శతకములు వృషాధిప శతకము
 1 11 21 31 41 51 61 71 81 91 101
చ. "హసుళెయరన్న రక్షిసు వుహారయ లెన్న వనీవనెందు మ
న్నిసువుడు నిమ్మడింగెరగ నిమ్మ ప్రసాదిత నిమ్మదాత్మ వే
కసిగతి" యంచు భక్తి నినుఁ 'గన్నడభాష' నుతింతు షడ్గుణ
శ్వసన పురాతనాత్మ! బసవా! బసవా! బసవా! వృషాధిపా!
61
చ. "దేవ పరీ తుహేచి గురుదేవ మణూను తరీ తుమ్హీచ గో
సావి తరీ తుహేచి తుమచాచ ప్రసాదయమీ కృపా కరా
హే వరదా" యటంచు నుతియించెద నిన్నును 'నారెభాష' దే
వా వినుతార్య లీల బసవా! బసవా! బసవా! వృషాధిపా!
62
చ. "అనయముఁ జేతులందు భవదంఘ్రి సరోజయుగం నమామి నె
మ్మనమున సంస్మరామి యను మాటల నిన్‌ వరివస్క రోమ్య హ"
మ్మనుచు 'మణిప్రవాళము'న నంకన సేయుదు భక్తలోక హృ
ద్వనజ విహారలోల బసవా! బసవా! బసవా! వృషాధిపా!
63
చ. "అరశుగిరి ప్రసాముదయానె భవద్గుణ వర్ణసల్పి నా
కొరువని నేస్మరామి సురయేశ్వరురే గణవర్య" యంచు ని
'ట్లరుదు మణిప్రవాళము'న నంకన సేయుదు నిన్ను మన్మనో
వర కరుణావిధేయ బసవా! బసవా! బసవా! వృషాధిపా!
64
ఉ. "వాయువు వొందు యీవిగతవావ అమా పరహంబ భౌ
న్యాయ విధేయమీశతరి యన్యన బాణు కళాభి" దంచు 'వా
గ్దేయ మణిప్రవాళము'నఁ దెల్లము నిన్ను నలంకరింతు దే
వా యమిబృంద వంద్య బసవా! బసవా! బసవా! వృషాధిపా!
65
ఉ. హాడువె దామహార సదినంఘ్రియుగ భ్రమగొండు సద్గుణా
మాడు వదర్చనంబిడె సమగ్రనుతిత్వయి సత్క్రియన్‌ దగన్‌
'గూఢమణిప్రవాళము'నఁ గోరి నుతింతును సంచితార్థముల్‌
పాడిగ నివ్వటిల్ల బసవా! బసవా! బసవా! వృషాధిపా!
66
చ. బలుపొడ తోలు చీరయును పాపసరుల్‌ గిలుపాడు కన్ను వె
న్నెల తలఁ జేఁదు కుత్తుకయు నిండినవేలుపుటేఱు పల్గు పూ
సలు గలఱేని లెంకవని 'జానుఁదెనుంగు'న విన్నవించెదన్‌
వలపు మదిన్‌ దలిర్ప బసవా! బసవా! బసవా! వృషాధిపా!
67
చ. తిరువడి నెమ్మనంబునను నే హృదయేశ్వర కింపరీయ తాం
బరి కరితంబు రాణి నిను బాహిరిఁ బోలుట శాసితాహ తా
వరద నెగిల్లె యంచు నిను బ్రస్తుతిసేయుదుఁ బెక్కుభాషలన్‌
వరద వివేకశీల బసవా! బసవా! బసవా! వృషాధిపా!
68
ఉ. సన్నుత జంగమాగమము స్వాతిజలంబులు భక్తనిమ్నగం
జెన్నుగ నీదు చూడ్కులను చిప్పల జొన్నలు ముత్తియంబులై
యున్న నొకయ్య మ్రుగ్గు నియమోన్నతి నిల్పిన ధన్యు నిన్ను శ
శ్వన్నుతులన్‌ భజింతు బసవా! బసవా! బసవా! వృషాధిపా!
69
ఉ. బల్లహు నొద్దనున్న నినుఁ బట్టణవీధులఁ జల్లలమ్ము చో
గొల్లతఁ జీరువాఱి కడుఁ గూర్మిమెయిన్‌ బసవా యనన్‌ భువిన్‌
ద్రెళ్ళఁగనీక పట్టిన యతిస్థిర సర్వగతైక భావ! మ
ద్వల్లభ! నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా!
70
AndhraBharati AMdhra bhArati - shatakamulu - vR^ishhAdhipa shatakamu ( telugu andhra )