శతకములు వేంకటేశ శతకము
1 11 21 31 41 51 61 71 81 91
నయకోవిదులు తప్ప నడచిరేనియు వారి, వరుసగా దది కర్మవశముగాని
ధనికులు భోగింపఁ దలఁపఁ జాలమి వారి, బాగుఁ గా దది జన్మఫలముగాని
పుణ్యులు పాపంబుపొంతఁ బోయిన వారి, గతులు గా వవి దైవికములుగాని
సుజనులు లోకనిష్ఠురు లైన నది వారి, జాడ గా దుత్పాతసరణిగాని
 
యెఱిఁగి నడువంగ వారలయిచ్చగాదు, ధర్మదేవత మెలఁగుచందంబు గాని
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
51
చెలులసంగడి నున్నఁ జిత్తంబు చలియించుఁ, గనకంబుఁ బొడఁగన్నఁ గడఁగునాస
సురియ చేపట్టిన శూరత్వములు రేఁగు, నీచవర్తనుపొందు నిందకొలుపు
నేలికతో మేల మెప్పుడు విషమించుఁ, బడుచుతో నవ్విన భంగపఱుచు
సభలోనఁ జొచ్చిన సడియెల్లఁ బైకొను, విటులఁ గూడినను వివేక మెడయు
 
నెఱిఁగి యన్నియు వర్జించి యేకతమున, నిన్నుఁ దలపోయునాతండు నిపుణుఁ డండ్రు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
52
కొన్నిభూముల నెండ కొన్నిభూములఁ జలి, యొక్కనిమేలు వేఱొకనికీడు
వెలయుఁజుక్కలు రేయి వేగుఁబ్రొద్దునమాయుఁ, గొంతకాలముకల్మి కొంతలేమి
కప్పుమేఘము మింటఁ గడపట బయలౌను, జవ్వనంబగు మేను జదిసి ముదియుఁ
గాయలై యున్నవే కడపటఁ బం డ్లౌను, గడుహీను లధికులై కానిపింతు
 
రెంచిచూచిన వెనుకముందెటులునుండుఁ, గలగ వలవదు సహజంబు కాలగతులు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
53
భుజియించి నప్పుడే పోవు నాహారము, ల్పూసినగందంబు పొళ్ళురాలుఁ
గట్టినప్పుడెమాయు ఘనవస్త్రచయములు, ముడిచినప్పుడె వాడు ముడిఁగివిరులు
కలసినప్పుడె విడుఁ గాంతలతోఁ దమి, తొడిగినఁ వ్రేగులై తోఁచు సొమ్ము
లెక్కినఁ గడఁ నలయించు వాహనములు, వసము గానిధనంబు వడ్డి తొడుగు
 
కలుగనేర్చునె నిత్యసౌఖ్యంబులిందు, నిన్నుఁ గొలిచిన సుఖములు నిలుచుగాక
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
54
తనకాప్తులగువారి దండ నుంపఁగఁ గదు, నధికశూరులదండు లంపదగును
మఱి ధనాఢ్యులకును మణివంబు లీఁదగు, హితుల వాకిలి గావ నిడఁగఁదగును
ఘనకార్యపరుల దుర్గములఁ బెట్టఁగఁ దగు, నిపుణుల నుడిగల నిలుపఁదగును
సముచితజ్ఞుల వ్రాయసము వ్రాయుఁడనఁ దగు, మాయావులఁదలార్లఁ జేయఁదగును
 
మఱచి యల్పులఁ దానమ్మి మనుప వలదు, గరిమధరలెల్ల నేలెడు ఘనున కెపుడు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
55
ఏనుగులా వెంత యిల మావటీఁ డెంత, తిమిరంబుబల మెంత దీప మెంత
ఘనసముద్రం బెంత కర్ణధారకుఁ డెంత, బహుకాననం బెంత పరశు వెంత
పాఱెడునీ రెంత పర్వతంబది యెంత, హరుఁ డెంత మృదులపుష్పాస్త్ర మెంత
భీకరఫణి యెంత వాకట్టువే రెంత, బహురాజ్య మెంత భూపాలుఁ డెంత
 
యెవ్వరికి దొడ్డుకొంచెంబు లెంచరాదు, నడుచు నిటువంటి వెల్ల నీనాటకములు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
56
సరసులు పంతము ల్సభలోన నాడరు, వీఁగరు రణమున వీరవరులు
కలఁగ రేపట్టున ఘనవివేకులు మదిఁ, దప్పరు నీతి యుత్తములు పనులఁ
దలఁపరు పాపము ల్ధన్యులు గలనైన, నలయ రాచారంబునందు బుధులు
నిందింప రొరులను నిపుణులు వాక్రుచ్చి, తలఁపరు పరులకాంతల సుజనులు
 
వదల రెప్పుడుఁ దమయిలువరుస గుణము, వసుధ వీరలు నీప్రభావంబుకతన
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
57
పేలెన్ని పుట్టినఁఁ బెద్దగా బ్రదుకవు, చీమలు పొడమి నశించిపోవుఁ
జెదలు పుట్టలు వెట్టి శీఘ్రమె యడఁగును, మిడుతలు వైళమె మించి మడియు
నీఁగలు వడి మూఁగు నీడేఱ వెంతైన, నల్లులు జనియించి నలిసిపోవు
దోమ లుద్భవ మంది తోడనే పొలియును, గణుఁదుర్లు తుట్టలుగట్టి సమయుఁ
 
బరఁగ నీరీతి దుర్జను ల్ప్రబలు లైనఁ, బరులఁ బీడించి చెడుదురు పాపములను
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
58
మలసి యేఁటేఁటఁ బల్మఱును గూనలఁ బెట్టుఁ, గంటిమా ధరఁబిల్లికదుపు నొకటిఁ
బాము గ్రుడ్లనుబెట్టుఁ బదియు నిర్వదియును, బ్రదికెనా భూమిపైఁ బౌఁజులగుచు
బులులు పిల్లల నీనుఁ బొసఁగనాల్గును నైదు, నున్నవా మందలై యుర్వియందు
మకరంబు లెన్నైన మడుగులోఁ బుట్టు, నెగడెనా గుంపులై నేలమీఁదఁ
 
గ్రూరసంతతి వెలయునే కొంచెపడక, విరివిగా ధర్మసంతతి వెలసినట్లు
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
59
పెంచంగఁ బెరిఁగెనా పృథివిపైఁ గొండలు, విత్తిరా యడవుల వివిధగతులఁ
గాలువ ల్వెట్టిరా ఘనసముద్రములకు, నేతంబు లెత్తిరా యేఱులకును
మేఁతలు వెట్టిరా మృగముల కెందైన మఱి యీఁత నేర్పిరా మత్స్యములకుఁ
బెండ్లిండ్లు సేసిరా బెరయంగఁ బక్షులఁ బూసిరా వాసనఁ బుష్పములకుఁ
 
నెవ్వరెవ్వరిఁ బోషించి రెంచి చూడఁ, దలప నీదైన రక్షకత్వమునఁ గాక
కలితలక్ష్మీశ సర్వజగన్నివేశ, విమలరవికోటిసంకాశ వేంకటేశ.
60
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vEMkaTEsha shatakamu ( telugu andhra )