| శతకములు | వృషాధిప శతకము |
|
| చ. |
వరగుణదీప్ర! భక్తజనవప్ర! తృణీకృతవిప్ర! తాత్త్వికాం కుర పదపద్మ భక్తిరసగుంభ! నిరాకృతదంభ! సద్గుణ స్ఫురిత విశిష్ట! శాంతగుణపుష్ట! నిరస్త నికృష్ట! మన్మనో వరద! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
41 |
| ఉ. |
లింగనిరూఢ! సంచితవిలీఢ! పరాక్రమగూఢ! మానసా సంగి వృషాంక! నిర్గళితశంక! నిరస్తకళంక! సంతతా భంగురపుణ్య! శీలముఖమణ్య త్రిలోకవరేణ్య! దేవ నీ వంగడమేఁ జుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
42 |
| చ. |
ఉరుతరభాగ్య! మన్మహితయోగ్య! జగత్త్రయమృగ్య! పాపసం హరణసమర్థ! నమ్రచరితార్థ! లసద్గుణసార్థ! భావ భా స్వర నయసాంద్ర! కీర్తిజితచంద్ర! వివర్జితతంద్ర! మన్మనో వరద! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
43 |
| చ. |
అసమవదాన్య మాన్య! ప్రణుతార్యయవార్య! రసజ్ఞతజ్ఞ! దు ర్వ్యసన విదూర! శూరగణవంద్య! యనింద్య! యమాఢ్య యాఢ్య! భ క్తిసుఖసమృద్ధ వృద్ధ! చిరదీప్తి పవిత్రచరిత్రపాత్ర! నా వసి గని ప్రోవుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
44 |
| చ. |
అసమశిలీముఖ స్ఫురదహంకృతికర్తన! కర్మకర్మఠా భ్యసన ధురీణ విభ్రమ! గణాధిప పాదసరోజ సంతత ప్రసృమరసౌర భోరుమకరంద కసిక్త వన క్రియాకళా వ్యసన! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
45 |
| చ. |
సురవరమల్ల! మల్లవిత సూత్రసుధాంబుధిఖేల! ఖేలసం గర కలకంఠ! కంఠమణినాయకభీమభుజంగ! జంగమ స్థిరతరనాథ! నాథక నిధీకృతరూప! విరూప సమ్మతా వర! కరుణాబ్ధి! ప్రోవు బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
46 |
| చ. |
సురవర పూజ్య! పూజ్యగుణశోభిత! శోభితరూప! రూప వి స్ఫురతరశీల! శీలగుణపుంగవ! పుంగవ సత్త్వ! సత్త్వసం వర పరవాద! వాద భయవర్జిత పాపవిచారచార! ఈ శ్వర సమ! నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
47 |
| చ. |
ఇహపరసిద్ధ! సిద్ధ వృషభేశ్వర! ఈశ్వర భక్త! భక్త హృ ద్గహన విలోక! లోకహిత కారణ! కారణజన్మ! జన్మదో షహరణ దక్ష! దక్షరిపుసన్నిభ! సన్నిభరూప! రూప ని ర్వహణ! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
48 |
| ఉ. |
రుద్ర గణాదిరుద్ర! వినిరూపిత లింగసుఖాదిసంద్ర య చ్ఛిద్ర! దయాసముద్ర! సవిశేష పరాక్రమ వీరభద్ర! య క్షుద్ర జనావళీభవ నిషూదన రౌద్ర! సమస్త భక్త దే వ ద్రుమ! నీవె దిక్కు బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
49 |
| చ. |
విరచిత శుద్ధసాళగ నవీన మృదుస్వర మంద్ర మధ్య తా ర రుచిర దేశిమార్గ మధురస్వర గీతసుధాతరంగిణీ తరళ తరంగజాల సముదంచిత కేళివిలోల సంగమే శ్వర శరణయ్య నీకు బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
50 |