఁ దగనిదుర్జనము సేయఁగరాదు, చదువక తర్కింపఁ జనదు సభల
నేనుఁగుతో వల దేలాట మాడంగ, నెనయనిబాంధవం బెపుడు వలవ
దాయంబులేనివ్యయము చేయనొల్లదు, సోపద్రవపుభూమి నుండఁ జనదు
గడుసరి లోభిని నడుగుట కష్టంబు, దైవంబుమీఁద గ్రోధంబు చెల్ల
 
దెంత మాత్రంబు తన శక్తి యంతమాత్ర, మరసి యొనరించు నాతండె యర్హుడెందు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
35
ఇల నేటిదరిమ్రాని కెప్పుడు చలనంబు, నరనాథుపొరుగిల్లు నమ్మరాదు
పాముతో నటుపొందు పాటింపఁ గారాదు, దుర్జనసంగతి దూఱుముట్టు
కడఁగిదయ్యముతోడి కాఁపురంబది కీడుఁ, మహిదొంగతోఁ గొల్వుమరణ మొదవుఁ
బరికింప నోడపైబ్రతుకు సందేహంబు, ఘనునితో సరసంబు గాదు జరప
 
నరసి కానివి వర్జించి యైనపనుల, నరుఁడు వర్ధిల్లవలయు నున్నతివహించి
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
36
ఏలికతోడిపా టేమియైనను మేలు, తనయంతనున్న వచ్చినదిమేలు
సజ్జనగోష్ఠి నెచ్చట నిల్చినను మేలు, పరఁగ నందఱతోడి బ్రతుకుమేలు
నిజమాడ నెవ్వరు నిందించినను మేలు, వినయంబు గలుగు జీవనము మేలు
ధరమీఁద నిహపరార్థము చరించినమేలు, చిరపుణ్య మెంత చేసినను మేలు
 
దుష్టబుద్ధులు మెలఁగెడి త్రోవ వలదు, నియతవర్తన మెలఁగెడి నేర్పరులకు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
37
మావటీనికిని మై మఱవరా దెప్పుడు, నలయంగఁ గూడదు యాచకునకు
వేగులవానికి వేసట చెల్లదు, జోగికిఁ గాణాచి చోటువలదు
వెలిజాతివానికి వీరు వా రనలేదు, వెట్టివానికిఁ గూలి వేఁడఁ దగదు
జాజరకానికి సంకోచపడరాదు, మొగమోట దూతకుఁ దగవుగాదు
 
తగిన తమతమవర్తనఁ దగినపాటి, నేర్చినట్లన బ్రతుకుట నీతి యెపుడు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
38
తనభక్తి నిజమైన దైవంబు మెచ్చును, మన సొక్కటైనను మలయు సుఖము
మాట మంచిదియైన మగువలు వలతురు, సాహసియైన నుత్సాహ మొనరు
బుద్ధి శాశ్వతమైన భువి యెల్లి నేలును, బ్రతుక నేర్చినను శుభంబు లొదవు
సరి నీవి గలిగిన జగమెల్లి వశమౌను, నుద్యోగపరుడైన నొదవు ధనము
 
చతురుఁ డగువాని కెప్పుడు జగము లోనఁ, జంజరింపక మెలఁగిన సకలజయము
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
39
నడుమంత్రమా యిది యీకర్మంబు, నేఁటిదా జగము వర్ణించి చూడ
నెంచఁగ వశములా యేండ్లెవ్వరికైన, నుడిగెనా జన్మంబు లొల్ల మనిన
సాలీనిపోగులా సంసారపాశంబు, లల్పమా బ్రహ్మాండ మరసి తెలియ
నీటిపై వ్రాఁతలా నీరజాసను వ్రాత, లెఱిఁగెనా తత్త్వంబు లింతలోన
 
నెంతవారికిఁ దెలియంగ నెట్లువచ్చు, నీప్రభావంబు లన్నియు నీక కాక
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
40
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vEMkaTEsha shatakamu ( telugu andhra )