శతకములు వేంకటేశ శతకము
1 11 21 31 41 51 61 71 81 91
గోడపై సున్నంబు గోఁకినఁ బనికిరా వా, దొడలిపై వాసన యూర్చ రాదు
చేతఁ బట్టినయట్టిజిడ్డు లెక్కకు రాదు, కోకఁ బెట్టినగంజి కూర్పరాదు
విసనకఱ్ఱలవన్నె విడిచిన నిల్వదు, బచ్చెనగచ్చు చొప్పడదు తివియ
ముగ్గు వెట్టినపిండి మొనని యట్లకు రాదు, మీసలపైఁ దేనె మ్రింగ రాదు
 
చూడఁ జూపట్టుసిరులెల్ల జూబులగుచుఁ, గొలఁదివెట్టినఁ దొంటిబాగులకురావు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
71
కనకంబు పెంపొక్కగతి గానె భావించి, కామంబు క్రోధంబు గట్టపెట్టి
తిట్టినతిట్టులు దీవనల్గా విని, యలశత్రు మిత్రుఁ గా నాత్మఁ దలఁచి
యట భూమి హేమపర్యంకంబుగాఁ బండి, భిక్షాన్నతృప్తిమైఁ బెంపు మిగిలి
కాషాయ వస్త్రంబు కౌశేయముగఁ గట్టి, నిరతబ్రహ్మధ్యాననిరతుఁ డగుచు
 
నేకతంబున మౌనియై యిలఁ జరించు, నతఁడు సన్న్యాసియని యెంచనర్హుఁ డగును
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
72
బలుమాలవాడలో బాఁపనిల్లుండునే, నిర్దయులో నేల నిలుచుఁ గరుణ
కప్పకా టెందును గల దని వింటిమే, పిఱికివానికి నేల బిరుదు గలుగు
బొగ్గునం దైలంబు పుట్టంగ నేర్చునే, యిలమీఁద మోడు సిగ్గేల తలఁచుఁ
గెరలింప రాతికి గిలిగింత గలుగునే, కఠినచిత్తుం డేల కరఁగ నేర్చుఁ
 
గలరు మఱి యిట్టివారలు కష్టజనులు, స్రవిఁ దప్పింపవచ్చునే జన్మఫలము
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
73
గాడిద యెఱుఁగదు గందంబువాసన, లే దూరఁబందికి లీల రోఁత
వాడకోడికి నాదివారంబు వలవదు, గ్రోఁతికి మఱి తాళిగోణమేల
చిఱుతని కేటికి శీలవంతులయున్కి, యెద్దడుకులచవి యెఱుఁగలేదు
వరుసతోఁ గుక్క దేవరబోన మెఱుఁగదు, మొసలికిఁ బడిసెంబు మొదల లేదు
 
సహజమూఢులు నిటువంటిజాడవారె, వానిగుణములు దిద్దంగ వలవ దెపుడు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
74
పోలించి దయ్యంబు పుణ్యంబు లెంచునే, భయపడ్డవారలఁ బట్టుగాఁక
పాఱునే జేతచేఁ బడి దంచనపుగుండు, తనసూటిఁ దప్పక తాఁకుఁగాక
చి చ్చెంతఁ బోయిన సింగార మెంచునే, తనగాలివైపున దాఁటుఁగాక
తొలుకరివానలు దొరతనం బెంచునే, తగిలి బయట నున్నఁ దడుపుఁ గాక
 
నీవు నెఱపిన మహిమలే నిఖిలమెల్ల, నట్లు గావలె నప్పటి కట్లయుండు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
75
మచ్చరించినవాఁడు మంచి మాటాడిన, వెంగె మైతోఁచును వెగటుపోవ
దపనమ్మి కైనవాఁ డటు దుడ్డు వట్టిన, మందుఁడందురుగాని మనసు గొల్ప
దొడఁబాటు గానవాఁ డూరక మ్రొక్కిన, సందేహపడుఁ గాని సహజమెంచఁ
డనుమాన మైనవాఁ డర్థంబు లిచ్చిన, వళుకుఁగా నెంచు విశ్వాసపడఁడు
 
ఏమి చేసినఁ గపటికి హితవుగాదు, మాఱు మలసినఁ బనులెల్ల మట్టుబడును
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
76
అపవాది యగువాని నటుచంప వలవదు, తా నాడుకల్లలే తన్నుఁ జెఱచుఁ
సర్వకంటకు నెందు సాధింప వలవదు, వసుధవారలగోడు వానిఁ జెఱుచు
నతిమూర్ఖుఁ డగువాని నదలింప వలవదు, తనలోనికోపమే తన్నుఁ జెఱుచుఁ
గడునహంకారిని గా దనవలవదు, మేనిపైగర్వంబె మిగులఁ జెఱుచుఁ
 
జెప్పవలవదు బుద్ధు లీచెనఁటులకును, సత్యవిదులకు ధర్మమే జయముగాన
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
77
కామినీరతుల లోకమువారు నమ్మరు, పతితుల విడుతురు బంధుజనులు
గుణవిహీనుని వివేకులు మెచ్చ రింతైన, వేడబో రర్థులు విగతయశుల
హింసాపరులతోడ నెనయరు సాధువు ల్పురుషాధములపొంత బోరు బుధులు
విద్యారహితులను విద్వాంసు లొరయరు నృపులు చేపట్టరు చపలమతుల
 
నుర్విమీదట నుత్తము లొక్కరాశి, యథము లొకరాశియౌ గాదెయరసిచూడ
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
78
కోరి దవ్వుల జూడ గొండలు నున్నన, చేరి డగ్గఱినను జెట్లు రాళ్ళు
బూరుగు ఫలవేళఁ బుట్టించు నాసల, నెక్కి కోసినఁ బండ్లనెగయుదూది
మిడుగుఱుఁ బురుగులు మెఱుఁగులైయుండును, గరఁచిచూచినను బంగారుగాదు
కప్పచిప్పలు వెండికరణిఁ గాంతులు మించుఁ, బుటము వెట్టించిన బూది చిక్కు
 
నెదుటివారలసంపద లెన్నియైన, నడుగఁ బోయిన ఫలియింప వధములకును
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
79
అపవిత్రమగునట్టి యన్నంబు గొనుకంటె, నడవిలోఁ దినుబలుసాకు లెస్స
హితశత్రువై యలయించు చుట్టముకంటెఁ, గైవసం బగుశునకంబు లెస్స
బహుదుర్గతులఁ ద్రోచు పరధనముకంటెఁ, న్యాయార్జితము తారమైన లెస్స
యపకీర్తిభాజనంబగు భోగములకంటెఁ, జిత్తంబులో నాత్మచింత లెస్స
 
సజ్జనులుమెత్తు రిటువంటిసరవు లెల్లఁ, దక్కినవియెల్ల రుచులగుఁ దామసులకు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
80
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vEMkaTEsha shatakamu ( telugu andhra )