శతకములు వృషాధిప శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
ఉ. వేఁడిన మిండ జంగమము వెక్కసమందగఁ దత్సభాస్థలి
న్నాఁడట నారి వల్వొలువ నైజపుమానము దూలకుండఁగాఁ
బోఁడిమిఁ బట్టుపుట్టములు ప్రోవులు పెట్టిన పుణ్యమూర్తి నీ
వాఁడఁ జుమయ్య జియ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
71
చ. అరయఁగ సిద్ధరాము రజతాద్రిపయిన్‌ బసవాఖ్యు నిన్నుఁ బే
రరులున జంగమాజ్ఞ మెయినారయ నప్పుడు భక్తిపెంపు సొం
పరుదుగఁ బార్వతీశు హృదయాంబుజ కర్ణిక నత్తమిల్లు భా
స్వరుఁడగు నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా!
72
ఉ. వర్ణవిహీనుఁడంచు ద్విజవర్గము దా గళమెత్తి పల్కుడున్‌
వర్ణములెల్లఁజూడ శివనాగయగారి కరంబులందు స
ద్వర్ణుఁడితండనా నమృతధారలు చూపిన భక్తిరూఢ! నీ
వర్ణము నేఁజుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
73
ఉ. బిజ్జలు నర్థమంతయు బ్రీతిగ జంగమకోటికిచ్చె నా
నజ్జగతీశ్వరుండడుగ, నక్షయ బండరువా క్షణంబులో
నిజ్జగమెల్లఁ జోద్యపడ నిచ్చిన, లింగ సదర్థ నమ్ర వి
ద్వజ్జన నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా!
74
చ. ఉరు శివయోగనిద్ర మెయినున్న తఱిన్‌ ఫణిహారి యేఁగుడున్‌
మరచి చనంగ జంగమసమన్వితమై మును బ్రాణమేగి యు
ద్ధుర గతివారు వచ్చుటయుఁ దోడనె వచ్చిన జంగమాత్మ! నీ
వరవుఁడ నేఁజుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
75
ఉ. సంగయదేవుఁడర్థి నొక జంగమమై చనుదెంచి వేఁడ ను
ప్పొంగి లలాటలోచనము భోరున నద్దము వట్టి చూపుడున్‌
జెంగి యదృశ్యుఁడైన శివుఁ జేకొని యార్చిన యప్రతర్క్య! నీ
వంగడ మేఁజుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
76
ఉ. కర్ణవతంసమీక పెనఁగన్‌ సతిచెక్కిలి వ్రేయుడున్‌ మహా
తూర్ణతఁజెంది జంగమము దో స్థలమెత్తి పసిండియాకు సం
పూర్ణ నికృష్టభక్తి మెయిఁబొల్పుగ నిచ్చిన నిష్ప్రపంచ! నీ
వర్ణము నేఁజుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
77
ఉ. శృంగి పురోగమాఖిల విశేషవిషంబులు గూర్చి మండుచున్‌
బొంగి భుగిల్లు భుగ్గురను భూరివిషాగ్ని నిషాదులార్తులై
చెంగి చనన్‌ శివార్పితము చేసి భుజించిన సుప్రసాద! నీ
వంగడమేఁ జుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
78
ఉ. చిత్తజవైరి విక్రమముఁ జెప్పకు చెప్పకు త్రావనోడి తాఁ
గుత్తుక నిల్పెనంచుఁ గడు గ్రూరతరంబగు కాలకూటమున్‌
గుత్తుక బంటి గ్రోలిన యకుంఠితవిక్రమ చక్రవర్తి! భా
స్వత్తమ! నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా!
79
ఉ. తంగెటిజున్ను, ముంగటి నిధానము, పండిన కల్పవల్లి, ముం
గొంగున ముత్తియంబనఁగ, గూర్మి మనంబునఁ దొంగలింపగా
జంగమకోటికర్చనలు సల్పుచునున్న యగణ్యపుణ్య! నీ
వంగడమేఁ జుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
80
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vR^ishhAdhipa shatakamu ( telugu andhra )