శతకములు వృషాధిప శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
ఉ. భక్తుని మ్రింగఁ జంప మును భర్గునకున్‌ జిఱుతొండనంబికి\న్‌
యుక్తమెయంచు వారిపయి నొక్కట నుద్ధత ఘంట వ్రేసి యు
ద్రిక్తత నొప్పఁగా నలరు దిట్ట హలాయుధు కట్టనుంగ! ప్ర
వ్యక్తమ! నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా!
101
చ. ధర నురులింగమూర్తి ధ్వజదండముగా మలమచ్చతోక శ్రీ
కరముగ భక్తికిం బడగఁగా శివుగర్భముఁ జొచ్చి పొల్చు మా
యరి యమరాజుగారి పరమాప్తుఁడవైన మహానుభావ! నీ
వరవుఁడనేఁ జుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
102
ఉ. దండితవాదియై శివుఁడ దైవముగా కని కన్నులిచ్చి తా
నిండు మనంబుతో నిలువు నిద్దపుఁగన్నులు దాల్చి పొల్చు మా
పండిత మల్లికార్జునుఁడు ప్రస్తుతి సేయఁగ నేర్చు నిన్ను నె
వ్వండు నుతింప నేర్చు బసవా! బసవా! బసవా! వృషాధిపా!
103
చ. వసుమతిఁ బేరుకొన్న నరువత్తురు మువ్వురి కూర్మిబంట! షో
డసుల సుతుండ! తేరసుల దక్కిన భృత్యుఁడ! వీరలాది గా
నెసగు మహానుభావులకు నెల్ల ననర్గళమైన భక్తినన్‌
వసిగొని ప్రోవుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
104
చ. బసవ నిధానమా! బసవ భవ్యనిధీ! బసవామృతాంబుధీ!
బసవ మహానిధీ! బసవ భర్మగిరీ! బసవామరద్రుమా!
బసవ మహాబలీ! బసవ బండరువా! బసవోల్లసన్మణీ!
వసిగని ప్రోవుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
105
ఉ. నా యొడయండ! నా విభుఁడ! నా హృదయేశ్వర! నా మనోరమా!
నా యిలవేల్ప! నా వరుఁడ! నా గురులింగమ! నాదు జంగమా!
నా యదినాథ! నా వరద! నన్నుఁ గృపామతిఁ బ్రోవుమయ్య దే
వా యమిబృందవంద్య! బసవా! బసవా! బసవా! వృషాధిపా!
106
ఉ. నోరికి వచ్చినట్టు నిను నూఱువిధంబులఁ బ్రస్తుతింతు నే
నేరుతు నేరఁ బొమ్మనక నీపయి నొచ్చెములేని మచ్చికన్‌
గారవమంద మత్ప్రణుతిఁ గైకొనఁగాఁ దగు గౌరవంబునన్‌
వారని కూర్మి పేర్మి బసవా! బసవా! బసవా! వృషాధిపా!
107
చ. బసవఁడు ప్రీతిఁ గైకొనియె భక్తిమెయిన్‌ రచియించినాఁడ నే
బసవపురాణమంచు మునుఁ బ్రస్తుతి సేయుదురట్లుగాన నీ
యసమదయాధురీణతకు నంకిలిపాటు ఘటిల్లకుండ నన్‌
వసిఁగొని బ్రోవుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
108
చ. అకుటిల లింగ జంగమ సమగ్రదయాకలిత ప్రసాది పా
లకురికి సోమనాథుఁడతి లౌల్యమునన్‌ బసవన్న దండ నా
యకునకు నొప్ప నీ శతక మర్పణచేసె నలిన్‌ బఠించు వా
రికి వినువారికిన్‌ గలుగు శ్రీయును నాయువు భుక్తిముక్తియున్‌.
109
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vR^ishhAdhipa shatakamu ( telugu andhra )