శతకములు కుమార శతకము
1 11 21 31 41 51 61 71 81 91 101
క. చేయకుము కాని కార్యము
పాయకుము మఱిన్‌ శుభం బవని భోజనమున్‌
జేయకుము రిపు గృహంబునఁ,
గూయకు మొరుమనసు నొచ్చుఁ గూఁత కుమారా!
21
క. పిన్నల పెద్దలయెడఁ గడు
మన్ననచే మెలఁగు సుజన మార్గంబుల నీ
వెన్నికొని తిరుగు చుండిన
నన్నియెడల నెన్నఁబడుదు వన్న! కుమారా!
22
క. తనకును విద్యాభ్యాసం
బును జేసిన వానికన్న బొలుపుఁగ బదిరె
ట్లను దూఁగుఁ దండ్రి, వానికి
జననియుఁ బదిరెట్లు తూఁగు జగతి కుమారా!
23
క. తమ్ములు తమ యన్న యెడ భ
యమ్మును భక్తియును గలిగి యారాధింపన్‌
దమ్ముల నన్నయు సమ్మో
దమ్మునఁ బ్రేమింపఁ గీర్తి దనరుఁ గుమారా!
24
క. అప్పం దన తల్లిగ మే
లొప్పం గని జరుపవలయు నుర్వీస్థలిఁ జి
న్నప్పుడు చన్నిడి మనిపిన
యప్పడఁతియు మాతృతుల్య యండ్రు కుమారా!
25
క. బూటకపు వర్తనముఁ గని,
జూటరి వీఁడనుచుఁ దప్పఁ జూతురుగా! యా
బాటను విడి సత్యము మది
పాటించి నటించువాఁడె నరుఁడు కుమారా!
26
క. తనయుఁడు చెడుగైయుండిన
జనకుని తప్పన్నమాట సత్యమెఱుఁగుదు గా
వున నీ జననీ జనకుల
కు నపఖ్యాతి యగురీతి గొనకు కుమారా!
27
క. తల్లిని దండ్రిని సహజల
నల్లరఁ బెట్టినను వార లలుగుచు నీపై
నుల్లముల రోయుచుందురు
కల్లరి వీఁడనుచుఁ గీర్తి గందఁ గుమారా!
28
క. లోకులు తనుఁ గొనియాడ వి
వేకి యదియు నింద గాక విననొల్లఁడు సు
శ్లోకుల చరితం బిట్టిది
చేకొనవలె నట్టి నడత చిన్ని కుమారా!
29
క. ధరణిని బరోపకారా
చరణవ్రత నిష్ఠ నెపుడు సలుపుము నీ కా
తెఱఁగుపవాసాది వ్రత
వర కర్మము కంటె మేలు వచ్చుఁ గుమారా!
30
AndhraBharati AMdhra bhArati - shatakamulu - kumAra shatakamu - telugu Satakamulu tenugu andhra ( telugu andhra )