| శతకములు | వృషాధిప శతకము |
|
| చ. |
పసిగ మెయిన్ వృషాధిపుని ప్రాణము జంగమకోటి ప్రాణముల్ మసలక యెత్తుచున్ భువన మాన్యచరిత్రతఁ దేజరిల్లు న మ్ముసిఁడిగ చౌడరాయనికి మున్నిటి భృత్యుఁడ! నిన్భజింతు న న్వసిగొని ప్రోవుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
91 |
| ఉ. |
ఎన్నఁగ జంగమంబుఁ దన యింటికి నెప్పుడు వచ్చునప్డు దాఁ గన్నము వెట్టితెచ్చి యధికంబగు నర్థము వానికిచ్చు నా కన్నడబ్రహ్మ సంయమికి గాదిలిభృత్యుఁడవైన నిన్ను శ శ్వన్నుతులన్ భజింతు బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
92 |
| ఉ. |
అసురవృత్తిఁ జూపఱు భయంపడి మ్రొక్కఁ బ్రసాద వహ్నిచే భూసురులిండు లన్నియును బొగ్గుల ప్రోఁకలుఁ సేయు ధూత సం త్రాసుల బిబ్బబాచయల దాసియనన్ విలసిల్లు సద్గుణా వాస! శరణ్యమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
93 |
| ఉ. |
సుంకపుఁ బైఁడి భక్తులకుఁ జూరలు విడ్వఁ బసిండి క్రాగులన్ శంకరుఁ బూటవెట్టి నరనాయకుచేతను మ్రొక్కుగొన్న యా సుంకర బంకిదేవునకు సూనుడవైన ప్రసాది! దేవ! నీ వంకకుఁ ద్రిప్పుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
94 |
| ఉ. |
దివ్యవిమానపంక్తి దివిఁ దేజరిలన్ రజతాద్రికిన్ జగ త్సేవ్యముగాఁగ మున్ను దనచే మృతిబొందు మృగాళిఁ బుచ్చు సం భావ్యుఁడు తెన్గు జొమ్మయకుఁ బ్రాణసఖుండగు నిన్నుఁ గొల్తు దే వా వ్యసనాది దూర బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
95 |
| ఉ. |
చెన్నగు ప్రాణ లింగరతిచేగ ప్రసాదము పుట్టినిల్లు న త్యున్నత భక్తిసీమ శివయోగ సమగ్రత కల్మియైన మా యన్నకు నాది చెన్నబసవన్నకు సద్గురుఁడైన నిన్ను శ శ్వన్నుతులన్ భజింతు బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
96 |
| చ. |
అడరఁగఁ గళ్ళుచేసి రుచిరాన్నము లాదటనంది యిచ్చుచోఁ గడిఁగడి నందుకొంచు నతికాంక్షమెయి\న్ శివుఁడారగింపఁగా సడినను భక్తుఁడా సురియ చౌడయగారి ప్రసాది దేవ నీ వడుగఁ జుమయ్య జియ్య! బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
97 |
| ఉ. |
జంగమమారగింపక విషంబును మీకు ననర్హమంచుఁ దా ముంగల నారగించిన సముద్ధతభక్తియుతుండు సత్ప్రసా దాంగుఁడు శృంగిబొప్పయకు నగ్గలమైన మహానుభావ నీ వంగడమేఁ జుమయ్య బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
98 |
| చ. |
కొఱటను లేఁత పత్తిరియ గొడ్డునఁ బాలును రేయి జంగమం బఱిముఱివేఁడినన్ బడసి యా క్షణమాత్రన యిచ్చినట్టి యా మొఱటదవంక దేవునకు ముద్దుతనూజుఁడవైన నిన్ను నే వఱలఁగఁ బ్రస్తుతింతు బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
99 |
| చ. |
అనయము భక్తులీడ్యకులులంచును వేదములా ద్విజోత్తముల్ విన నుతియింపఁ గుక్కఁ జదివించిన హావినహళ్ళికళ్ళి దే వునకు ననుంగువాడవని యుత్సుకతన్ నుతియింతు భక్తహృ ద్వనజవిహారలోల బసవా! బసవా! బసవా! వృషాధిపా! |
100 |